Share News

విశాఖలో ఫిర్యాదుల పరిష్కారం భేష్‌

ABN , Publish Date - Jul 29 , 2025 | 01:11 AM

విశాఖపట్నంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహణ బాగుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రశంసించారు.

విశాఖలో ఫిర్యాదుల పరిష్కారం భేష్‌

  • రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌

  • పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని స్వయంగా వినతుల స్వీకరణ

  • ఇక్కడ అవలంబిస్తున్న విధానాలు మిగిలినచోట్ల అమలు

  • నగరానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం

  • శాంతియుత వాతావరణం ఉండడంతోనే పెట్టుబడులు

విశాఖపట్నం/మహారాణిపేట, జూలై 28 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహణ బాగుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రశంసించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో పాల్గొన్నారు. సుమారు 2.30 గంటలపాటు స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలు వింటూ సంబంధిత అధికారులను వేదిక వద్దకు పిలిపించుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కేజీహెచ్‌లో ఏడాది క్రితం తొలగింపబడిన రోగిమిత్రలు వచ్చి తమ సమస్య చెప్పుకుని విలపించగా ఓదార్చారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా మేరకు ప్లాటు చూపించలేదని చినముషిడివాడకు చెందిన దంపతులు ఫిర్యాదు చేయగా, సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమకు తల్లికి వందనం పథకం వర్తించలేదంటూ మంత్రికి పలువురు ఫిర్యాదు చేశారు. పెదజాలరిపేటలో గ్రామ కంఠంగా గుర్తించిన స్థలాలను ప్రజావసరాలకు అనుమతించాలని మత్స్యకార సంఘ నాయకులు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.

అనంతరం మంత్రి అనగాని మాట్లాడుతూ విశాఖ, తిరుపతిల్లో పీజీఆర్‌ఎస్‌ బాగా జరుగుతుందని, సమస్యల పరిష్కారంలో సానుకూలత ఉందన్నారు. ఇక్కడ అవలంబిస్తున్న విధానాలను చూసి మిగిలినచోట్ల అమలు చేసేందుకుగాను కార్యక్రమంలో భాగస్వామిని అయ్యానన్నారు. ప్రభుత్వ పథకాలు విశాఖలో బాగా అమలు జరుగుతున్నాయని ప్రశంసించారు. విశాఖ వాసులకు సానుకూల దృక్పథం ఎక్కువని, ఇక్కడ శాంతియుత వాతావరణం ఉండడంతో పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నగరంగా విశాఖపట్నం నిలుస్తోందన్నారు. అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విశాఖకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారని, ఇదే విషయం తరచూ సమీక్షలలో గుర్తుచేస్తుంటారన్నారు. ఐటీ రంగానికి ఊతమిస్తూ విశాఖ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని, ఫలితంగా చాలా కంపెనీలు వస్తున్నాయన్నారు. కాగా జిల్లాలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహణ గురించి కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ వివరించారు. ప్రతి వారం వచ్చే ఫిర్యాదులపై నిర్ణీత కాలంలో ఎండార్స్‌మెంట్‌ ఇస్తూ పరిష్కరిస్తున్నామన్నారు. ఇంకా క్రమం తప్పకుండా ఆడిట్‌ నిర్వహిస్తున్నామని, నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపుతున్నామన్నారు. పీజీఆర్‌ఎస్‌లో జేసీ కె.మయూర్‌ అశోక్‌, డీఆర్వో భవానీశంకర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 427 ఫిర్యాదులు రాగా, వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 180, తల్లికి వందనం పథకం అందలేదని సుమారు 80, జీవీఎంసీ సమస్యలపై 54 వచ్చాయి. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి.

Updated Date - Jul 29 , 2025 | 01:11 AM