అతిథి గృహం.. నిరుపయోగం
ABN , Publish Date - May 03 , 2025 | 12:54 AM
ఆంధ్రకశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగిలో పర్యాటకులకు సేవలందించాలనే ఉద్దేశంతో ఐటీడీఏ నిర్మించిన అతిథి గృహం నిరుపయోగంగా పడివుంది. చాలా కాలం నుంచి వ్యర్థంగా వున్న ఐటీడీఏ భవనాన్ని 2023లో రూ.30లక్షలతో ఆధునీకరించారు. పర్యాటకులు బస చేసేందుకు మెరుగైన సదుపాయాలతో ఆరు గదులు, రెస్టారెంట్ నిర్మించారు.
నిర్వహణను గాలికొదిలేసిన ఐటీడీఏ అధికారులు
ఏడాదిన్నర నుంచి పర్యాటకుల సేవలకు దూరం
లంబసింగిలో రెండేళ్ల క్రితం రూ.30 లక్షలతో పాత భవనం ఆధునికీకరణ
ఆరు గదులు, ఒక రెస్టారెంట్ నిర్మాణం
స్థానిక గిరిజన యువతకు లీజుకు అప్పగింత
అద్దె, నిర్వహణకు వచ్చే ఆదాయం చాలదంటూ తప్పుకున్న వైనం
వినియోగంలోకి తేవడానికి చర్యలు శూన్యం
ఆవరణలో పెరిగిపోయిన పిచ్చిమొక్కలు
చింతపల్లి, మే 2 (ఆంధ్రజ్యోతి)
ఆంధ్రకశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగిలో పర్యాటకులకు సేవలందించాలనే ఉద్దేశంతో ఐటీడీఏ నిర్మించిన అతిథి గృహం నిరుపయోగంగా పడివుంది. చాలా కాలం నుంచి వ్యర్థంగా వున్న ఐటీడీఏ భవనాన్ని 2023లో రూ.30లక్షలతో ఆధునీకరించారు. పర్యాటకులు బస చేసేందుకు మెరుగైన సదుపాయాలతో ఆరు గదులు, రెస్టారెంట్ నిర్మించారు. అయితే ఆరు నెలలు మాత్రమే పర్యాటకులకు సేవలందించిన ఐటీడీఏ అధికారులు.. ఏడాదిన్నర కాలంగా నిర్వహణ గురించి పట్టించుకోకపోవడం లేదు. దీంతో అతిథి గృహం ఆవరణలో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. భవనం గోడల రంగులు వెలిసిపోయి పాడుబడిన భవనంలా తయారైంది. .
ఆంధ్రకశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగి ప్రాంతానికి ఐదారేళ్ల నుంచి పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. సమీపంలోని చెరువులవేణంలో మంచు మేఘాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే పర్యాటకులు బస చేసేందుకు లంబసింగిలో సరైన సదుపాయలు కలిగిన అతిథి గృహాలు తక్కువగా వున్నాయి. పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్ మాత్రమే అందుబాటులో వుంది. పర్యాటకుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మరో అతిథి గృహాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఐటీడీఏ అధికారులు లంబసింగిలో నిర్మాణాలు చేపట్టారు.
లంబసింగిలో అటవీ శాఖ చెక్‌పోస్టుకు ఎదురుగా ఎకరం విస్తీర్ణంలో సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఐటీడీఏ భవనం వుంది. అప్పట్లో ఈ భవనాన్ని నక్సల్స్‌ను కట్టడి చేయడానికి, గాలింపు చర్యలకు వెళ్లే ఏపీఎస్పీ బెటాలియన్ జవాన్లు అవుట్ పోస్టుగా ఉపయోగించారు. కొన్నాళ్ల తరువాత అవుట్ పోస్టును ఎత్తివేయడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. సుమారు ఐదేళ్ల తరువాత పీహెచ్‌సీకి సొంత భవనం నిర్మించడంతో దీనిని ఖాళీ చేశారు. ఐటీడీఏ అధికారులు దుకాణ సముదాయంగా ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. కొంతకాలం తరువాత భవనం మరమ్మతులకు గురికావడంతో వ్యాపారులు ఖాళీ చేశారు. రోణంకి గోపాలకృష్ణ ఐటీడీఏ పీవోగా వున్నప్పుడు ఈ భవనాన్ని అతిథి గృహంగా ఆధునీకరించాలని సంకల్పించి రూ.30 లక్షలు కేటాయించారు. గిరిజన సంక్షేమ శాఖ నాటి ఈఈ డీవీఆర్‌ఎం రాజు పర్యవేక్షణలో ఆరు గదులతో అతిథి గృహాన్ని నిర్మించారు. ప్రతి గదికి అనుబంధంగా బాత్‌రూమ్ వుంది. అతిథి గృహం ప్రాంగణంలోనే రెస్టారెంట్ నిర్మించారు. 2023 డిసెంబరు 28న నాటి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే ప్రాంభించారు.
ఆరు నెలలు మాత్రమే వినియోగం
ఐటీడీఏ ఆధునీకరించిన అతిథి గృహం నిర్వహణ బాధ్యతను స్థానిక గిరిజన యువతకు అప్పగించారు. అయితే ఏటా రూ.5 లక్షలు చెల్లించాని నిబంధన పెట్టారు. లీజుకు తీసుకున్న గిరిజన యువత.. ఆరు నెలలపాటు పర్యాటకులకు సేవలందించారు. వచ్చిన ఆదాయంలో ఖర్చులు పోను ఏటా రూ.ఐదు లక్షలు ఐటీడీఏకు చెల్లించడం సాధ్యంకాదని భావించి నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తరువాత ఐటీడీఏ అధికారులు ఇతర వ్యక్తులకు లీజుకు ఇవ్వలేదు. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి నిర్వహించడంలేదు.
కళ తప్పిన అతిథి గృహం
లంబసింగి అతిథి గృహం నిర్వహణను ఏడాదిన్నర నుంచి ఐటీడీఏ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆవరణలో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. అలనాపాలనా లేకపోవడంతో భవనం కళ తప్పింది. రూ.30 లక్షలు వెచ్చించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చిన అతిథి గృహాన్ని నిరుపయోగంగా ఉంచడంపై స్థానికులు, పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.