గ్రేటర్ ఎస్కేప్!
ABN , Publish Date - Mar 14 , 2025 | 01:12 AM
ప్రభుత్వ సంస్థలకు బకాయిల చెల్లింపులో గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) తాత్సారం చేస్తోంది.

గ్రంథాలయాలకు సెస్ చెల్లించకుండా తప్పించుకుంటున్న జీవీఎంసీ
బకాయిలు రూ.100 కోట్లపైనే...
పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా జిల్లా గ్రంథాలయ సంస్థ మొర
ఉమ్మడి జిల్లాలో పంచాయతీల నుంచి రావలసింది రూ.20 కోట్లు
విశాఖపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ సంస్థలకు బకాయిల చెల్లింపులో గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) తాత్సారం చేస్తోంది. ప్రజల నుంచి ఆస్తి/నీటి పన్నులు ముక్కుపిండి వసూలుచేసే జీవీఎంసీ...ప్రభుత్వంలో ఇతర శాఖలకు సెస్ చెల్లింపులో మాత్రం మొండిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో మూడు వారాల్లో ముగియనున్నందున సెస్ బకాయిలు చెల్లించాలని కోరుతూ జీవీఎంసీకి జిల్లా గ్రంథాలయ సంస్థ లేఖ రాసింది.
నగరంలో ఇళ్లు, ఇతర ఆస్తులకు సంబంధించి యజమానులు ఏటా ఆస్తి పన్ను చెల్లిస్తారు. అందులో గ్రంథాలయ సెస్ ఎనిమిది శాతం, విద్య సెస్ ఒక శాతం...ఉంటాయి. సెస్ వసూళ్లకు గ్రంథాలయ సంస్థకు సొంత యంత్రాంగం ఉండదు కాబట్టి స్థానిక సంస్థలే వసూలు చేసి, ఆ మొత్తాన్ని వాటికి జమ చేయాలి. అయితే గ్రామ పంచాయతీలుగానీ జీవీఎంసీ గానీ జిల్లా గ్రంథాలయ సంస్థకు సెస్ సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో బకాయిలు పెరిగిపోయాయి. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం జీవీఎంసీ నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.100 కోట్లపైగా రావల్సి ఉంది. దీనిపై గ్రంథాలయ సంస్థ అధికారులు అనేక పర్యాయాలు జీవీఎంసీ అధికారులను స్వయంగా కలవడం లేదా లేఖలు రాయడం చేస్తూనే ఉన్నారు. ఇటీవల నగరానికి వచ్చిన రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ను కలిసి జీవీఎంసీ బకాయిలపై వినతిపత్రం అందజేశారు. వైసీపీ హయాంలో పలువురి పోరాట ఫలితంగా 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు నెలకు రూ.50 లక్షలు వంతున సెస్ బకాయిలు చెల్లించారు. తరువాత ఎన్నికలు రావడంతో జీవీఎంసీ బకాయిల చెల్లింపు నిలిపివేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో గ్రంథాలయ సెస్ వివరాలు తెలియజేయడంతోపాటు కొంతమేర బకాయిలు చెల్లించాలని కోరుతూ గ్రంథాలయ సంస్థ లేఖ రాసింది. బకాయిలో 20 శాతం వరకు చెల్లిస్తే జిల్లా గ్రంథాలయ సంస్థకు నూతన భవనం నిర్మించవచ్చునని గ్రంథాలయ ఉద్యమకారులు అంటున్నారు.
పంచాయతీ బకాయిలు రూ.20 కోట్లు
ఉమ్మడి విశాఖ జిల్లాలో 969 గ్రామ పంచాయతీలు, ఎలమంచిలి, నర్సీపట్నం మునిసిపాలిటీలు కూడా గ్రంథాలయ సెస్ చెల్లించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నర్సీపట్నం రూ.20 లక్షలు, ఎలమంచిలి మునిసిపాలిటీ రూ.10.8 లక్షలు సెస్ చెల్లించాయి. గ్రామ పంచాయతీల నుంచి రూ.ఆరు కోట్ల మేర వసూలైంది. ప్రస్తుత ఏడాది కరెంట్ డిమాండ్, బకాయిలు కలిపి పంచాయతీల నుంచి రూ.20 కోట్ల వరకు వసూలు కావాలని అధికారులు అంచనా వేస్తున్నారు. సెస్ బకాయిల కోసం గ్రంథాలయ సిబ్బంది తమ పరిధిలో పంచాయతీ కార్యదర్శులను కలుస్తున్నారు. ప్రజల నుంచి వసూలుచేసే సెస్‌ను గ్రంథాలయాలను కేటాయిస్తే...మరింత అభివృద్ధి చేయడానికి దోహదపడతాయని ఉద్యమకారులు కోరుతున్నారు.