Share News

మహా రచ్చ

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:56 AM

జీవీఎంసీ మెకానికల్‌ విభాగంలో జరుగుతున్న అవినీతిపై కౌన్సిల్‌ సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది.

మహా రచ్చ

వాడీవేడిగా జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం

సీసీఎస్‌ ప్రాజెక్టుల నిర్వహణ చూస్తున్న ‘రాశా’ సంస్థపై అంత ప్రేమ ఎందుకని నిలదీసిన సభ్యులు

వీధి దీపాల నిర్వహణ కాంట్రాక్టర్‌, క్లాప్‌ వాహనాల కాంట్రాక్టర్‌ పనితీరుపై అసంతృప్తి

నగరంలోని ప్రధాన రహదారులను పీపీపీకి అప్పగించాలనే ప్రతిపాదనపై రభస

చివరకు అజెండాలోని 131 అంశాలకు జీవీఎంసీ కౌన్సిల్‌ ఆమోదం

రెల్లివీధి పేరు మార్పునకు తిరస్కృతి

విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ మెకానికల్‌ విభాగంలో జరుగుతున్న అవినీతిపై కౌన్సిల్‌ సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ప్రధాన అజెండాలో పొందుపరిచిన 90 అంశాలతోపాటు టేబుల్‌ అజెండాగా చేర్చిన 42 అంశాలపై సభ్యులు చర్చించారు. వీటిలో 131 అంశాలకు కౌన్సిల్‌ ఆమోదం తెలపగా, రెల్లివీధి పేరును శబరి నగర్‌గా మార్చే ప్రతిపాదనను కౌన్సిల్‌ తిరస్కరించింది.

కౌన్సిల్‌ ప్రారంభం కాగానే అంబుజా సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా తీర్మానం చేయడంతోపాటు స్టీల్‌ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని సీపీఎం కార్పొరేటర్‌ బి.గంగారావు కోరారు. దీనికి వైసీపీ సభ్యులు కూడా మద్దతు తెలుపుతూ నల్లకండువాలు వేసుకుని ‘గో బ్యాక్‌ అంబుజా’, ’సీఎం రాజీనామా చేయాలి’ అని ప్లకార్డులు పట్టుకుని మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. కొద్దిసేపు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం సభ్యులు తమ సమస్యలను కౌన్సిల్‌ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా ‘జీరో అవర్‌’ కింద ప్రతి ఒక్కరికీ అవకాశం ఇస్తానని, సభ్యులంతా సీట్లలో కూర్చోవాలని మేయర్‌ కోరారు. దీంతో వైసీపీ, సీపీఎం సభ్యులు ఆందోళన విరమించి తమ సీట్లలో కూర్చున్నారు. డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌ మాట్లాడుతూ జీవీఎంసీ నిధులు వెచ్చించి చేసే పనులకు కార్పొరేటర్లు ప్రతిపాదనలు ఇస్తారని, కానీ అజెండాలో 44 పనులను ఎమ్మెల్యే ప్రతిపాదించినట్టు పేర్కొనడం చూస్తుంటే కౌన్సిల్‌ ఏకంగా అసెంబ్లీగా మారిపోయిందనే భావన కలుగుతోందన్నారు. జీవీఎంసీ నిధులతో వార్డుల్లో అభివృద్ధి పనులు జరిగితే వారి గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 76వ వార్డు కార్పొరేటర్‌ గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక మార్కెట్‌ ఆశీలు రూ.1.8 కోట్లకు పాడిన కాంట్రాక్టర్‌ తర్వాత టెండరు రద్దుచేసుకున్నారని, అయినా అదే కాంట్రాక్టర్‌తో అధికారులు ఆశీలు వసూలుచేయడం వెనుక పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. 67వ వార్డు కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గంగవరం పోర్టులో రాష్ట్రప్రభుత్వానికి ఉన్న 10.5 శాతం వాటాను వైసీపీ ప్రభుత్వ హయాంలో అదానీకి అమ్మేశారని, అప్పుడు మాట్లాడని వైసీపీ సభ్యులు ఇప్పుడు స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ అంటూ మొసలికన్నీరు కార్చుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు.

