22న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:02 AM
జీవీఎంసీ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈనెల 22న నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు.
విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈనెల 22న నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు. పీలా మేయర్‌గా ఎన్నికైన తర్వాత తొలి కౌన్సిల్ సమావేశం మే ఆరున జరిగింది. రెండో సమావేశం ఈనెల 13న నిర్వహించాలనుకున్నప్పటికీ అనివార్యకారణాలతో 22కి వాయిదా వేశారు. ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా అన్ని విభాగాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు.
నవంబరులో కార్పొరేటర్ల యాత్ర
జీవీఎంసీ కార్పొరేటర్ల వార్షిక అధ్యయన యాత్రను ఈ ఏడాది నవంబరులో నిర్వహించాలని నిర్ణయించారు. కార్పొరేటర్లు ఏటా అధ్యయన యాత్ర పేరుతో వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో పర్యటించాలని నిర్ణయించారు. కార్పొరేటర్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనున్నది. ఈ నేపథ్యంలో కనీసం పదిరోజులు యాత్ర ఉండేలా షెడ్యూల్ రూపొందించాలని కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు.
ఎర్రాజీ జ్యోతికి రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం
విశాఖపట్నం, స్పోర్ట్సు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):
స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని విజయవాడలోని రాజ్‌భవన్ (గవర్నర్ బంగ్లా)లో జరగనున్న కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా నగరానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్ పద్మశ్రీ ఎర్రాజీ జ్యోతికి ఆహ్వానం అందింది. ఆగస్టు 15న సాయంత్రం ఐదు గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఎర్రాజి జ్యోతితో పాటు విశాఖకు చెందిన పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అంతర్జాతీయ స్కేటర్ దొంతర గ్రీష్మ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. ఈ మేరకు వారికి సమాచారమివ్వాలని జిల్లా కలెక్టర్‌కు రాజ్‌భవన్ నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఎన్‌ఏడీ-ఎయిర్‌పోర్టు మధ్య 3 మెట్రో స్టేషన్లు
విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):
మెట్రో రైలు ప్రాజెక్టులో విమానాశ్రయం నుంచి ఎన్‌ఏడీ జంక్షన్ వరకు మూడు స్టేషన్లు వస్తాయని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి మంగళవారం క్షేత్ర స్థాయి పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు...అధికారులతో మాట్లాడుతూ, మూడు స్టేషన్ల వద్ద పార్కింగ్ స్లాట్ల సంఖ్య అధికంగా పెట్టాలని సూచించారు. విమానాశ్రయం, ఎన్‌ఏడీ జంక్షన్ చాలా కీలకమైన స్టేషన్లు అయినందున ఎక్కే ప్రయాణికులు, దిగే ప్రయాణికుల సంఖ్యను దీర్ఘకాలంలో దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలో తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెట్రో చీఫ్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ యుజెఎం రావు, ప్రాజెక్టు మేనేజర్ సంపత్, విమానాశ్రయం ట్రాఫిక్ సీఐ దశరథ్, కార్పొరేటర్ బొమ్మిడి రమణ తదితరులు పాల్గొన్నారు.