Share News

తురువోలులో కాల్పుల కలకలం

ABN , Publish Date - Jun 18 , 2025 | 01:47 AM

మండలంలోని తురువోలు గ్రామంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.

తురువోలులో కాల్పుల కలకలం

  • అన్నను నాటుతుపాకీతో కాల్చిచంపిన తమ్ముడు

  • గ్రామంలో ఒడ్డు పండగ సందర్భంగా ఇద్దరి మధ్య స్వల్ప గొడవ

  • క్షణికావేశంలో తోబుట్టువు ప్రాణాలు తీసిన సోదరుడు

చీడికాడ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని తురువోలు గ్రామంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఒడ్డు పండుగ సందర్భంగా సోదరుల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ, హత్యకు దారితీసింది. తమ్ముడు క్షణికావేశంలో సొంత అన్నను నాటు తుపాకీతో కాల్పిచంపాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

చీడికాడ మండలం తురువోలు గ్రామంలో మంగళవారం ఉదయం బొడ్డువారి కుటుంబీకు ఆధ్వర్యంలో ఒడ్డు పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా అందరితోపాటు అన్నదమ్ములైన జోగ రాము, జోగ దేముళ్లు కూడా మద్యం సేవించారు. ఈ క్రమంలో ఆవు పెయ్యి, తల్లి దగ్గర పాలు తాగుతుండగా తమ్ముడు దేముళ్లు దానిని అదిలించాడు. ఆవు పెయ్యిని ఎందుకు అదిలించావంటూ అన్న రాము మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపం పట్టలేని దేముళ్లు, తన వద్ద వున్న నాటు తుపాకీతో రాముపై కాల్పులు జరిపారు. దీంతో రాము తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చోడవరంలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కె.కోటపాడు సీఐ పైడంనాయుడు, ఇన్‌చార్జి ఎస్‌ఐ నారాయణరావు, పోలీస్‌ సిబ్బంది మంగళవారం సాయంత్రం సంఘటనా స్థలానికి వెళ్లారు. పలువురిని విచారించిన అనంతరం చోడవరం వెళ్లి, రాము మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నిందితుడు దేముళ్లు పరారీలో ఉన్నట్టు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు. అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యుల నుంచి ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదుచేసి నిందితుడిని పట్టుకుంటామని ఆయన తెలిపారు.


నర్సీపట్నం ఏఎంసీకి కొత్త పాలకవర్గం

చైర్మన్‌గా గవిరెడ్డి వెంకటరమణ

వైస్‌చైర్మన్‌గా కన్నయ్యనాయుడు

మరో 13 మంది డైరెక్టర్లుగా నియామకం

నర్సీపట్నం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి):

నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు గవిరెడ్డి వెంకటరమణ నియమితులయ్యారు. వైస్‌ చైర్మన్‌గా పెదబొడ్డేపల్లికి చెందిన చిటికల కన్నయ్యనాయుడుతోపాటు డైరెక్టర్లను నియమిస్తూ వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నర్సీపట్నం మునిసిపాలిటీలోని బలిఘట్టం గ్రామానికి చెందిన వెంకటరమణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పదవి లభించినట్టు టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 20 మంది సభ్యులు వుండే ఏఎంసీ పాలకవర్గంలో స్థానిక శాసన సభ్యులు సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు గౌరవ చైర్మన్‌గా వుంటారు. పాలకవర్గ సభ్యులుగా కర్రి మంగ, మజ్జి రాజేశ్వరి, పట్టెం రాజుబాబు, పెట్ల సంధ్య, రాయి పెదబాబులు, సాలాదుల దేవి, వబ్బలరెడ్డి సుబ్బలక్ష్మి, యాదగిరి సత్తిబాబు, యర్రంశెట్టి వెంకటరమణ, యక్కల కమలాంబిక, బి.హిమబిందు, నారపురెడ్డి బాలరాజు, వెలగా వెంకట కృష్ణారావుతోపాటు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి, వ్యవసాయ శాఖ ఏడీ, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారి వుంటారు. ఈ సందర్భంగా ఏఎంసీ నూతన చైర్మన్‌ గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ, శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సూచనలతో ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఏఎంసీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. రైతు బజార్‌ ప్రక్షాళనపై దృష్టి పెడతానని, ఏఎంసీ పరిధిలో కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. మెయిన్‌ రోడ్డు వైపు దుకాణ సముదాయం నిర్మించడం ద్వారా ఏఎంసీకి ఆదాయం వస్తుందని చెప్పారు. మట్టి నమూనా పరీక్షా కేంద్రాన్ని పునఃప్రారంభిస్తామని, పండ్లు మగ్గపెట్టుకునే రిపైనింగ్‌ యూనిట్‌ను బాగు చేయించి వినియోగంలోకి తెస్తానని ఆయన తెలిపారు.


పూడిమడక ఉప్పుటేరులో చనిపోయిన చేపలు

మత్స్యకారుల ఫిర్యాదుతో పరిశీలించిన పీసీబీ అధికారులు

అచ్యుతాపురం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి):

స్థానిక ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) లోని ఫార్మా కంపెనీల నుంచి విడుదల చేసిన రసాయన వ్యర్థాల కారణంగా పూడిమడక ఉప్పుటేరులో చేపలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. మత్స్యకారులు ఈ విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫోన్‌ చేసి తెలియజేశారు. పీసీబీ ఏఈ సూర్యకళ వచ్చి పరిశీలించారు. పూడిమడక ఉప్పుటేరులో భారీగా చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

పూడిమడక లైట్‌హౌస్‌ దాటిన తర్వాత ఏటిమొగ (పొగిరి) నుంచి ప్రారంభమైన ఉప్పుటేరు.. పూడిమడక గ్రామం చుట్టూ తిరిగి కడపాలెం వద్ద సముద్రంలో కలుస్తుంది. సముద్రం నీటితోపాటు చేపలు కూడా ఉప్పుటేరులోకి వస్తుంటాయి. పలువురు మత్స్యకారులు రోజూ ఈ ఉప్పుటేరులో చేపల వేట సాగిస్తుంటారు. కాగా మంగళవారం ఉదయం భారీ స్థాయిలో చేపలు చనిపోయి నీటిపైన తేలాయి. దీంతో మత్స్యకారులు ఆందోళన చెంది, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. సీఈబీ ఏఈ సూర్యకళ మంగళవారం సాయంత్రం ఇక్కడకు వచ్చి ఉప్పుటేరును పరిశీలించారు. నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపుతామని, వారం రోజుల్లో నివేదిక వస్తుందని, ఏ కారణంగా చేపలు చనిపోయాయో అప్పుడు తెలుస్తుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు ఉమ్మిడి జగన్‌, దూడ మసేను, శ్రీను, మల్లికార్జున పోలయ్య, జగదీశ్‌, కాసుబాబు మాట్లాడుతూ.. సెజ్‌లోని కొన్ని ఫార్మా కంపెనీల్లో రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా ఉప్పుటేరులోకి వదిలేయడం వల్లనే చేపలు చనిపోతున్నాయని ఆరోపించారు. ఇది తరచూ జరుగుతున్నదని, ఏపీఐఐసీ, మత్స్యశాఖతోపాటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

Updated Date - Jun 18 , 2025 | 01:47 AM