Share News

జీవీఎంసీకి మూడు జాతీయ స్థాయి అవార్డులు

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:40 AM

జీవీఎంసీకి జాతీయ స్థాయిలో మూడు అవార్డులు లభించాయి.

జీవీఎంసీకి మూడు జాతీయ స్థాయి అవార్డులు

బాల్యం, సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌ కేటగిరీల్లో ప్రథమ స్థానం

‘ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌’ కేటగిరీలో ద్వితీయ బహుమతి

విశాఖపట్నం, డిసెంబరు 13 (ఆంధ్ర జ్యోతి):

జీవీఎంసీకి జాతీయ స్థాయిలో మూడు అవార్డులు లభించాయి. దేశంలోని పట్టణ సంస్థల పనితీరుపై ‘ఆలిండియా పబ్లిక్‌ రిలేషన్స్‌ క్యాంపెయిన్‌-47’ పేరుతో అధ్యయనం చేసిన ‘పబ్లిక్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ ఈ అవార్డులను ప్రకటించింది. నగరవాసులకు జీవీఎంసీ అందజేస్తున్న సేవలు, కల్పిస్తున్న సదుపాయాలతోపాటు చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టులపై సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో ‘బెస్ట్‌ సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌’ విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి బహుమతి దక్కింది. అలాగే మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయంవృద్ధికి తోడ్పడేలా వివిధ పథకాలను అమలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను నగరంలోని మహిళలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించడం, ప్రోత్సహించడంతోపాటు ఆసక్తి చూపించే వారికి వాటిని పొందేలా యూసీడీ విభాగం ద్వారా సహాయసహకారాలను అందిస్తున్నందుకు ‘ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌’ కేటగిరీలో ద్వితీయ బహుమతి లభించింది. ఐదేళ్లలోపు పిల్లల్లో సృజనాత్మక పెంపొందించేలా ప్రత్యేక సిలబస్‌ను తయారుచేసి బాల్యం కేంద్రాలకు పంపించడం, పిల్లలకు చదువుపై ఆసక్తిపెరిగేలా వినూత్నమైన బోధన విధానాలను అవ లంబిస్తుండడంతో ‘బాల్యం’ కేటగిరీలో జాతీయ స్థాయిలో మొదటి బహుమతి దక్కింది. ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో ఆదివారం జరిగే కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ చేతుల మీదుగా జీవీఎంసీ అదనపు కమిషనర్‌ రమణమూర్తి అవార్డులను అందుకోనున్నారు.

Updated Date - Dec 14 , 2025 | 12:40 AM