జీవీఎంసీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:56 AM
చిన్నారులు, యువత కోసం వేసవిలో క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు.
అధికారులకు మేయర్ ఆదేశాలు
విశాఖపట్నం, ఏప్రిల్ 29 (ఆంధ్ర జ్యోతి):
చిన్నారులు, యువత కోసం వేసవిలో క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు. దీనికోసం రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి, 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావుతోపాటు అధికారులతో మంగళవారం చర్చించారు. చిన్నారులు, యువతకు గత ఏడాది మాదిరిగానే 33 క్రీడాంశాల్లో నిపుణులైన వారితో శిక్షణ ఇప్పించాలని, శిబిరాల ఏర్పాటు, నిధుల వ్యయం పారదర్శకంగా ఉండాలని స్పష్టంచేశారు. వచ్చే నెల నాలుగో తేదీన క్రీడా సంఘాలు, కోచ్‌లతో సమావేశం ఏర్పాటుచేద్దామని, వారి సలహాలు, సూచనల ప్రకారం శిక్షణ శిబిరాలకు సంబంధించిన కార్యచరణ విడుదల చేద్దామని మేయర్ వివరించారు.
ఆరోగ్య శాఖ నియామకాలపై విచారణ
విశాఖపట్నం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి):
వైద్య, ఆరోగ్య శాఖలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మేల్) పోస్టుల భర్తీలో రోస్టర్ ప్రక్రియను సరిగా పాటించలేదంటూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ నియమించిన కమిటీ మంగళవారం విచారణ చేపట్టింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 2003లో 148 పోస్టులను భర్తీచేశారు. ఆ పోస్టుల భర్తీలో రోస్టర్‌తోపాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోలేదంటూ ఒకరు ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ విచారణ నిమిత్తం సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.రామారావు, జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి, జిల్లా ఉపాధి కల్పన అధికారి సుబ్బారెడ్డిలతో కమిటీ వేశారు. ఈ కమిటీ మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయానికి వెళ్లి అప్పటి నియామకానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించింది. ఆరోగ్యశాఖ అధికారులతోపాటు ఫిర్యాదుదారుడితో కమిటీ సభ్యులు మాట్లాడి పలు వివరాలను సేకరించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నారు. మరోసారి కమిటీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
నేడు పాలీసెట్
9,383 మంది విద్యార్థులు...22 కేంద్రాలు
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కంచరపాలెం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ‘పాలీసెట్’ బుధవారం జరగనుంది. పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పాలీసెట్ జిల్లా కన్వీనర్ డాక్టర్ కె.నారాయణరావు వెల్లడించారు. జిల్లాలో గల భీమునిపట్నం, పెందుర్తి, విశాఖ అర్బన్ రీజియన్స్ నుంచి 9,383 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని, వారి కోసం 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరగనున్నది. పది గంటల నుంచి విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. 11 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలకు అనుమతించబోమని, ఈ విషయం విద్యార్థులు గమనించి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని నారాయణరావు సూచించారు.