Share News

సంకల్పానికి మార్గదర్శకులు

ABN , Publish Date - Jun 03 , 2025 | 11:16 PM

జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ పరిధిలోని మద్దిలబూసుకొండ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు పలు మార్లు ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకున్నారు. చాలా సార్లు వినతిపత్రాలు ఇచ్చారు. ఫలితం లేకపోవడంతో శ్రమదానంతో రహదారిని బాగు చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. గ్రామస్థులంతా పలుగు, పార పట్టుకుని రాకపోకలకు వీలుగా మూడు కిలోమీటర్ల మేర రహదారిని రెండు రోజుల క్రితం బాగు చేసుకున్నారు.

సంకల్పానికి మార్గదర్శకులు
మద్దిలబూసుకకొండ గ్రామానికి దారి ఏర్పాటు చేసుకుంటున్న గ్రామస్థులు

మద్దిలబూసుకొండ గ్రామానికి రహదారి లేక అవస్థలు

పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున్న గ్రామస్థులు

ఎవరూ స్పందించకపోవడంతో గత ఏడాది శ్రమదానంతో రోడ్డు నిర్మాణం

తుఫాన్‌కు కొట్టుకుపోవడంతో కష్టాలు మళ్లీ మొదటికి..

డోలీ మోతలు తప్పని దుస్థితి

ఎవరూ పట్టించుకోరని భావించి నడుంబిగించిన గిరిజనులు

మూడు కిలోమీటర్ల మేర రహదారిని బాగు చేసుకున్న వైనం

సీలేరు, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ పరిధిలోని మద్దిలబూసుకొండ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు పలు మార్లు ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకున్నారు. చాలా సార్లు వినతిపత్రాలు ఇచ్చారు. ఫలితం లేకపోవడంతో శ్రమదానంతో రహదారిని బాగు చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. గ్రామస్థులంతా పలుగు, పార పట్టుకుని రాకపోకలకు వీలుగా మూడు కిలోమీటర్ల మేర రహదారిని రెండు రోజుల క్రితం బాగు చేసుకున్నారు.

మద్దిలబూసుకొండ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో రోగులను, గర్భిణులను ఆస్పత్రికి తరలించాలంటే డోలీ మోతలు తప్పడం లేదు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు తమ గోడు వెలిబుచ్చుకున్నారు. ఎవరూ స్పందించకపోవడంతో గత ఏడాది మద్దిలబూసుకొండ నుంచి జంపర్లోవ గ్రామం వరకు మూడు కిలోమీటర్ల మేర శ్రమదానంతో రోడ్డు నిర్మించుకున్నారు. అయితే గత ఏడాది సెప్టెంబరు 8న భారీ తుఫాన్‌కు మద్దిలబూసుకొండ రోడ్డు అంతా కొట్టుకుపోయింది. దీంతో మద్దిలబూసుకొండ గ్రామానికి నడిచి వెళ్లాలన్నా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులు, గర్భిణులను ఆస్పత్రికి డోలీలో తరలించాల్సిన దుస్థితి నెలకొంది. రహదారి సమస్యపై స్వయంగా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేకపోయిందని గ్రామస్థులు ఆవేదన చెందారు. తమ గోడును పట్టించుకునేవారు ఎవరూ లేరని భావించి గ్రామస్థులంతా చర్చించుకుని రహదారిని బాగు చేసుకోవాలని నిర్ణయించారు. రెండు రోజుల క్రితం గ్రామస్థులంతా పలుగు, పారలు పట్టుకుని మూడు కిలోమీటర్ల మేర రాకపోకలకు వీలుగా రహదారిని బాగు చేసుకున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ గ్రామానికి పక్కా రహదారి నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jun 03 , 2025 | 11:16 PM