చెత్త తరలింపులో లాలూఛీ
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:05 AM
క్లోజ్డ్ కాంపాక్టర్ సిస్టమ్ (సీసీఎస్) ప్రాజెక్టుల నిర్వహణలో భారీ అవినీతి జరుగుతోంది.
సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణలో అవినీతి కంపు
ప్రాజెక్టు నిర్వహణకు ఏటా రూ.కోట్లు కేటాయిస్తున్న జీవీఎంసీ
అయినా మెయింటెనెన్స్‌పై కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం
జీవీఎంసీ నిధులతో ఆ పనులు చేపట్టేందుకు అధికారుల ప్రతిపాదనలు!
టౌన్‌కొత్తరోడ్డులోని ప్రాజెక్టు నిర్వహణపై కమిషనర్ ఆగ్రహం
కాంట్రాక్టర్‌ను తొలగించాలని ఆదేశం
అయినా అదే కాంట్రాక్టర్‌ను కొనసాగిస్తున్న అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
క్లోజ్డ్ కాంపాక్టర్ సిస్టమ్ (సీసీఎస్) ప్రాజెక్టుల నిర్వహణలో భారీ అవినీతి జరుగుతోంది. జోన్‌ల పరిధిలోని చెత్త తరలింపు కేంద్రాల (ఎంఎ్‌సఎ్‌ఫ) నుంచి కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు చెత్తను శాస్త్రీయంగా తరలించేందుకు వీలుగా అందుబాటులోకి తెచ్చిన ఈ విధానం కొంతమంది అధికారులకు, కాంట్రాక్టర్లకు బంగారుబాతుగా మారింది.
జీవీఎంసీ పరిధిలో ప్రతిరోజూ 1,100 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్తత్తి అవుతుంది. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే క్లాప్ వాహనాలు దానిని సంబంధిత జోన్‌లోని ఎంఎ్‌సఎ్‌ఫలకు తర లిస్తాయి. అక్కడి నుంచి టిప్పర్లు, లారీలతో కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలిస్తారు. లారీలు, టిప్పర్లలో చెత్తను తరలించినప్పుడు రోడ్లపై చెత్త జారిపడిపోవడం, గాలికి ఎగిరి రోడ్డుపై వచ్చేవారిపై పడడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతుండడంతో సీసీఎస్ ప్రాజెక్టుకు అధికారులు రూపకల్పన చేశారు. ఈ విధానంలో జోన్ స్థాయిలో ఉండే ఎంఎ్‌సఎఫ్ వద్దకు చెత్తను క్లాప్ వాహనాలు తీసుకువచ్చినప్పుడు ఎత్తైన బ్రిడ్జిపైకి వెళ్లి అక్కడి నుంచి ఒక గల్లాలోకి వేస్తాయి. గల్లాలో పడిన చెత్తను ప్రత్యేకమైన యంత్రం సహాయంతో ఒక కేక్ మాదిరిగా ప్రెస్‌చేసి నేరుగా ట్యాంకర్‌లోకి పడేస్తారు. తర్వాత వెనుక వైపు డోర్ వేసి బయటకు చెత్త కనిపించకుండా, వాసన రాకుండా చేస్తారు. ట్యాంకర్ ద్వారా చెత్తను కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలిస్తారు. ఈ విధానాన్ని జీవీఎంసీ పరిధిలో వన్‌టౌన్‌లోని టౌన్‌కొత్తరోడ్డు వద్ద ఉన్న ఎంఎ్‌సఎ్‌ఫతోపాటు గాజువాక, ముడసర్లోవ, చీమలాపల్లి ఎంఎ్‌సఎ్‌ఫల్లో అమలు చేస్తున్నారు.
