జీఎస్టీ అక్రమాలకు కళ్లెం!
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:40 AM
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుల్లో మోసాలు, ఎగవేతలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న వారి వివరాలు రాబట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. కొంతమంది వ్యాపారులు జీఎస్టీ ఎగవేసేందుకు కాగితాల్లో కంపెనీలు సృష్టించి మోసాలకు తెగబడుతున్నారు. భారీగా వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నా, జీఎస్టీ పరిధిలోకి రాకుండా తప్పించుకుంటున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
పన్ను ఎగవేతదారుల వివరాలు సేకరణ
బకాయిలతో సహా వసూలుకు కార్యాచరణ
జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటుచేసిన కలెక్టర్
ప్రతినెలా సమావేశమై ప్రభుత్వ ఆదాయం పెంచేలా చర్యలు
క్షేత్రస్థాయి తనిఖీలకు సిద్ధమవుతున్న యంత్రాంగం
(అనకాపల్లి, ఆంధ్రజ్యోతి)
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుల్లో మోసాలు, ఎగవేతలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న వారి వివరాలు రాబట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. కొంతమంది వ్యాపారులు జీఎస్టీ ఎగవేసేందుకు కాగితాల్లో కంపెనీలు సృష్టించి మోసాలకు తెగబడుతున్నారు. భారీగా వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నా, జీఎస్టీ పరిధిలోకి రాకుండా తప్పించుకుంటున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ ఎ.బాబు సూచనల మేరకు జిల్లాలో జీఎస్టీ వసూళ్లపై కలెక్టరు విజయకృష్ణన్ ఇటీవల జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, జిల్లా జీఎస్టీ సమన్వయ కమిటీని నియమించారు. ఈ కమిటీలో పరిశ్రమలు, వ్యాపారసంస్థలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మున్సిపల్‌అడ్మినిస్ట్రేషన్, బ్యాంకులు, పరిశ్రమలు, గనులు, పంచాయతీరాజ్, జీవీఎంసీ శాఖలతో పాటు వృత్తి పన్ను వసూళ్ల పెంపులో భాగంగా పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ బోర్డు, టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులను భాగస్వాములను చేశారు. సంబంధిత శాఖల అధికారులు వాణిజ్య పన్నుల శాఖతో సమన్వయంతో పనిచేసి జీఎస్టీ వసూళ్ల పెంపు, ఎగవేతదారుల గుర్తింపునకు చర్యలు చేపట్టాలని సూచించారు. పన్ను ఎగవేస్తున్న వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రతి నెలా సమన్వయ కమిటీ సమావేశమవ్వాలని ఆదేశించారు.
అరకొరగా వసూళ్లు
జిల్లా వాణిజ్య పన్నులశాఖ గణాంకాల ప్రకారం అనకాపల్లి సర్కిల్‌లో 5,285 వ్యాపార సంస్థలు, అచ్యుతాపురం సర్కిల్‌లో 6,701 వెరసి 9,986 సంస్థలు జీఎస్టీ చెల్లింపుల కోసం రిజిస్టర్ చేసుకున్నాయి. వాటి ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అనకాపల్లి సర్కిల్‌లో రూ.70.84 కోట్లు, అచ్యుతాపురం సర్కిల్‌లో 177.11 కోట్లు మొత్తం రూ.247.35 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అనకాపల్లి సర్కిల్‌లో రూ.16.12 కోట్లు, అచ్యుతాపురం సర్కిల్‌లో రూ.50.77 కోట్లు మొత్తం రూ.66.89 కోట్లు జీఎస్టీ వసూలైంది. వాస్తవానికి జిల్లాలో నల్లరాయి క్వారీలు, టింబర్ డిపోలు, ఫార్మా కంపెనీలు రూ.కోట్లలో వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నాయి. అనకాపల్లి, నర్సీపట్నం పరిసరాల్లోనే 350కి పైగా నల్లరాయి క్వారీలున్నాయి. వాటి నుంచి ప్రతి రోజూ వందల లారీల్లో రాళ్లను రాంబిల్లి ఎన్‌ఓఏబీకి తరలిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఎక్కడ నిర్మాణాలు జరగాలన్నా గ్రావెల్, భారీ భవన నిర్మాణాలకు అవసరమైన బేబీ చిప్స్ అనకాపల్లి జిల్లా నుంచే రవాణా అవుతోంది. ప్రతి మండలంలో పదులసంఖ్యలో రాతి క్వారీలకు అనుబంధంగా స్టోన్‌క్రషర్లు నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని మండలాల్లో ఏర్పాటైన ఇటుకల తయారీ పరిశ్రమలు రూ.కోట్లలో లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. జీఎస్టీ పరిధిలోకి వచ్చే పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ట్రేడింగ్ కంపెనీలు వేల సంఖ్యలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వానికి అరకొర చెల్లింపులు జరుగుతున్నాయి. చట్టంలోని లొసుగులను అనుకూలంగా మార్చుకుని రికార్డుల్లో వార్షిక వ్యాపార లావాదేవీలు రూ.40 లక్షల లోపు చూపుతూ జీఎస్టీ ఎగ్గొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల మేరకు జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపార సంస్థలు విధిగా లావాదేవీలు సాగించే ప్రదేశంలో సంస్థ పేరు, జీఎస్టీ నంబరుతో బోర్డులు ఏర్పాటుచేయాలి, ప్రతి లావాదేవీకి జీఎస్టీ బిల్లు ఇవ్వాలి. కానీ అనేకమంది బోర్డులు కూడా పెట్టడం లేదు.
ఫేక్ సంస్థలను సృష్టించి...
జిల్లాలో రాతి క్వారీలు, టింబర్ డిపోలు,ఇటుకల తయారీ సంస్థలు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల నిర్వాహకులు ఏటా రూ.కోట్లలో వ్యాపార లావాదేవీలను జరుపుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూలి పనులకు వచ్చే వారి ఆధార్ కార్డుల ఆధారంగా ఫేక్ సంస్థలను సృష్టించి రికార్డుల్లో రూ.40 లక్షల కంటే తక్కువ వ్యాపార లావాదేవీలు చూపిస్తున్నారని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతినెలా జరిగే సమన్వయ కమిటీ సమావేశాల్లో జీఎస్టీ ఎగవేత సంస్థలపై చర్చించి శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నారు. కమిటీ సూచనల మేరకు ఆకస్మిక తనిఖీలు చేపడతారు. గతంలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన సంస్థలను గుర్తించి బకాయిలు వసూలు చేయనున్నారు. ఇందులో భాగంగా జీఎస్టీ సమన్వయ కమిటీ ఇప్పటికే పన్ను చెల్లించని సంస్థల వివరాలను సేకరిస్తుండడంతో వ్యాపార సంస్థల యాజమాన్యాల్లో వణుకు మొదలైంది.