Share News

జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాల్లో ఉత్సాహం

ABN , Publish Date - Sep 18 , 2025 | 01:20 AM

జీఎస్టీలో సంస్కరణలను ప్రకటించిన వెంటనే అన్ని వర్గాల ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మాలా సీతారామన్‌ అన్నారు.

జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాల్లో ఉత్సాహం

కొన్ని ఇబ్బందులున్నా ప్రజలకు మేలు చేసే క్రమంలో ముందుకు వెళ్లాల్సిందే...

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మాలా సీతారామన్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):

జీఎస్టీలో సంస్కరణలను ప్రకటించిన వెంటనే అన్ని వర్గాల ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మాలా సీతారామన్‌ అన్నారు. బుధవారం పీఎం పాలెంలోని ‘వి’ కన్వెన్షన్‌ సెంటర్‌లో నెక్ట్స్‌ జనరేషన్‌ జీఎస్టీ రీఫార్మ్స్‌ (తరువాతి తరం జీఎస్టీ సంస్కరణలు) పేరుతో అవగాహన సదస్సును ఏర్పాటుచేశారు. ఈ సదస్సుకు హాజరైన ఆమె వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి కంకటాల మల్లిక్‌ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో ప్రజలు ఆనందంగా ఉన్నారని, ఈ మార్పులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ కావాల్సి ఉందన్నారు. నూతన మార్పులను అమలు చేసేందుకు కొంత సమయం కావాలన్నారు. రూ.2,500 కంటే ఎక్కువ ధర ఉన్న వస్ర్తాలను 18 శాతం స్లాబ్‌లో పెట్టారని, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో కొనుగోలు చేసే వస్ర్తాలకు అది పెద్ద బడ్జెట్‌ కాదని, దీనిపై ఆలోచించాలన్నారు. ఇందుకు మంత్రి సీతారామన్‌ మాట్లాడుతూ దేశంలో కోట్లాది మంది ప్రజలకు మేలు జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని, అయినా ముందుకు వెళ్లాలన్నారు. కొన్నిరకాల ట్యాక్స్‌లు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం అవుతాయని, జీఎస్టీ మాత్రం 140 కోట్ల మంది భారతీయులకు వర్తిస్తుందన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తరువాత రోజు నుంచే వాటిని అమలు చేసేందుకు అనేక సంస్థలు ముందుకు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. సిమెంట్‌ పరిశ్రమకు చెందిన ప్రతినిధి రాజశేఖర్‌ మాట్లాడుతూ సిమెంట్‌ను 28 నుంచి 18 శాతం స్లాబ్‌కు మార్చడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు సంబంధించిన సాంకేతిక ఇబ్బందులను ఈ సందర్భంగా ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆరోగ్య రంగానికి చెందిన ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ వ్యక్తిగత ఇన్సూరెన్స్‌లకు సంబంధించి స్లాబ్‌లను జీరో చేశారని, గ్రూపు పాలసీలకు సంబంధించి కూడా ఇదే తరహా నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు.

Updated Date - Sep 18 , 2025 | 01:20 AM