అనంతరం అజెండాలోని అంశాలపై చర్చ ప్రారంభించగా నగరంలో వీధిదీపాల కాంట్రాక్టు దక్కించుకున్న బీఎన్‌ ఆర్‌ సంస్థ పనితీరుపై సభ్యులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. 90వ వార్డు కార్పొరేటర్‌ బొమ్మిడి రమణ మాట్లాడుతూ 196 మంది టెక్నికల్‌ సిబ్బందిని నియమించాల్సి ఉన్నప్పటికీ పది శాతం మందితోనే నెట్టుకురావడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. 22వ వార్డు కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ మెకానికల్‌ విభాగంలో జరుగుతున్న అవినీతిపై ఏకరువుపెట్టారు. ముడసర్లోవ, గాజువాక సీసీఎస్‌ ప్రాజెక్టు నిర్వహణ చూస్తున్న ‘రాశా’ సంస్థ నుంచి రూ.56 లక్షలు రికవరీ చేయాలని కమిషనర్‌ ఆదేశించినా ఇంతవరకూ అధికారులు పట్టించుకోకపోవడం, బ్లాక్‌లిస్ట్‌లో పెట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్వహణ కాంట్రాక్టరే చూడాల్సి ఉన్నా, రిఫర్బిష్‌మెంట్‌ పేరుతో రూ.50 లక్షల చొప్పున జీవీఎంసీ నిధులు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించడం చూస్తుంటే కాంట్రాక్టర్‌తో మిలాఖత్‌ అయ్యారనే విషయం తేటతెల్లమవుతోందన్నారు.76వ వార్డు కార్పొరేటర్‌ గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ తనవార్డులో ఉన్న సీసీఎస్‌ ప్రాజెక్టు సరిగా పనిచేయకపోయినా, కాంట్రాక్టర్‌ బిల్లులు పెడితే అఽధికారులు తిరస్కరించకపోవడం దారుణమన్నారు.

