Share News

జీవీఎంసీ విస్తరణ?

ABN , Publish Date - Sep 18 , 2025 | 01:24 AM

క్యాన్సర్‌ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని, వ్యాధి పట్ల నెలకొన్న భయాలు, ఆందోళనలను తొలగించాలని వైద్యులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు.

జీవీఎంసీ విస్తరణ?

  • ముఖ్యమంత్రి వద్ద కొందరు ఎమ్మెల్యేల ప్రతిపాదన

  • జిల్లా మొత్తాన్ని నగర పాలక సంస్థ పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై చర్చ

  • జిల్లాలో ఎస్‌.కోట విలీనం అంశంపై కూడా...

  • నగరంలో ప్రజారోగ్యం, వీధి లైట్లు, తాగునీరు, రోడ్ల నిర్వహణపై సీఎం ఆరా

  • రోజువారీ పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్‌కు సూచన

  • విశాఖ విమల విద్యాలయం సమస్య, పోలీస్‌ కమిషనరేట్‌లో ఖాళీల భర్తీ గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యే పల్లా

విశాఖపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిని విస్తరించాలని నగర ఎమ్మెల్యేలు కొందరు బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందు ప్రతిపాదించారు. ఇదే సందర్భంగా కేవలం 11 మండలాలతో ఉన్న జిల్లాను విస్తరిస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చ సాగింది.

నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎంను తొలుత బస్సులో జిల్లా ఎమ్మెల్యేలు కలిశారు. కేవలం నాలుగు గ్రామీణ మండలాల (పెందుర్తి, భీమునిపట్నం సగం సగం, ఆనందపురం, పద్మనాభం పూర్తిగా) కోసం జడ్పీ, జిల్లా పంచాయతీ, ఇలా పలు గ్రామీణ సంబంధిత కార్యాలయాలు ఉన్నాయని సీఎం వద్ద పెందుర్తి ఎమ్యెల్యే పంచకర్ల రమేష్‌బాబు ప్రస్తావించారు. ప్రధానంగా పెందుర్తి మండలం దాదాపు జీవీఎంసీలో ఉంటుందని చెబుతూ గ్రామీణ ప్రాంతంగా ఉన్న పంచాయతీలను కూడా నగర పాలక సంస్థలో విలీనం చేయాలని కోరారు. ఆనందపురం, భీమిలి రూరల్‌, పద్మనాభం మండలాలను కూడా జీవీఎంసీలో విలీనం చేస్తే జిల్లా మొత్తం ఒక నగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుందని, ఇదే విషయం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గతంలో ప్రస్తావించారని పేర్కొన్నారు. అందుకు ముఖ్యమంత్రి స్పందిస్తూ పెందుర్తి ఎమ్మెల్యే ప్రతిపాదనను పరిశీలించాలని కలెక్టర్‌కు సూచించారు. అలాగే 11 మండలాలున్న జిల్లా పరిధిని కొంతమేర విస్తరించాలని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తూ ఎస్‌.కోట నియోజకవర్గాన్ని విశాఖలో విలీనం చేయాలని అక్కడ ప్రజలు కోరుతున్నారని వివరించారు. ఈ దశలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవీఎంసీలో ఉన్న లక్షల మంది ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా మౌలిక వసతులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జీవీఎంసీని విస్తరిస్తే మంచిదేనని, అప్పుడు జిల్లా మొత్తం నగర పాలక సంస్థ పరిధిలో ఉంటుందన్నారు. పద్మనాభం ఒక్కటే నగరానికి దూరంగా ఉన్నందున ఆ ఒక్క మండలాన్ని గ్రామీణ ప్రాంతంగా ఉంచలేమన్నారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే సమయానికి జిల్లాలోని నాలుగు మండలాలను జీవీఎంసీలో విలీనం చేయకపోతే మరోసారి జడ్పీ ఎన్నికలు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా జరిగే అవకాశం ఉందని పంచకర్ల సందేహం వ్యక్తంచేశారు. ఇదిలావుండగా నగరంలో కార్యక్రమాలు పూర్తయిన అనంతరం విమానాశ్రయానికి చంద్రబాబునాయుడుతో పాటు వాహనంలో పల్లా శ్రీనివాసరావు, కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌, మరొకరు వెళ్లారు. ఈ సందర్భంగా నగరంలో పాలన, ప్రజారోగ్యం, వీధి లైట్లు, తాగునీరు, రోడ్లు నిర్వహణ ప్రధానంగా గుంతలు పూడ్చడం గురించి కలెక్టర్‌ను అడిగి సీఎం తెలుసుకున్నారు. రోజువారీ పారిశుధ్యం బాగాలేకపోయినా, చెత్త తరలింపులో జాప్యం కనిపించినా ప్రజల నుంచి అసంతృప్తి వస్తుందని స్పష్టంచేశారు. వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. వీధి లైట్లు నిర్వహణ, తాగునీటి సరఫరాపై రోజువారీ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలను పల్లా శ్రీనివాసరావు ప్రస్తావించారు. తాజా బదిలీల్లో నగరం నుంచి ఒక డీసీపీని బదిలీ చేసినా ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదని మరో ఏడీసీపీ, ఐదు ఏసీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. నగరానికి కనీసం ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను కేటాయించాలని, మిగిలిన అధికారుల ఖాళీలను భర్తీచేయాలని కోరగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో ఉక్కునగరంలో మూసివేసిన విశాఖ విమల విద్యాలయాన్ని తిరిగి తెరిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకుగాను అక్కడ పనిచేసే ఉపాధ్యాయులను గ్రాంటు ఇన్‌ఎయిడ్‌ ద్వారా జీతాలు ఇవ్వాలని కోరగా సీఎం పరిశీలిస్తామన్నారు. సుమారు 1,600 మంది విద్యార్థులున్న పాఠశాలను ప్రభుత్వం తీసుకోవాలనే ప్రతిపాదనను పరిశీలిస్తానన్నారు. కాగా ఈ పర్యాయం వచ్చినప్పుడు నగర కేడర్‌తో సమావేశం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుంటానని పల్లాకు చంద్రబాబు హామీ ఇచ్చారు. కేడర్‌ను ఎప్పటికప్పుడు కలిసి వారి సమస్యలు తెలుసుకోవాల్సి ఉందని, కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక కష్టనష్టాలకు ఓర్చి పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు.


