పారిశుధ్యంపై గ్రేటర్ కమిషనర్ దృష్టి
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:31 AM
నగరంలో పారిశుధ్య నిర్వహణపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రత్యేకదృష్టి సారించారు.
రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు
కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కేతన్ గార్గ్
సమస్యలేవైనా ఉంటే పరిష్కరిస్తానని హామీ
విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి):
నగరంలో పారిశుధ్య నిర్వహణపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రత్యేకదృష్టి సారించారు. అందులో భాగంగా రాత్రివేళ జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. స్వచ్ఛసర్వేక్షణ్-2025 పోటీల్లో నగరానికి ఉత్తమ ర్యాంకు దక్కేలా ఇప్పటినుంచే కార్యచరణ అమలు చేస్తున్నారు.
నగరంలో పారిశుధ్య నిర్వహణకు ఐదు వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. కొందరు సరిగా విధులు నిర్వర్తించకపోవడం వల్లే పారిశుధ్యం ఆశించిన స్థాయిలో ఉండడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ కేతన్‌గార్గ్ రాత్రివేళ జరుగుతున్న పారిశుధ్య పనులను ఆకస్మికంగా పరిశీలిస్తున్నారు. నగరంలో రద్దీగా ఉండే ప్రధాన రహదారులు, మార్కెట్లు వంటి ప్రాంతాల్లో పగలు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, రాత్రివేళ మాత్రమే పారిశుధ్య నిర్వహణ పనులు చేస్తుంటారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తెల్లవారేసరికి రోడ్లు, మార్కెట్లు ఆశించిన స్థాయిలో పరిశుభ్రంగా ఉండకపోగా, చెత్తతో దర్శనమిస్తున్నాయి. మార్కెట్‌లు, రోడ్లను శుభ్రం చేయడానికి అవసరమైనంత మంది కార్మికులు లేకపోవడం వల్లనే పూర్తిస్థాయిలో పారిశుధ్య నిర్వహణ జరగడం లేదని కార్మికసంఘాల నేతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తరచూ తనిఖీలు చేయడం ద్వారా వాస్తవ పరిస్థితిని, సమస్యలను గుర్తించాలని కమిషనర్ కేతన్‌గార్గ్ నిర్ణయించారు. అందులో భాగంగానే వారం కిందట వీఐపీ రోడ్డులో, ఈనెల 23న డైమండ్ పార్క్, శంకరమఠం రోడ్డులో రాత్రిపూట పారిశుధ్య పనులు పరిశీలించారు. శుక్రవారం రాత్రి పూర్ణామార్కెట్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను పారిశుధ్య కార్మికులను అడిగి తెలుసుకున్నారు. రాత్రిపూట వీధికుక్కల సమస్య ఎక్కువగా ఉంటోందని వాపోయారు. కుక్కల నుంచి తమకు రక్షణ కల్పిస్తే విధి నిర్వహణలో మరింత మంచి ఫలితాలు వచ్చేలా పనిచేస్తామని కమిషనర్‌కు వివరించారు. దీంతో సిటీ వెటర్నరీ అధికారి డాక్టర్ ఎన్.కిషోర్‌కుమార్‌కు ఫోన్ చేసి పూర్ణామార్కెట్ ప్రాంతంలో కుక్కల సమస్య లేకుండా తక్షణం వాటిని పట్టే కార్యక్రమం చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. అందరూ సమర్థంగా విధులు నిర్వర్తిస్తేనే పరిశుభ్ర నగరంగా గుర్తింపు వస్తుందని కమిషనర్ కేతన్‌గార్గ్ పారిశుధ్య కార్మికులకు వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని, వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తానని కమిషనర్ హామీ ఇవ్వడంతో కార్మికులు ఆనందం వ్యక్తంచేశారు.
అందరికీ అందుబాటులో ఉంటా...
రోజుకు 16 గంటలు పనిచేస్తున్నా
ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకుంటే ఎవరూ నిరీక్షించాల్సిన అవసరం ఉండదు
జీవీఎంసీకి మంచి గుర్తింపు తీసుకురావాలన్నదే నా లక్ష్యం
కమిషనర్ కేతన్‌గార్గ్
విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి):
ప్రజా ప్రతినిధులతోపాటు ప్రజలకు కూడా నిత్యం అందుబాటులో ఉంటానని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. ‘కమిషనర్‌పై టీడీపీ కార్పొరేటర్ల అసంతృప్తి’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. తనను కలిసేందుకు వచ్చిన వారికి అవకాశం ఇవ్వడం లేదని కొందరు కార్పొరేటర్లు ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. తాను జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోజుకు 16 గంటలు పనిచేస్తున్నానన్నారు. ఏదైనా సమీక్షలో ఉన్నప్పుడు, ఇంకెవరైనా ప్రజా ప్రతినిధులు కలిసి మాట్లాడుతున్నప్పుడు కార్పొరేటర్లుగానీ మరెవరైనా వచ్చినట్టయితే తనకోసం వేచి ఉండాల్సి ఉంటుంది తప్ప, తాను ఎవరినీ నిరీక్షించేలా చేయడం లేదన్నారు. తనకు తెలియకుండా ఒకరిద్దరు నిరీక్షించారేమోగానీ, ముందుగానే అపాయింట్‌మెంట్ తీసుకుంటే అసలు నిరీక్షించాల్సిన అవసరం ఉండదన్నారు. ఆరునెలలపాటు పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో అనేక ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోయాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడంతోపాటు ప్రతిరోజూ సాధారణ విధులను నిర్వరించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం కాబట్టి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, నగర భౌగోళిక స్థితి, సమస్యలపై అవగాహన కల్పించుకోవడం, ఉదయం, రాత్రివేళ నగరంలో వార్డుల్లో పర్యటనలు కూడా మరోవైపు కొనసాగిస్తున్నానన్నారు. జీవీఎంసీకి మంచి గుర్తింపు తీసుకురావాలన్నదే తన లక్ష్యమని, కార్పొరేటర్లు, నగరవాసులు తనకు సహకరించాలని ఆయన కోరారు.