ఉల్టా...పల్టా
ABN , Publish Date - Jun 06 , 2025 | 01:07 AM
జీవీఎంసీ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరగనున్నది. మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడం, అంతేకాకుండా కౌన్సిల్‌లో ఇంతవరకూ విపక్షంగా ఉన్న కూటమి అధికారపక్షంగా, అధికారపక్షమైన వైసీపీ విపక్షంగా వ్యవహరించనుండడంతో అందరిలోనూ ఒకింత ఆసక్తి నెలకొంది.
జీవీఎంసీలో తారుమారైన అధికార, ప్రతిపక్ష హోదాలు
నేడు కౌన్సిల్ సమావేశం
మేయర్‌గా పీలా ఎన్నికైన తర్వాత ఇదే మొదటి సమావేశం
వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఎండగట్టాలని కూటమి యోచన
నైట్‌ఫుడ్‌కోర్ట్, ఆస్తిపన్ను తగ్గింపు హామీపై నిలదీయాలని వైసీపీ నిర్ణయం
కూటమిలోనే కొందరు సభ్యులు విపక్షంగా వ్యవహరించే అవకాశం
27 అంశాలతో అజెండా
టేబుల్ అజెండాగా మరికొన్ని...
విశాఖపట్నం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరగనున్నది. మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడం, అంతేకాకుండా కౌన్సిల్‌లో ఇంతవరకూ విపక్షంగా ఉన్న కూటమి అధికారపక్షంగా, అధికారపక్షమైన వైసీపీ విపక్షంగా వ్యవహరించనుండడంతో అందరిలోనూ ఒకింత ఆసక్తి నెలకొంది. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే కౌన్సిల్ సమావేశం కోసం ఇప్పటికే 27 అంశాలతో అజెండాను తయారుచేసి సభ్యులకు అందజేశారు. టేబుల్ అజెండాగా మరికొన్ని అంశాలను కౌన్సిల్‌లో చర్చకు పెట్టే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో జీవీఎంసీలో జరిగిన అవినీతి, అక్రమాలను కూటమి సభ్యులు సభలో బయటపెట్టే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు అధ్యక్షతన ఆ పార్టీ కార్పొరేటర్లంతా గురువారం షాడో మీటింగ్ ఏర్పాటుచేసుకుని కౌన్సిల్‌లో ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చించారు. ఎన్నికల సమయంలో ఆస్తి పన్ను తగ్గింపుపై కూటమి నేతలు హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాలని డిమాండ్ చేయాలని నిర్ణయించారు. అలాగే పాతజైలురోడ్డులోని నైట్ ఫుడ్‌కోర్ట్‌కు జీవీఎంసీ అనుమతి లేకపోయినా వైసీపీ నేతలే వెనకుండి కొనసాగించారని కూటమి నేతలు గతంలో ఆరోపించారని, ఇప్పుడు వారే అధికారపక్షంగా ఉన్నందున తక్షణం దానిని తొలగించాలని డిమాండ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అదేవిధంగా దాదాపు ఐదు నెలలుగా జీవీఎంసీకి కమిషనర్‌ను నియమించకపోవడాన్ని నిరసిస్తూ ప్లకార్డులతో నిరసన తెలపాలని నిర్ణయించినట్టు సమాచారం.
మరోవైపు కూటమి పార్టీలకు చెందిన కొందరు కార్పొరేటర్లు సైతం కౌన్సిల్‌లో ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆరు నెలల తర్వాత జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో తమ వార్డులకు సంబంధించిన అనేక అభివృద్ధి పనుల ఆమోదానికి ప్రతిపాదిస్తే వాటిని అజెండాలో చేర్చకపోవడంతో కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కార్పొరేటర్లు కోడివ్యర్థాల టెండర్లు, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకోవడం వంటి అంశాలపై నిలదీయాలని మరికొందరు భావిస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్‌గా గుర్తింపు పొందిన జీవీఎంసీకి ఐదు నెలలుగా కమిషనర్‌ను నియమించకపోవడాన్ని కూడా కౌన్సిల్‌లో ప్రస్తావించా లని నిర్ణయించినట్టు తెలిసింది. ఆరిలోవ, మల్కాపురం ఫస్ట్ రిఫరల్‌యూనిట్ (జీవీఎంసీ ఆస్పత్రులు)ను బెహరా గ్రూపునకు అప్పగించడంలో లొసుగులపై కూడా కూటమి సభ్యులు చర్చకు లేవనెత్తే అవకాశం ఉంది. గత ఐదేళ్లలో జీవీఎంసీ పరిధిలో జారీచేసిన టీడీఆర్‌లు, కూర్మన్నపాలెంలో ఎంవీవీ, ఎంకే అపార్టుమెంట్ నిర్మాణంలో అక్రమాలపై కూడా చర్చకు పట్టుబట్టాలని కూటమిలోని కార్పొరేటర్లు కొందరు భావిస్తున్నారు. కూటమి కార్పొరేటర్లే కౌన్సిల్‌లో విపక్ష పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తుండడంతో సమావేశం ఎలా జరుగుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.