మహిళా భద్రతలో విశాఖ టాప్‌

వచ్చే నెలలో గూగుల్‌..

డేటా సెంటర్‌ ఏర్పాటుకు రెడీ

రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌కు జీఎంఆర్‌ను,

ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అనుసంధానం

ఆగస్టులో భోగాపురం విమానాశ్రయంలో ఆపరేషన్స్‌

సీఎం నారా చంద్రబాబునాయుడు

విశాఖపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):

మహిళలకు భద్రత కల్పించే నగరంగా విశాఖపట్నం మొదటి స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసించారు. ఒకరోజు పర్యటనకు బుధవారం నగరానికి వచ్చిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ‘స్వస్థ్‌ నారీ..సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ ప్రారంభ కార్యక్రమంలో, ఆ తరువాత రాడీసన్‌ బ్లూ హోటల్‌లో సీఐఐ నిర్వహించిన జీసీసీ గ్లోబల్‌ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం ప్రజలు చాలా మంచివారని, మహిళా పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ ఉన్నారని, వారు మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. డేటా సెంటర్‌ ఏర్పాటు చేయడానికి వచ్చే నెలలోనే గూగుల్‌ విశాఖపట్నం వస్తుందని ప్రకటించారు. అదేవిధంగా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం వచ్చే వచ్చే ఏడాది ఆగస్టు నుంచి ఆపరేషన్లు ప్రారంభిస్తుందన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటుచేసిన రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌కు జీఎంఆర్‌ను, ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అనుసంధానం చేశామని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల తయారీలో అది కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. విశాఖపట్నానికి మెట్రో రైలును తీసుకురావడానికి కృషిచేస్తున్నామని చెప్పారు.

ఫొటోలు డీపీఆర్‌వో ఫోల్డర్‌లో ఉంటాయి..

----------------

క్యాన్సర్‌పై అవగాహన పెరగాలి

ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలను తొలగించాలి

మహిళలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి పరీక్షలు చేయించుకోవాలి

సికిల్‌సెల్‌ ఎనీమియా పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

విశాఖపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):

క్యాన్సర్‌ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని, వ్యాధి పట్ల నెలకొన్న భయాలు, ఆందోళనలను తొలగించాలని వైద్యులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. బుధవారం ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘స్వస్త్‌ నారీ-సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సాగరిక ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటుచేసిన వైద్య పరీక్షల స్టాల్స్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రోగులు, వైద్యులతో మాట్లాడిన ఆయన...మహిళలు ముందుకువచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్‌ పట్ల ఇప్పటికీ అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయని, గతంలో పారిశ్రామికవేత్తలు దీని బారినపడి బయటకు చెప్పుకునేందుకు ఇబ్బంది పడ్డారన్నారు. సికిల్‌సెల్‌ ఎనీమియా పట్ల కూడా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పెళ్లికి ముహూర్తాలతోపాటు ఎనీమియా సమస్య ఉందా.?, లేదా?...అన్నది నిర్ధారించుకోవాలని సూచించారు. మేనరికపు వివాహాల వల్ల ఈ తరహా సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం ఒక స్టాల్‌లో చిన్నారికి వ్యాక్సిన్‌ వేయడం ద్వారా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అలాగే ఎన్‌సీడీ 4.0 హౌస్‌ హోల్డ్‌ సర్వే, స్ర్కీనింగ్‌ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఆరోగ్య డేటా ఆన్‌లైన్‌ చేయాలని, సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాప్తిని అరికట్టాలని, అనువంశిక వ్యాధులు సక్రమించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సౌరబ్‌గౌర్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి, ఎన్‌టీఆర్‌ వైద్య సేవ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.అప్పారావు, డీఐవో డాక్టర్‌ లూసీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 01:24 AM