Share News

షీలానగర్‌-సబ్బవరం హైవేకు పచ్చజెండా

ABN , Publish Date - Oct 17 , 2025 | 01:13 AM

నగర పరిధిలోని షీలానగర్‌ నుంచి అనకాపల్లి జిల్లా సబ్బవరం వరకూ ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ గురువారం కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా శంకుస్థాపన చేశారు.

షీలానగర్‌-సబ్బవరం హైవేకు పచ్చజెండా

కర్నూలు నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన మోదీ

రూ.960 కోట్లు మంజూరు

ఇప్పటికే పనులు మొదలు

సరకు రవాణా వాహనాలు

నేరుగా పోర్టుకు వెళ్లేందుకు ఉపయుక్తం

నగరంపై కాస్త తగ్గనున్న ట్రాఫిక్‌ ఒత్తిడి

వాల్తేరు డివిజన్‌లో పూర్తయిన రైల్వే లైన్లను జాతికి అంకితం చేసిన నరేంద్రమోదీ

విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):

నగర పరిధిలోని షీలానగర్‌ నుంచి అనకాపల్లి జిల్లా సబ్బవరం వరకూ ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ గురువారం కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా శంకుస్థాపన చేశారు. విశాఖపట్నం పోర్టుకు వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలతో పాటు ఇబ్బందులు కూడా ఎదురవుతున్న నేపథ్యంలో సరకు రవాణాకు ఉపయోగపడేలా ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.960 కోట్లు మంజూరయ్యాయి. షీలానగర్‌ నుంచి సబ్బవరం వరకూ ఆరు వరుసల్లో రహదారిని నిర్మించి అక్కడ జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు. అయితే ఈ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. మరోవైపు షీలానగర్‌ నుంచి విశాఖపట్నం పోర్టు కనెక్టివిటీ కోసం నేషనల్‌ హైవే అథారిటీ ఇప్పటికే పనులు నిర్వహిస్తోంది. కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి ఆరు వరుసల మార్గాన్ని రూ.679 కోట్లతో చేపట్టింది. సరకు రవాణా వాహనాలు ఇకపై గాజువాక హైవే పైనుంచి నగరంలోకి రాకుండా, సబ్బవరం వద్ద కనెక్ట్‌ అయ్యే ఆరు వరుసల మార్గంలో షీలానగర్‌ వరకు వచ్చి, అక్కడి నుంచి విమానాశ్రయం పక్క మార్గంలో కాన్వెంట్‌ జంక్షన్‌ మీదుగా పోర్టుకు చేరుకుంటాయి. దీనివల్ల నగర ట్రాఫిక్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. సరకు రవాణా వాహనాలు 24/7 నడుపుకొనే వీలుంటుంది. ఇప్పటిలా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోకి రాకుండా ట్రాఫిక్‌ ఆంక్షలు ఏమీ ఉండవు.

రైల్వే లైన్లు జాతికి అంకితం

విశాఖపట్నం నుంచి పొరుగు జిల్లాలకు కనెక్టివిటీ పెంచేందుకు రైళ్ల రద్దీని తట్టుకునేందుకు వీలుగా కొత్తవలస-విజయనగరం మధ్య నాలుగో లైన్‌ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. దాంతో పాటు పెందుర్తి-నార్త్‌ సింహాచలం మధ్య రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. కొత్తవలస-కిరండూల్‌ మార్గంలో కొత్తవలస-బొడ్డవర, సిమిలిగుడ-గోరాపుర్‌ సెక్షన్ల మధ్య ఇప్పటికే డబ్లింగ్‌ పనులు పూర్తవ్వడంతో జాతికి అంకితం చేశారు. వీటి వల్ల ప్రయాణికులు, పర్యాటకుల కోసం అదనపు రైళ్లు నడిపే అవకాశం ఉంది. సరకు రవాణా కూడా సులభతరం కావడంతో పాటు వేగవంతం అవుతుంది.

Updated Date - Oct 17 , 2025 | 01:13 AM