విచక్షణ కోల్పోయిన జీవీఎంసీ అధికారి
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:29 AM
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్) వాహన డ్రైవర్‌పై జీవీఎంసీ జోనల్ కమిషనర్ చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది.
క్లాప్ వాహన డ్రైవర్‌పై చేయి చేసుకున్న భీమిలి జోనల్ కమిషనర్
భీమునిపట్నం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్) వాహన డ్రైవర్‌పై జీవీఎంసీ జోనల్ కమిషనర్ చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. మిగిలిన డ్రైవర్లంతా ఆందోళనకు దిగారు. చివరకు జోనల్ కమిషనర్ క్షమాపణ చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. సోమవారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జోన్-1 రెండో వార్డు పరిధిలోని ఆదర్శనగర్-2లో పారిశుధ్య పనులను పరిశీలించడానికి జడ్సీ అయ్యప్పనాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు క్లాప్ వాహన డ్రైవర్ ఇంటి శ్రీను సరిగ్గా పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనుపై జడ్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దూషించడమే కాకుండా చేయి చేసుకున్నారు. ఈ విషయం జోన్‌లో ఉన్న క్లాప్ వాహన డ్రైవర్లందరికీ తెలియడంతో వారు జోనల్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్‌ను దుర్భాషలాడి, చేయి చేసుకున్న జడ్సీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన సమాచారం అందుకున్న భీమిలి ఎస్‌ఐ గౌరి, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జోనల్ కమిషనర్‌తో సీఐటీయూ నాయకుడు మూర్తి, క్లాప్ వాహన డ్రైవర్లు చర్చలు జరిపారు. శ్రీను సరిగ్గా పని చేయడం లేదని స్థానికులతో పాటు ఆ ప్రాంత శానిటేషన్ కార్యదర్శి విజయలక్ష్మి చెప్పడంతో చేయి చేసుకోవాల్సి వచ్చిందని, ఏదిఏమైనా తప్పు జరిగిందని క్షమాపణ చెప్పారు. దీంతో క్లాప్ వాహన డ్రైవర్లు ఆందోళన విరమించారు.