పెరుగుతున్న ఆశావహులు
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:58 AM
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు పోటీపడుతున్నారు.
డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమిలో తీవ్ర పోటీ
తమకు వదిలేయాలని కోరుతున్న టీడీపీ ప్రజా ప్రతినిధులు
ససేమిరా అంటున్న జనసేన కార్పొరేటర్లు
నేతలకు తలనొప్పిగా మారిన సామాజిక సమీకరణాలు
ఈవారంలోనే ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు పోటీపడుతున్నారు. నాలుగేళ్లు డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన జియ్యాని శ్రీధర్‌పై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన పదవిని కోల్పోయారు. ఖాళీ అయిన ఆ పోస్టులో కొత్తగా డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఈ వారంలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఆ పదవి కోసం మూడు పార్టీల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. దీంతో అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
మేయర్ పదవిని టీడీపీ తీసుకున్నందున డిప్యూటీ మేయర్ పదవిని తమకు ఇవ్వాలని జనసేన కార్పొరేటర్లు కొందరు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి పలువురు కార్పొరేటర్లు ఆ పోస్టును ఆశిస్తున్నారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు సైతం డిప్యూటీ మేయర్ పదవిని తమ పార్టీకి వదిలేయాలని జనసేన, బీజేపీ ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. అందుకు జనసేన కార్పొరేటర్లు ససేమిరా అంటున్నా...ముగ్గురు ఎమ్మెల్యేలు అంగీకరించినట్టు ప్రచారం జరిగింది. దీంతో డిప్యూటీ మేయర్ పదవి టీడీపీదేనని అంతా భావించారు. ఇంతలో జనసేనకు చెందిన 22వ వార్డు కార్పొరేటర్ మూర్తియాదవ్ మంగళవారం అమరావతిలో పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసి రాష్ట్రంలో కీలకమైన విశాఖలో పార్టీ బలపడేందుకు వీలుగా డిప్యూటీ మేయర్ పదవిని కోరాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ అందజేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో తిరిగి ఆ పార్టీ డిప్యూటీ మేయర్ పదవికి రేస్‌లోకి వచ్చినట్టయింది.
తలనొప్పి పుట్టిస్తున్న సామాజిక సమీకరణాలు
డిప్యూటీ మేయర్ పదవిని ఎవరికో ఒకరికి ఇచ్చేద్దామనుకున్నా సరే నేతలకు సామాజిక సమీకరణాలు తలనొప్పి పుట్టిస్తున్నాయి. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను తాము మేయర్‌ను చేస్తే ఇస్తే ఆమెను తొలగించి వేరొక సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్‌కు ఆ పదవిని ఇచ్చారంటూ వైసీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఆ విమర్శలను తిప్పికొట్టాలంటే డిప్యూటీ మేయర్ పదవిని యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఇవ్వాలని కూటమి ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్లు టీడీపీలో మొల్లి హేమలత (5వ వార్డు), గొలగాని మంగవేణి (18 వార్డు), జనసేనలో పుర్రె పూర్ణశ్రీ (59వ వార్డు) ఉన్నారు. పూర్ణశ్రీ వైసీపీ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి ఇటీవలే జనసేనలో చేరినందున ఆమెకు జనసేన నుంచి డిప్యూటీ మేయర్ పదవికి బీఫారం ఇచ్చేందుకు అవకాశం లేదు. ఒకవేళ డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకున్నా సరే ఆమె వైసీపీకి చెందినవారిగానే అధికారికంగా పరిగణిస్తారు. దీంతో టీడీపీకి చెందిన మొల్లి హేమలత, గొలగాని మంగవేణి మధ్యే పోటీ ఉంటుంది. వారిద్దరిలో అయితే విద్యావంతురాలైన మొల్లి హేమలత వైపు నేతలు మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. కాగా ప్రస్తుతం అవిశ్వాస తీర్మానంతో డిప్యూటీ మేయర్ పదవిని కోల్పోయిన జియ్యాని శ్రీధర్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అందువల్ల ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఆ పదవిని ఇవ్వకపోతే వారి నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందని కూటమిలో మరో వర్గం నేతలు ఆలోచిస్తున్నారు. అదే జరిగితే జనసేనలో కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు లేనందున టీడీపీ కార్పొరేటర్లకే అవకాశం దక్కుతుంది. అలా చూస్తే 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం, 94వ వార్డు కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు పేర్లు పరిశీలనకు వస్తాయి. వారిలో ప్రస్తుతం డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న గంధం శ్రీనివాసరావుకు రెండుసార్లు కౌన్సిలర్‌గా, రెండుసార్లు కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో డిప్యూటీ మేయర్ పదవికి ఇటీవల జరిగిన సమావేశంలో కొందరు ప్రజా ప్రతినిధులు ఆయన పేరును సూచించినట్టు తెలిసింది. మరోవైపు బొండా జగన్నాథం, బల్ల శ్రీనివాసరావు, పిసిని వరహానర్సింహం పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో బీజేపీ ఓటు కీలకంగా మారినందున నగరంలో పార్టీ బలోపేతం కోసం డిప్యూటీ మేయర్ పదవి తీసుకోవాలంటూ కార్పొరేటర్ గంకల కవిత డిమాండ్ చేస్తున్నారు. ఈ వారంలోనే డిప్యూటీమేయర్ ఎన్నిక నోటిఫికేషన్ వస్తుండడంతో ఏం జరుగుతుందనే దానిపై కూటమి నేతలు, కార్పొరేటర్లు, కార్యకర్తల్లో కూడా ఆసక్తి నెలకొందనే చెప్పుకోవాలి.