సందిగ్ధంలో సాగుదారులు
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:10 AM
ప్రభుత్వ కొండపోరంబోకు భూములను దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేస్తామని చెప్పిన రెవెన్యూ అధికారులు.. ఆయా భూములను సర్వే చేసి పరిహారం విషయంలో ఏటూ తెల్చకుండా వదిలివేశారు. దీంతో ఆయా భూముల్లో సాగులో వున్న తోటల్లో నిర్వహణ పనులు చేపట్టడం, ఎరువులు వేయడంపై సాగుదారులు సందిగ్ధంలో పడ్డారు.
రాచపల్లి కొండపోరంబోకు భూములపై ఎటూ తేల్చని అధికారులు
సర్వే చేసి సాగుదారుల గుర్తింపు
మూడు నెలలుదాటినా ఏర్పాటు చేయని గ్రామసభ
నష్టపరిహారంపై కొరవడిన స్పష్టత
రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించాలని వినతి
మాకవరపాలెం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కొండపోరంబోకు భూములను దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేస్తామని చెప్పిన రెవెన్యూ అధికారులు.. ఆయా భూములను సర్వే చేసి పరిహారం విషయంలో ఏటూ తెల్చకుండా వదిలివేశారు. దీంతో ఆయా భూముల్లో సాగులో వున్న తోటల్లో నిర్వహణ పనులు చేపట్టడం, ఎరువులు వేయడంపై సాగుదారులు సందిగ్ధంలో పడ్డారు.
మాకరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 737లో సుమారు 1,500 ఎకరాల ప్రభుత్వ కొండపోరంబోకు భూములు వున్నాయి. ఎరకన్నపాలెం, చినరాచపల్లి, జి.వెంకటాపురం, రామన్నపాలెం, వెంకయ్యపాలెం గ్రామాలకు చెందిన సన్న, చిన్నకారు రైతులు సుమారు ఏడు దశాబ్దాల నుంచి సుమారు 500 ఎకరాల్లో మామిడి, జీడిమామిడి తోటలు వేసుకుని, వచ్చే ఫలసాయంతో జీవనం సాగిస్తున్నారు. తమకు డి.పట్టాలు మంజూరు చేయాలని చాలా ఏళ్ల నుంచి అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో గత ఏడాది సాధారణ ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో ఉన్న సుమారు 1,500 ఎకరాలను పరిశ్రమ ఏర్పాటుకే కేటాయించనున్నట్టు ప్రకటించారు. తరువాత అధికారులు సర్వే చేశారు. వివిధ గ్రామాలకు చెందిన 469 మంది రైతులు 406 ఎకరాలను సాగు చేసుకుంటున్నట్టు గుర్తించారు. ఈ మేరకు మూడు నెలల క్రితం జాబితాలను కూడా తయారు చేశారు. గ్రామ సభ నిర్వహించి, వాస్తవ సాగుదారులను గుర్తిస్తామని అధికారులు చెప్పారు. కానీ ఇంతవరకు గ్రామ సభ నిర్వహించలేదు. అదే విధంగా ఎకరాకు ఎంత నష్టపరిహారం ఇస్తారో వెల్లడించలేదు. మామిడి, జీడిమామిడి తోటల్లో నిర్వహణ, సస్యరక్షణ పనులు చేపట్టి, ఎరువులు వేయాల్సిన సమయం వచ్చింది. పరిశ్రమల కోసం భూములను ఎప్పుడు తీసుకుంటారో అధికారులు చెప్పకపోవడంతో తోటల్లో ఆయా పనులు చేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో రైతులు వున్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే గ్రామసభ ఏర్పాటుచేసి, భూములు ఎప్పుడు తీసుకుంటారు? పరిహారం ఎంత ఇస్తారు? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని ఆయా సాగుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.