నేడు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:59 AM
జీవీఎంసీ కౌన్సిల్ సాధారణ సమావేశం మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జరగనున్నది.
90 అంశాలతో ప్రధాన అజెండా
విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ కౌన్సిల్ సాధారణ సమావేశం మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జరగనున్నది. సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా 90 అంశాలతో ప్రధాన అజెండా తయారుచేసి సభ్యులకు అందజేశారు. ఇవికాకుండా టేబుల్ అజెండాగా మరో 35 అంశాలను ప్రతిపాదించినట్టు సమాచారం. మూడు నెలలు తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో అజెండాలో భారీగానే అంశాలను చేర్చారు. ఉద్యోగుల సర్వీస్, భూకేటాయింపులు, వార్డుల్లో అభివృద్ధికి సంబంధించిన అంశాలే అధికంగా ఉన్నాయి.
స్టీల్‌ప్లాంటులో మళ్లీ తెగిపోయిన కన్వేయర్ బెల్ట్
బ్లాస్ట్‌ఫర్నేస్-3లో నిలిచిపోయిన ఉత్పత్తి?
ఉక్కుటౌన్‌షిప్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటులోని బ్లాస్ట్ ఫర్నేస్-3కు రా మెటీరియల్‌ను సరఫరా చేసే కన్వేయర్ బెల్ట్ గురువారం మళ్లీ తెగిపోయినట్టు తెలిసింది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ) నుంచి బ్లాస్ట్‌ఫర్నేస్-3 విభాగానికి మెటీరియల్‌ను సరఫరా చేసే కన్వేయర్ బెల్ట్ రెండు రోజుల క్రితం తెగిపోయింది. బెల్ట్‌కు మరమ్మతులు నిర్వహించి గురువారం నుంచి మళ్లీ మెటీరియల్‌ను సరఫరా చేయడం ప్రారంభించారు. అయితే కొద్ది సమయానికే మళ్లీ బెల్ట్ తెగిపోయిందని కార్మిక నాయకులు తెలిపారు. ఈ కారణంగా విభాగంలో మూడు రోజులపాటు ఉత్పత్తికి అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.
చందనోత్సవం ఆదాయం రూ.2.99 కోట్లు
సింహాచలం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):
వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం-2025) సందర్భంగా దేవస్థానం ఖజానాకు సుమారు రూ.2.99 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఉత్సవం నిర్వహించిన సంగతి తెలిసిందే. అధికారుల లెక్కల ప్రకారం రూ.1,500 టికెట్లు 3,496 విక్రయం ద్వారా రూ.52,44,000, రూ.1,000 టికెట్లు 13,803 విక్రయాలు జరగ్గా రూ.1,38,03,000, రూ.300 టికెట్లు 15,495 విక్రయించగా రూ.46,48,500 వచ్చాయి. ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లో రూ.1,000 టికెట్లు 3,999 విక్రయించగా రూ.39.99 లక్షలు, రూ.300 టికెట్లు 7,591 అమ్మకాలు జరగ్గా రూ.22,77,300 లభించింది. మొత్తం ఆన్‌లైన్‌లో, ప్రత్యక్షంగా, బ్యాంకులలో 44,385 టికెట్లు విక్రయించగా, వాటిద్వారా రూ.2,99,71,800 ఖజానాకు చేరింది.