పెరుగుతున్న కోతలు
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:29 AM
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు భారీగా పెరుగుతున్నాయి.

ప్రైవేటు ఆస్పత్రులతో సమానంగా ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్లు
గతంతో పోలిస్తే భారీగా తగ్గిన సాధారణ ప్రసవాలు
గడిచిన నాలుగేళ్లలో మొత్తం 1,68,844 ప్రసవాలు
ఇందులో సిజేరియన్లు 58,614
ప్రతి ముగ్గురిలో ఒకరికి సిజేరియన్..
ప్రైవేటు ఆస్పత్రులకు కాసులు కురిపిస్తున్న వైనం
రూ.80 వేల నుంచి రూ.2 లక్షల వరకూ వసూలు
విశాఖపట్నం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు భారీగా పెరుగుతున్నాయి. గతంలో అతికొద్దిమందికి మాత్రమే సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. అయితే ఇప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరికి సిజేరియన్ చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులతో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్లు కాస్త తక్కువే అయినప్పటికీ... గతంతో పోలిస్తే మాత్రం పెరిగాయి. దీనికి వైద్యులు అనేక కారణాలను చెబుతున్నారు. ఒకప్పుడు సాధారణ ప్రసవానికి గర్భిణి కుటుంబ సభ్యులు, బంధువులు మొగ్గు చూపించేవారు. కానీ ఇప్పుడు బిడ్డకు, తల్లికి ఇబ్బంది అవుతుందన్న భయం, ఇతర కారణాలతో సిజేరియన్ చేయాల్సిందిగా వారే అడుగుతున్నారంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు కూడా ఏదైనా జరిగితే విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఏ మాత్రం ఇబ్బంది అనిపించినా సిజేరియన్‌కు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ భారీ సంఖ్యలో సిజేరియన్లు పెరుగుతున్నాయి.
ఇదీ లెక్క..
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో గడిచిన నాలుగేళ్లుగా పరిశీలిస్తే ప్రతి ముగ్గురు గర్భిణుల్లో ఒకరికి సిజేరియన్ చేస్తున్నారు. 2021-22 ఉమ్మడి విశాఖ జిల్లాలో 63,703 ప్రసవాలు జరగ్గా.. ఇందులో 18,216 సిజేరియన్ డెలివరీలే. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8,676, ప్రైవేటు ఆస్పత్రుల్లో 9,540 జరిగాయి. అలాగే 2022-23లో విభజిత విశాఖ జిల్లాలో 36,798 ప్రసవాలు జరగ్గా, ఇందులో సిజేరియన్లు 12,992. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 7,358, ప్రైవేటు ఆస్పత్రుల్లో 5,634 సిజేరియన్లు చేశారు. 2023-24లో 37,511 ప్రసవాలు జరగ్గా... ఇందులో 15,077 సిజేరియన్లు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6,728, ప్రైవేటు ఆస్పత్రుల్లో 8,349 సిజేరియన్లు నిర్వహించారు. అదేవిధంగా 2024-25లో 30,832 ప్రసవాలు జరగ్గా.. వీటిలో 12,329 సిజేరియన్లు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6,253, ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,076 జరిగాయి.
ప్రైవేటుకు సమానంగా ‘కోతలు’
జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులతో సమానంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోతలు జరుగుతుండడం ఆందోళనను కలిగిస్తోంది. గడిచిన నాలుగేళ్లలో జిల్లాలో 1,68,844 ప్రసవాలు జరగ్గా... ఇందులో 58,614 సిజేరియన్లే ఉండడం గమనార్హం. వీటిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 29,015, ప్రైవేటు ఆస్పత్రుల్లో 29,599 జరిగాయి. అంటే.. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు సమానంగానే జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ల సంఖ్య పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు సిజేరియన్ ప్రసవాలు కాసులు కురిపిస్తున్నాయి. సిజేరియన్‌కు ఆస్పత్రి స్థాయిని బట్టి కనీసం రూ.80 వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ప్రసవం తరువాత తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని బట్టి ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.