నిర్వహణ కాంట్రాక్టర్లకు అప్పగింత
సీసీఎస్ ప్రాజెక్టులో భాగంగా ఎంఎ్‌సఎఫ్ వద్ద యంత్రాలను అమర్చడంతోపాటు రెండు ట్యాంకర్ లారీలను జీవీఎంసీ సమకూర్చింది. లారీలకు అవసరమైన డీజిల్‌ను జీవీఎంసీయే సమకూర్చుతుంది. డ్రైవర్లను నియమించుకుని ఆయా వాహనాలు, ప్రాజెక్టు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (నిర్వహణ) బాధ్యతను ఏటా టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక ఎంఎ్‌సఎ్‌ఫల్లోని సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణను గత ఏడాది సుమారు రూ.రెండు కోట్లకు ఒకే కాంట్రాక్టర్ దక్కించుకోగా, ముడసర్లోవ, చీమలాపల్లి సీసీఎ్‌సలను దాదాపు అంతే మొత్తానికి మరో ఇద్దరు కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. ఆయా ప్రాజెక్టులతోపాటు ట్యాంకర్ లారీల నిర్వహణ, మరమ్మతులు కూడా సంబంధిత కాంట్రాక్టరే చూసుకోవాల్సి ఉంటుంది.
కాంట్రాక్టర్లుఇష్టారాజ్యం
సీసీఎస్ ప్రాజెక్టులను పక్కాగా నిర్వహించాల్సిన కాంట్రాక్టర్లలో ఇద్దరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టౌన్‌కొత్తరోడ్డులోని సీసీఎస్ ప్రాజెక్టు వద్ద రెండు ట్యాంకర్ టిప్పర్లలో ఒకటి గత ఆరు నెలలుగా పనిచేయకపోవడంతో షెడ్‌లోనే ఉంది. కానీ ఆ వాహనం పేరుతో ప్రతి నెలా డీజిల్‌ను తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల టౌన్‌కొత్తరోడ్డులోని సీసీఎస్ ప్రాజెక్టును పరిశీలించిన కమిషనర్ కేతన్‌గార్గ్ అక్కడి నిర్వహణపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. చెత్త భారీగా పేరుకుపోయి ఉండడంతో ప్రాజెక్టు నిర్వహణపై ఆరా తీశారు. కాంట్రాక్టర్ సరిగా పనిచేయడం లేదని ప్రాథమికంగా గుర్తించడంతో అతడి టెండర్‌ను నిలుపుదల చేస్తూ నోటీసు జారీచేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు వెంటనే నోటీసు జారీచేశారు. అయితే అదే కాంట్రాక్టర్‌తో ఇప్పటికీ పనులు కొనసాగిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలావుండగా టౌన్‌కొత్తరోడ్డుతోపాటు, గాజువాకలోని సీసీఎస్ ప్రాజెక్టులో కొన్ని పరికరాలు మరమ్మతుకు గురయ్యాయి. వాటికి రూ.1.5 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆ మొత్తాన్ని కాంట్రాక్టరే వెచ్చించి చెత్త తరలింపు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా, జీవీఎంసీ నుంచి మంజూరు చేసేందుకు వీలుగా అధికారులు ప్రతిపాదనలు తయారుచేస్తున్నట్టు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దీనిపై మెకానికల్ విభాగం ఎస్‌ఈ గోవిందరావును వివరణ కోరగా టౌన్‌కొత్తరోడ్డులోని సీసీఎస్ ప్రాజెక్టులో ఒక ట్యాంకర్ లారీ ఆరునెలలుగా పనిచేయడం లేదని, అయితే దానికి డీజిల్ డ్రా చేస్తున్నట్టు తనకు తెలియదన్నారు. అలాగే ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను తొలగించాలని కమిషనర్ నోటీసు ఇవ్వడం వాస్తవమేనని, కొత్త కాంట్రాక్టర్ ఇప్పటికిప్పుడు దొరకరు కాబట్టి, ఆయన్నే కొనసాగిస్తున్నామని చెప్పడం విశేషం. టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్లను తెప్పించుకుని పరిశీలిస్తానన్నారు.