జీవీఎంసీకి స్వచ్ఛ అవార్డు
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:34 AM
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్‌గార్గ్ ‘స్వచ్ఛ’ అవార్డు అందుకున్నారు.
విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్‌గార్గ్ ‘స్వచ్ఛ’ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాసరావు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడుతూ నగర ప్రజలు, నివాసిత సంక్షేమ సంఘాలు, జీవీఎంసీ అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికుల భాగస్వామ్యంతో ఈ అవార్డు దక్కిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆశయ సాధన దిశగా ప్రారంభమైన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ముందుకు తీసుకువెళతామని కమిషనర్ కేతన్‌గార్గ్ అన్నారు. స్వచ్ఛ మునిసిపాలిటీల కేటగిరీలో జీవీఎంసీ (స్వచ్ఛ సర్వేక్షణ్ స్పెషల్)కి రాష్ట్రస్థాయి అవార్డు లభించిన విషయం తెలిసిందే.
14 నుంచి 19 వరకు షాపింగ్ ఫెస్టివల్
జీఎస్టీ 2.0పై అవగాహన కోసం నిర్వహణ
కలెక్టర్ హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):
జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ప్రయోజనం కలిగించేలా ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ద్విచక్ర వాహనాలు, కార్లు, గృపహోకరణాలు, ఫర్నీచర్, మొబైల్స్ దుకాణాల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. జీఎస్టీ 2.0 అమలుకు వ్యాపారస్తులు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఫెస్టివల్‌కు వచ్చే కస్టమర్లకు అవగాహన కల్పించాలన్నారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండేలా ఫెస్టివల్ వేదిక ఖరారుచేస్తామన్నారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుచేస్తామని, చివరిరోజు బాణసంచా షో ఉంటుందన్నారు. సమావేశంలో జేసీ మయూర్‌అశోక్, పన్నుల శాఖ అడిషినల్ కమిషనర్ శేఖర్, జిల్లా పర్యాటకాధికారి మాధవి తదితరులు పాల్గొన్నారు.