దర్జాగా గ్రీన్‌బెల్డ్ కబ్జా
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:04 AM
నగరంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకుగాను జాతీయ రహదారికి ఇరుపక్కలా అభివృద్ధి చేసిన గ్రీన్‌బెల్ట్ అన్యాక్రాంతమైపోతోంది.
జాతీయ రహదారికి ఇరువైపులా ఎక్కడికక్కడ ఆక్రమణలు
నర్సరీలు, మాంసం విక్రయాలు, గ్యారేజీలు, పశువుల పెంపకం...
దుకాణాలు పెట్టుకుని అద్దెకు ఇస్తున్న మరికొందరు
పట్టించుకోని జీవీఎంసీ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు
ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో పూర్తిగా కనుమరుగైనా
ఆశ్చర్యపోనవసరం లేదంటున్న నగరవాసులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకుగాను జాతీయ రహదారికి ఇరుపక్కలా అభివృద్ధి చేసిన గ్రీన్‌బెల్ట్ అన్యాక్రాంతమైపోతోంది. వాహనాల నుంచి వెలువడే కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు దశాబ్దాల కిందట రహదారికి ఇరువైపులా చెట్లను నాటారు. అవి ఏపుగా పెరిగి వాహన చోదకులకు వేడి నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడుతున్నాయి. కానీ కొంతమంది ఆ గ్రీన్‌బెల్ట్‌ను ఆక్రమించి దుకాణాలు పెట్టుకుంటున్నారు. మరికొందరు ఏకంగా అద్దెకు ఇచ్చి ఆదాయమార్గంగా మార్చుకుంటున్నారు. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన జీవీఎంసీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు చోద్యం చూస్తున్నారు.
జాతీయ రహదారిపై భారీగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కాలుష్యం కూడా అదేస్థాయిలో ఉంటుంది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం వల్ల గాలి స్వచ్ఛత దెబ్బతిని ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీనిని అధిగమించేందుకు వీలుగా జాతీయ రహదారికి ఇరువైపులా గ్రీన్‌బెల్ట్ పేరుతో ప్రత్యేకంగా భూమిని కేటాయించారు. అందులో రకరకాల మొక్కలు నాటారు. అవన్నీ ఏపుగా పెరిగి చల్లని నీడ ఇవ్వడంతోపాటు కాలుష్య నియంత్రణకు దోహదపడుతున్నాయి. గ్రీన్‌బెల్ట్‌ను పరిరక్షించాల్సిన బాధ్యత నేషనల్ హైవేస్ అథారిటీ ఇండియాదే అయినప్పటికీ నగర పరిధిలో గ్రీన్‌బెల్ట్ నిర్వహణను జీవీఎంసీ చూస్తోంది. అయితే గ్రీన్‌బెల్ట్ పరిరక్షణ విషయంలో నగర పాలక సంస్థ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో ఎక్కడికక్కడ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. కొందరు గ్రీన్ బెల్ట్‌లోని చెట్లను నరికేసి దర్జాగా దుకాణాలు పెట్టుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా దుకాణాలు ఏర్పాటుచేసి అద్దెకు ఇచ్చి ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు. వీరందరికీ చోటామోటా రాజకీయ నేతలు అండగా ఉండడంతో కిందిస్థాయి అధికారులు చూసినా సరే...వాటి జోలికి వెళ్లడానికి సాహసించడం లేదు. ఆదర్శనగర్ జంక్షన్ వద్ద గ్రీన్ బెల్ట్‌లో పింగాణీ వస్తువులు విక్రయిస్తున్నారు. విశాలాక్షి నగర్ వద్ద ఒకవైపు నాటుకోళ్ల దుకాణాలు, మాంసం దుకాణాలు, వాటిని అనుకునే సరుగుడు కర్రల విక్రయ కేంద్రం ఏర్పాటుచేశారు. వాటికి ఎదురుగా జాతీయ రహదారికి మరోవైపు జీవీఎంసీ పేరుతో ఒకరు వాహనాల రిపేరు చేసే మెకానిక్ షెడ్‌ను ఏర్పాటుచేసి గ్యారేజీగా మార్చేశారు. హనుమంతవాక జంక్షన్ సమీపంలో ఒకరు నర్సరీని గ్రీన్ బెల్ట్‌లోనే ఏర్పాటుచేశారు. వెంకోజీపాలెం జంక్షన్ వద్ద పాత ఇంటి సామగ్రి విక్రయించే దుకాణాలు, సరుగుడు దుకాణాలు, కార్పెంటర్ల దుకాణాలు వెలిశాయి. ఇసుకతోట జంక్షన్ సమీపంలో గ్రీన్‌బెల్ట్‌ను పూర్తిగా తొలగించేసి కార్ డెకార్స్, మెకానిక్ షెడ్‌లు, మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్ సమీపంలో ఏకంగా ఫ్రీ వెండింగ్‌జోన్ పేరుతో ఫాస్ట్‌ఫుడ్ దుకాణాలు, గురుద్వార శ్మశానవాటిక పక్కన కారు, ఏసీ రిపేర్లు చేసే మెకానిక్ గ్యారేజీ ఏర్పాటుచేసేశారు. మర్రిపాలెం పంజాబ్ హోటల్ జంక్షన్ వద్ద గ్రీన్‌బెల్ట్‌లో ఎండుగడ్డిపైకప్పుతో ఒక షెడ్ నిర్మించేసి అందులో ఆవులు పెంపకం చేస్తున్నారు.
గ్రీన్‌బెల్ట్ ఆక్రమణకు గురవుతున్నా జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులుగానీ, ఇంజనీరింగ్ అధికారులుగానీ పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎవరైనా గ్రీన్‌బెల్ట్ ఆక్రమణలు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళితే ఆ విషయం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చూసుకోవాలని, వారు తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సమాధానం ఇస్తున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కూడా కళ్లముందు ఆక్రమణలు కనిపిస్తున్నా జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదుచేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా అధికారులు గ్రీన్‌బెల్ట్ ఆక్రమణపై జీవీఎంసీ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో గ్రీన్‌బెల్ట్ పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.