Share News

వాక రోడ్డుకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:28 AM

నాలుగు మండలాల ప్రజల నాలుగు దశాబ్దాల నాటి కల నెరవేరనుంది. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కృషితో వాక రోడ్డు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 12 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.10.4 కోట్లు మంజూరు చేస్తూ అనుమతుల కాపీని ఈ నెల 10వ తేదీన పంచాయతీరాజ్‌ శాఖకు పంపింది. దీంతో ఈ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వాక రోడ్డుకు గ్రీన్‌ సిగ్నల్‌
ఎరకన్నపాలెం నుంచి ఎలమంచిలి నియోజకవర్గంలోని పెదపల్లి గ్రామానికి వెళ్లే వాక రోడ్డు

- నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం

- రూ.10.4 కోట్ల నిధులు కేటాయింపు

- ఫలించిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కృషి

- నెరవేరనున్న నాలుగు దశాబ్దాల నాటి కల

మాకవరపాలెం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నాలుగు మండలాల ప్రజల నాలుగు దశాబ్దాల నాటి కల నెరవేరనుంది. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కృషితో వాక రోడ్డు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 12 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.10.4 కోట్లు మంజూరు చేస్తూ అనుమతుల కాపీని ఈ నెల 10వ తేదీన పంచాయతీరాజ్‌ శాఖకు పంపింది. దీంతో ఈ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మాకవరపాలెం మండలం రామన్నపాలెం సెంటర్‌ నుంచి ఎలమంచిలి నియోజకవర్గం పెదపల్లి వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించాలని 1983 నుంచి ప్రతిపాదన ఉంది. ఆ తరువాత ఎన్నో అవాంతరాలు రాగా, తాజాగా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కృషితో ఎట్టకేలకు ఈ రోడ్డుకు మోక్షం కలిగింది. రామన్నపాలెం సెంటర్‌ నుంచి ఎరకన్నపాలెం గ్రామాన్ని ఆనుకొని ఏపీఐఐసీ భూముల వరకు సుమారు ఆరు కిలోమీటర్ల తారురోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు, అక్కడ నుంచి ఏపీఐఐసీ భూముల గుండా మరో రెండు కిలోమీటర్ల మేర ఎరకన్నపాలెం గ్రామం వరకు రోడ్డు నిర్మాణాన్ని ఏపీఐఐసీ అధికారులు చేపడుతున్నారు. అక్కడ నుంచి ప్రారంభమై వాక రోడ్డు నుంచి ఎలమంచిలి నియోజకవర్గం పెదపల్లి వరకు రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే రోలుగుంట, నర్సీపట్నం, రావికమతం, మాకవరపాలెం మండలాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.

Updated Date - Dec 14 , 2025 | 12:28 AM