Share News

జీవీఎంసీ స్థలం కబ్జా

ABN , Publish Date - Dec 11 , 2025 | 01:32 AM

జీవీఎంసీకి చెందిన విలువైన స్థలాలు ఒక్కొక్కటిగా అన్యాక్రాంతమైపోతున్నాయి. తాజాగా 34వ వార్డు పరిధిలో రామకృష్ణా పార్కును ఆనుకుని ఉన్న సుమారు వెయ్యి గజాల స్థలాన్ని కొందరు ఆక్రమించి అద్దెకు ఇచ్చారంటూ స్థానికులు పలుమార్లు జీవీఎంసీ అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అయినా చర్యలకు మీనమేషాలు లెక్కిస్తుండడం అనుమానాలకు దారితీస్తోంది.

జీవీఎంసీ స్థలం కబ్జా

34వ వార్డులో పార్కు పక్కనున్న వెయ్యి గజాలు ఆక్రమణ

అధికారులకు పలుమార్లు స్థానికుల ఫిర్యాదు

అయినా చర్యలు శూన్యం

సుమారు రూ.ఐదు కోట్లు ఉంటుందని అంచనా

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీకి చెందిన విలువైన స్థలాలు ఒక్కొక్కటిగా అన్యాక్రాంతమైపోతున్నాయి. తాజాగా 34వ వార్డు పరిధిలో రామకృష్ణా పార్కును ఆనుకుని ఉన్న సుమారు వెయ్యి గజాల స్థలాన్ని కొందరు ఆక్రమించి అద్దెకు ఇచ్చారంటూ స్థానికులు పలుమార్లు జీవీఎంసీ అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అయినా చర్యలకు మీనమేషాలు లెక్కిస్తుండడం అనుమానాలకు దారితీస్తోంది.

జీవీఎంసీ 34వ వార్డులో రామకృష్ణా రైతుబజార్‌ సమీపాన నగర పాలక సంస్థకు పార్కుతోపాటు మరికొంత స్థలం ఉంది. పార్కు పక్కనున్న స్థలం పరిరక్షణపై అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించారు. స్థానికంగా పలుకుబడి కలిగిన ఒక రాజకీయ నాయకుడు ఆ స్థలంలో 330 గజాలను తాను కొనుగోలు చేశానని ప్రకటించుకున్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఎవరూ పత్రాలు చూపించాలని అడిగే సాహసం చేయలేదు. తర్వాత తాను కొనుగోలు చేసినట్టు చెప్పిన స్థలానికి, పార్కుకు మధ్యలో ఉన్న జీవీఎంసీకి చెందిన సుమారు వెయ్యి గజాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ స్థలం విలువ ఇప్పుడు మార్కెట్‌లో దాదాపు రూ.ఐదు కోట్లు ఉంటుందని అంచనా. తర్వాత ఆ స్థలం అంతటినీ వేరొకరికి అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై స్థానికులు కొందరు జీవీఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ఇటీవల జనసేనకు చెందిన ఒక కార్పొరేటర్‌ జీవీఎంసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తి ఆక్రమించుకుని అద్దెకు ఇచ్చినట్టు పేర్కొంటూ ఆధారాలతో జీవీఎంసీ కమిషర్‌ర్‌ కేతన్‌గార్గ్‌కు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి జీవీఎంసీకి చెందిన ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు. అయినా ఇంతవరకూ దీనిపై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రూ.కోట్లు విలువైన జీవీఎంసీ స్థలాన్ని పరిరక్షించాలని ఆధారాలతో స్థానికులు పోరాడుతున్నాసరే అధికారులు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Dec 11 , 2025 | 01:32 AM