క్లాప్‌ వాహనాలను నిర్వహిస్తున్న దుర్గా కన్సల్టెన్సీ సరిగా పనిచేయడం లేదని తొమ్మిది నెలలు కిందటే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని కౌన్సిల్‌ తీర్మానం చేస్తే ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాసరావు, 22వ వార్డు కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌, 76వ వార్డు కార్పొరేటర్‌ గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. దీనికి కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ వివరణ ఇస్తూ దుర్గా కన్సల్టెన్సీపై ఫిర్యాదులు రావడం వల్లనే క్లాప్‌ వాహనాల లోడర్ల జీతాలు చెల్లింపు బాధ్యతలను ఆ సంస్థ నుంచి తొలగించి మహిళాసంఘాలకు అప్పగించామన్నారు. సభ్యులు కోరితే జోన్‌ల వారీగా లోడర్లు నియామకాలకు టెండరు పిలుస్తామన్నారు. యాదవ సామాజిక భవనం కోసం చినగదిలి వద్ద 0.50 భూమి కేటాయింపు అంశంపై ఆ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ, బీజేపీ, టీడీపీకి చెందిన కొందరు అభ్యంతరం తెలిపారు. తమకు ఇప్పటికే ఎండాడ వద్ద స్థలం కేటాయించారని, ఇప్పుడు మరోసారి చినగదిలి వద్ద స్థలం కేటాయింపు ప్రతిపాదన పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. గతంలో కేటాయింపులతో కౌన్సిల్‌కు సంబంధం లేదని, తాజా ప్రతిపాదన ప్రకారం స్థలం కేటాయింపునకు ఆమోదం తెలుపుతున్నట్టు మేయర్‌ ప్రకటించారు. స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌ కింద వీఎంఆర్‌డీఏ సెంట్రల్‌పార్కు చుట్టూ దుకాణాల ఏర్పాటుపై కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ అభ్యంతరం తెలిపారు. ఆ స్థలాన్ని వీఎంఆర్‌డీ ఇప్పటికే కొన్ని సంస్థలకు లీజుకు ఇచ్చేసిందని చెప్పగా, కమిషనర్‌ జోక్యంచేసుకుని ఏదైనా సమస్య ఉంటే మరోచోట ఏర్పాటుచేస్తామని చెప్పారు. నగరంలోని 88 కిలోమీటర్లు ప్రధాన రహదారులను పీపీపీ కింద పదేళ్లపాటు ప్రైవేటు సంస్థ నిర్మించి, నిర్వహించుకునేలా ప్రతిపాదించిన అంశంపై సీపీఎం, వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని పట్టుబట్టారు. దీనికి కమిషనర్‌ వివరణ ఇస్తూ కేరళ, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌లో ఈ విధానం ఉందని, కేవలం రోడ్డు నిర్మాణంలో నాణ్యత ఉండేందుకే ఈ విధానం అమలు చేస్తున్నామని, కాంట్రాక్టర్‌కు ఒకేసారి బిల్లు ఇవ్వకుండా విడతల వారీగా పదేళ్లపాటు చెల్లిస్తామని, దీనివల్ల రోడ్డు దెబ్బతింటే బిల్లు నిలుపుదల చేస్తారనే భయంతో కాంట్రాక్టర్‌ నాణ్యతాలోపం లేకుండా రోడ్డునిర్మాణం చేస్తారని వివరించారు. ముడసర్లోవ వద్ద రైల్వే శాఖకు కేటాయించిన భూమిలో కొందరు ఆక్రమణదారులు ఉన్నందున వారిలో 47 మందికి జీవీఎంసీ ఆధీనంలో ఉన్న భూమిలో ఇంటి స్థలాలు కేటాయించాలనే ప్రతిపాదనపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. జీవీఎంసీకి చెందిన భూమిలో ఎవరూ ఆక్రమణదారులు లేరని, తప్పుడు పేర్లు పెట్టి జీవీఎంసీ భూమిని కొట్టేసేందుకు ఎత్తుగడ వేస్తున్నారని అభ్యంతరం చెప్పారు. దీనిపై రూరల్‌ తహశీల్దార్‌ పాల్‌కిరణ్‌ వివరణ ఇస్తుండగానే ఆ అంశాన్ని ఆమోదిస్తున్నట్టు ప్రకటించి మేయర్‌ పోడియం దిగి వెళ్లిపోవడంతో కార్పొరేటర్లు, కమిషనర్‌తోపాటు అధికారులు సైతం అవాక్కయ్యారు.

స్టీల్‌ప్లాంటుపై వైసీపీ డ్రామా

విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినప్పుడు రాష్ట్రంలో వైసీపీనే అధికారంలో ఉంది. ఆ సమయంలో కర్మాగారాన్ని ఆదుకునేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు ఉద్యమిస్తే ఆ పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సంఘీభావం ప్రకటించలేదు. చివరకు ఎన్నికల మధురవాడ వద్ద కార్మిక సంఘాల నేతలు కలిసి, అప్పుల్లో ఉన్న ప్లాంటును ఆదుకోవాలని కోరితే...‘అవునా...స్టీల్‌ప్లాంట్‌ అప్పుల్లో ఉందా?’ అంటూ ఆ విషయమే తనకు తెలియదన్నట్టు మాట్లాడారు. ప్లాంటుకు సంబంధించి విద్యుత్‌ బిల్లు చెల్లింపు, గనుల లీజు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున సాయం చేసేందుకు కూడా నిరాకరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత స్టీల్‌ప్లాంటుకు కేంద్ర నుంచి సుమారు రూ.11,500 కోట్ల ప్యాకేజీ వచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు రూపాల్లో సుమారు రూ.2 వేల కోట్ల సాయం అందించేందుకు నిర్ణయించింది. ఇటువంటి తరుణంలో స్టీల్‌ప్లాంటును కాపాడాలని, ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరుతూ వైసీపీ కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకుని కౌన్సిల్‌లో హడావిడి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Updated Date - Nov 22 , 2025 | 12:56 AM