Share News

యూజీడీ నిర్వహణపై మహా నిర్లక్ష్యం

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:36 AM

జీవీఎంసీలోని భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

యూజీడీ నిర్వహణపై మహా నిర్లక్ష్యం

  • ఇంజనీరింగ్‌ అధికారుల మధ్య సమన్వయలోపం

  • నగరవాసులకు శాపం

  • మూడు నెలలుగా పనిచేయని పాండురంగాపురం పంప్‌హౌస్‌

  • వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్న సిబ్బంది

  • ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో అధికారుల్లో చలనం

  • సమస్య ఇప్పుడే తెలిసినందున ప్రతిపాదనలు తయారుచేస్తామని ఏఈ ప్రకటన

  • అబ్బే ఎప్పుడో పైప్‌లైన్‌ మార్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఈఈ వివరణ

  • బీచ్‌రోడ్డులోని పంప్‌హౌస్‌ల నిర్వహణ

  • స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు విభాగానిదని మరొక అధికారి వాదన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీలోని భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. అదేవిధంగా కిందిస్థాయి అధికారులు, సిబ్బంది సమస్యలను పైకి తెలియజేయడం లేదు. దీంతో నెలల తరబడి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. బీచ్‌రోడ్డులోని పాండురంగాపురం వద్ద ఉన్న యూజీడీ పంప్‌హౌస్‌ మూడు నెలలుగా పనిచేయకపోవడంతో యూజీడీ వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. అయితే ఆ విషయం ఇప్పటివరకూ ఉన్నతాధికారులకు తెలియకపోవడం ఆశ్చర్యకరం.

నగరంలో యూజీడీ నిర్వహణ పనులకు ప్రత్యేకంగా ఒక సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌తోపాటు ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, జోన్‌లవారీగా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు ఉన్నారు. వీరంతా యూజీడీ నెట్‌వర్క్‌ పైప్‌లైన్‌ ద్వారా వ్యర్థాలు సక్రమంగా ఎస్‌టీపీలకు, పంప్‌హౌస్‌లకు ప్రవహించేలా చూడాల్సి ఉంటుంది. ఎక్కడైనా యూజీడీ బ్లాక్‌ అయి మ్యాన్‌హోల్‌ నుంచి మురుగునీరు పొంగి రోడ్లుపైకి వస్తే, సిబ్బందిని పంపించి సమస్య పరిష్కరించాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది, అధికారుల నుంచి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందాలి. అలాగే ఏఈ నుంచి ఎస్‌ఈ స్థాయి అధికారులు తరచూ యూజీడీ పనితీరును క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది.

అయితే యూజీడీ నిర్వహణ విభాగంలో కొంతమంది ఉన్నతాధికారులకు, కిందిస్థాయిలో అధికారులకు మధ్య ఎందుచేతనో సమన్వయం ఉండడం లేదు. అసలు పంప్‌హౌస్‌లు, ఎస్‌టీపీలు ఎలా పనిచేస్తున్నాయనే దానిని అధికారులు గాలికి వదిలేశారు. నిర్వహణ పేరుతో ఏదైనా పని ప్రతిపాదిస్తే దానికి అంచనాలు రూపొందించడం, కాంట్రాక్టర్‌తో పని చేయించడం, తర్వాత బిల్లు చెల్లింపు జరిగేలా చూడడానికి పరిమితం అవుతున్నారు తప్పితే యూజీడీ నెట్‌వర్క్‌ పనితీరు గురించి పట్టించుకోవడం లేదని సిబ్బందే ఆరోపిస్తున్నారు. పాండురంగాపురం వద్ద ఉన్న పంప్‌హౌస్‌లో మోటార్లు మూడు నెలలుగా పనిచేయకపోవడంతో పైప్‌లైన్‌ ద్వారా వచ్చే వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. అలాగే శాంతిపురం, అప్పుఘర్‌ పంప్‌ హౌస్‌లలో కూడా తరచూ అదేపని పనిచేస్తున్నారు. సమస్యను పరిష్కరించకుండా మోటార్ల మరమ్మతుల పేరిట నిధులు మాత్రం బొక్కేస్తున్నారు.

పాండురంగాపురంలో పంప్‌హౌస్‌ పనిచేయకపోవడంతో సముద్రంలోకి మానవ మల,మూత్రాలను వదిలేస్తున్నారని ఈనెల పదో తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై యూజీడీ నిర్వహణ పనులుచూసే ఏఈ విల్సన్‌ వివరణ ఇస్తూ, పాండురంగాపురం నుంచి బీచ్‌రోడ్డుకు వెళ్లే పైప్‌లైన్‌ మరమ్మతుకు గురైందని, అందుకే మోటార్లు ఆపామని వివరించారు. పైప్‌లైన్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని, పరిపాలనా ఆమోదం రాగానే సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. యూజీడీ ఈఈ సుధాకర్‌ వివరణ ఇస్తూ, పైప్‌లైన్‌ పాడైపోవడమే కాకుండా మోటార్లు పనిచేయడం లేదని దీనికోసం ఇప్పటికే అంచనాలు తయారుచేసి కౌన్సిల్‌ ఆమోదం తీసుకున్నామని, టెక్నికల్‌ పర్మిషన్‌ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇంకా ప్రతిపాదనలు తయారుచేస్తామని ఏఈ చెబుతుంటే...ఈఈ మాత్రం ఎప్పుడో కౌన్సిల్‌ ఆమోదం పొందామని చెబుతున్నారు. ఏది వాస్తవమో అనేది అర్థం కావడం లేదు. మరొక ఇంజనీరింగ్‌ అధికారి స్పందిస్తూ వారిద్దరూ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని, బీచ్‌రోడ్డులోని యూజీడీ పంప్‌హౌస్‌లను స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద అప్పగించేశామని, ఆ ప్రాజెక్టు ఈఈ ఆ పనులను చూస్తున్నారని అంటున్నారు. దీంతో యూజీడీ విభాగంలో ఏం జరుగుతుందనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది.

Updated Date - Apr 13 , 2025 | 01:36 AM