విద్యార్థులకు గ్రీన్ పాస్‌పోర్టు
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:46 AM
విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర విద్యా శాఖ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ నిర్ణయం
ప్రతి విద్యార్థి మొక్క పెంచేలా ప్రోత్సాహం
మూడు నెలలకొకసారి ఆ మొక్క పురోగతి పాస్‌పోర్టులో నమోదు
ఐదు పాయింట్లు కేటాయింపు
జిల్లాలో ఇప్పటివరకూ పేర్లు నమోదుచేసుకున్నవారు 56,395 మంది
పాఠశాల కేంద్రంగా మొక్కల పంపిణీ
విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి):
విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర విద్యా శాఖ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ప్రతి విద్యార్థి మొక్కలు పెంచేలా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. మొక్కల పెంపకం కోసం ముందుకు వచ్చే ప్రతి విద్యార్థికి గురువారం నిర్వహించిన మెగా పేరెంట్, టీచర్ సమావేశాల్లో గ్రీన్ పాస్‌పోర్టు (పుస్తకం) అందజేశారు. సబ్జెక్టులకు సంబంధించి ప్రొగ్రెస్ రిపోర్టు ఇస్తున్నట్టుగా విద్యార్థి పెంచే మొక్క పేరు, శాస్త్రీయ నామం, వ్యవహారిక నామం వంటి వివరాలు ఆ గ్రీన్‌పాస్‌పోర్టులో నమోదుచేస్తారు. విద్యార్థులంతా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటేందుకు స్థలం సరిపోదు. కాబట్టి ఇష్టమైన చోట అంటే ఇంటి ఆవరణ, పెరడు, పొలాల గట్లు, గ్రామం/వార్డులో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాల్లో నాటుకోవచ్చు. అయితే మూడు నెలలకొకసారి మొక్కల పెరుగుదల వివరాలను గ్రీన్ పాస్‌పోర్టులో నమోదుచేయాలి. ఏడాదికి రెండుసార్లు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు తనిఖీ చేసి సంతకం చేయాలి. దానికి అనుగుణంగా ప్రతి విద్యార్థికి గరిష్ఠంగా ఐదు పాయింట్లు లభిస్తాయి. రాష్ట్రంలో విద్యార్థులు కోటి మొక్కలు నాటాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఇచ్చిన పిలుపునకు ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. దీనిపై విద్యాశాఖాధికారులతో ఆయన సమావేశఽమై మెగా పేరెంట్ టీచర్ సమావేశాల రోజున విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేయాలని, పెంపకంపై వారిలో ఆసక్తి పెంపొందించాలని సూచించారు. ఇందుకుగాను విద్యార్థి అందజేసేందుకు ‘మొక్క ఎదుగుదలతో నా ప్రయాణం’ అనే ట్యాగ్‌తో గ్రీన్‌పాసుపోర్టు పుస్తకం ముద్రించారు. అవసరమైన మొక్కలు పంపిణీ చేయాలని సామాజిక అటవీ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది.
విశాఖ జిల్లాలో 1,338 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిలో 1,309 పాఠశాలలు గ్రీన్ పాస్‌పోర్టు యాప్‌లో నమోదయ్యాయి. వీటిలో ఇప్పటివరకూ 58,274 మంది విద్యార్థులు తమ పేర్లు నమోదుచేసుకోగా, మొక్కల పెంపకానికి 56,395 మంది ముందుకువచ్చారు. ఒక్కొక్క విద్యార్థి ఒకటి నుంచి మూడు మొక్కలు తీసుకునేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు జిల్లాలో 89,040 మొక్కలు తీసుకునేందుకు విద్యార్థులు తమ పేర్లు పాఠశాల ప్రధానోపాఽధ్యాయుల వద్ద నమోదుచేసుకున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులను గ్రీన్‌పాస్‌పోర్టులో నమోదుచేసి వారికి మొక్కలు అందజేస్తారు. సామాజిక అటవీ విభాగం నర్సరీల నుంచి శుక్రవారం వరకు జిల్లాలో పాఠశాలలకు 50,309 మొక్కలు చేరాయి. రవాణా ఖర్చులు పాఠశాలలు భరించాయి. విద్యార్థులకు సీమబాదం, ఎర్రచందనం, దేవకాంచనం, అంకుడు, గానుగు, తురాయి, మహాగని, మామిడి తదితర జాతులకు చెందిన మొక్కలు అందజేశామని జిల్లా అటవీ శాఖాధికారి జి.మంగమ్మ తెలిపారు. కాగా విద్యార్థులకు మొక్కల పంపిణీ నుంచి వాటిని నాటడం, పెంపకంపై ఉపాధ్యాయులు సూచనలు ఇస్తున్నారని జిల్లా విద్యాశాఖాధికారి నిమ్మక ప్రేమ్‌కుమార్ తెలిపారు. చెట్ల పెంపకం వల్ల పర్యావరణ సమతుల్యత నెలకొంటుందని, భూగర్భ జలాలు పెరుగుతాయని విద్యార్థులకు వివరించామన్నారు.