Share News

ఉపాధ్యాయులకు హ్యాండ్‌ బుక్స్‌

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:41 AM

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల పెంపే లక్ష్యంగా విద్యా శాఖ ప్రణాళికలు రూపొందించింది.

ఉపాధ్యాయులకు హ్యాండ్‌ బుక్స్‌

  • బోధనపై గైడ్‌ లైన్స్‌

  • ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం దృష్టి

  • నేడు క్లస్టర్ల వారీగా ఉపాధ్యాయుల సమావేశాలు

  • జిల్లా, మండల స్థాయిల్లో అకడమిక్‌ ఫోరాలు ఏర్పాటు

విశాఖపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల పెంపే లక్ష్యంగా విద్యా శాఖ ప్రణాళికలు రూపొందించింది. కొత్తగా వచ్చిన సాంకేతిక అంశాలను జోడించి వినూత్నంగా బోధన చేయడంపై దృష్టిసారించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే దీనిపై ఫోకస్‌ పెట్టాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు ఆ దిశగా జిల్లా విద్యాశాఖలకు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ మేరకు అకడమిక్‌ పాలసీని రూపొందించిన విద్యా శాఖ, ఉపాధ్యాయులకు హ్యాండ్‌ బుక్స్‌ అందజేసింది. విద్యా సంవత్సరంలో ప్రతి తరగతికి సంబంధించి బోఽధించాల్సిన పాఠ్యాంశాలపై షెడ్యూల్‌ రూపొందించింది. ఇప్పటివరకూ ఉపాధ్యాయులే సొంతంగా లెసన్‌ ప్లాన్‌ రూపొందించుకుని, నోట్స్‌ రాసుకుని దాని ఆధారంగా బోధన చేస్తున్నారు. అయితే టీచర్లంతా లెసన్‌ ప్లాన్‌ రూపొందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకున్న విద్యా శాఖ, ప్రతి సబ్జెక్టుకు సంబంధించి అన్ని అంశాలతో కూడిన హ్యాండ్‌ బుక్స్‌ ముద్రించి టీచర్లకు అందజేసింది. సిలబస్‌ మేరకు విద్యార్థులకు ఎలా బోధన చేయాలి?, పాఠాలు పిల్లలకు అర్థమయ్యేలా ఏమి చేయాలి?...అనే అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కొత్తగా ఇచ్చిన హ్యాండ్‌ బుక్స్‌ టీచర్లకు కరదీపిక వంటిదని అడవివరం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇమంది పైడిరాజు అన్నారు. ఇది విద్యార్థులు, టీచర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

కాగా అకడమిక్‌ అంశాలపై పట్టు సాధించేందుకు అనువుగా ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఏర్పాటుచేసిన క్లస్టర్‌ సమావేశాలు శనివారం జరగనున్నాయి. జిల్లాలో ఏర్పాటుచేసిన 51 క్లస్టర్‌ పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ సమావేశాలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించి, అనంతరం భోజనం పెట్టి ఇళ్లకు పంపించనున్నారు. జిల్లాలో 568 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 51 క్లస్టర్లు ఏర్పాటుచేశారు. ప్రతి క్లస్టర్‌ పరిధిలో ఉన్నత, యూపీ, ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఈ సమావేశాలకు హాజరుకావాలి. ఈ సమావేశాల్లో సబ్జెక్టు వారీగా టీచర్లు విడిపోయి ఒక్కొక్క గదిలో సమావేశం నిర్వహించి అకడమిక్‌ అంశాలపై చర్చించాలి. వచ్చే సమావేశంలోగా అంటే దాదాపు నెల రోజుల వరకు విద్యార్థులకు బోధన చేయాల్సిన అంశాలపై చర్చించాలి. ప్రతి సబ్జెక్టుకు సీనియర్‌ టీచర్‌ను రీసోర్స్‌ పర్సన్‌గా నియమించారు. విద్యార్థుల సామర్థ్యాల పెంపుతోపాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు దీటుగా తయారుచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా టీచర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా కొత్తగా జిల్లా, మండల స్థాయిల్లో అకడమిక్‌ ఫోరం ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులు, పాఠశాల అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టేందుకు ఈ ఫోరాలు ఏర్పాటుచేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Updated Date - Jul 19 , 2025 | 12:41 AM