Share News

మహా విడ్డూరం

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:53 AM

రాష్ట్రంలోనే అతిపెద్ద మునిసిపల్‌ కార్పొరేషన్‌గా జీవీఎంసీ గుర్తింపుపొందింది. ఏ స్థానిక సంస్థకు లేనన్ని ఆస్తులు విశాఖపట్నం నగర పాలక సంస్థకు ఉన్నాయి.

మహా విడ్డూరం

అగ్నిమాపక శాఖ అధికారికి భూవ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత!

జీవీఎంసీ ఎస్టేట్‌ అధికారిగా నియామకం

రాజకీయ పలుకుబడితోనే....

ఆ పోస్టులో రెవెన్యూ శాఖ అధికారి ఉన్నా

పక్కనపెట్టేసిన వైనం

జీవీఎంసీ పరిధిలో భూములు, రికార్డుల పరిరక్షణలో ఎస్టేట్‌ అధికారే కీలకం

అవగాహనలేని అధికారి ఏం చేస్తారని విస్మయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోనే అతిపెద్ద మునిసిపల్‌ కార్పొరేషన్‌గా జీవీఎంసీ గుర్తింపుపొందింది. ఏ స్థానిక సంస్థకు లేనన్ని ఆస్తులు విశాఖపట్నం నగర పాలక సంస్థకు ఉన్నాయి. వాటిని అన్యాక్రాంతం కాకుండా కాపాడడంతోపాటు రికార్డులకు కస్టోడియన్‌గా ఎస్టేట్‌ అధికారి వ్యవహరించాలి. జీవీఎంసీ ఆస్తులను ఆక్రమించుకునేందుకు ఎవరైనా యత్నిస్తే చట్టపరంగా అడ్డుకోవడం, కోర్టులో కేసులుపడితే స్టాండింగ్‌ కౌన్సిల్‌కు అవసరమైన రికార్డులను అందజేసి భూమి అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించుకోవడం చేయాలి. అంతటి కీలకమైన పోస్టులో భూ వ్యవహారాల్లో ఆరితేరిన రెవెన్యూ శాఖ అధికారులను డెప్యూటేషన్‌పై నియమిస్తారు. కానీ ఇప్పుడు అగ్నిమాపక శాఖ అధికారిని నియమించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

జీవీఎంసీకి రూ.వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. నగర పరిధిలో పార్కులు, ఓపెన్‌స్పేస్‌లు కలిపి 1300కి పైగా ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేటు, వీఎంఆర్‌డీఏ లేఅవుట్‌ల ద్వారా జీవీఎంసీకి దఖలు పడ్డాయి. ఇవికాకుండా క్రీడా మైదానాలు, స్టేడియాలు, సామాజిక భవనాలు, కల్యాణ మండపాలతోపాటు నగర పాలక సంస్థకు చెందిన కార్యాలయాల భవనాలు వంటివి ఎన్నో ఉన్నాయి. వాటికి సంబంధించిన రెవెన్యూ రికార్డులకు ఎస్టేట్‌ ఆఫీసర్‌ కస్టోడియన్‌గా వ్యవహరిస్తారు. భూములకు సంబంధించిన వ్యవహారం కాబట్టి టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు పెద్దగా ఉండదనే ఉద్దేశంతో రెవెన్యూ శాఖ నుంచి తహశీల్దార్‌ స్థాయి అధికారిని డెప్యూటేషన్‌పై నియమిస్తుంటారు. ఆ ఎస్టేట్‌ అధికారి ఆధ్వర్యంలో జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్లలో టౌన్‌సర్వేయర్లు విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎవరైనా భవన నిర్మాణం కోసం లేదంటే క్రయ,విక్రయాల కోసం స్థలం/భూమికి సంబంధించిన సర్వే సర్టిఫికెట్‌ కావాలని జీవీఎంసీ కమిషనర్‌కు దరఖాస్తుచేసుకుంటే ఎస్టేట్‌ అధికారి ద్వారా సంబంధిత జోన్‌ టౌన్‌ సర్వేయర్‌కు పంపిస్తారు. టౌన్‌సర్వేయర్‌ ఆ భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించడంతోపాటు రికార్డుల పూర్వాపరాలను పరిశీలించి దాని స్వభావం, యజమాని, విస్తీర్ణం వంటి వివరాలతో నివేదిక తయారుచేసి ఎస్టేట్‌ అధికారికి అందజేస్తారు. ఎస్టేట్‌ అధికారి ఆ సర్వే రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు తన వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి సర్వేయర్‌ సక్రమంగానే నివేదిక ఇచ్చారని నిర్ధారించుకున్న తర్వాత కౌంటర్‌ సంతకం చేసి దరఖాస్తుదారుడుకు సర్టిఫికెట్‌ అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా జీవీఎంసీకి చెందిన భూమి/పార్కు/గెడ్డ/భవనానికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకోవడం, కబ్జా చేసి నిర్మాణం చేపట్టడం చేస్తే ఆ స్థలానికి సంబంధించిన రికార్డులను పోలీసులకు లేదంటే టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు అందజేసి పరిరక్షించాల్సిన బాధ్యత ఎస్టేట్‌ అధికారిపైనే ఉంటుంది. అలాగే చీఫ్‌ సిటీప్లానర్‌, కమిషనర్‌ వంటి ఉన్నతాధికారులకు ఏదైనా భూమికి సంబంధించిన అంశంపై సందేహం తలెత్తినా, ఫిర్యాదులు అందినా రికార్డులను పరిశీలించి వివరాలను వివరించాల్సిన బాధ్యత కూడా ఎస్టేట్‌ అధికారిపైనే ఉంటుంది. అందుకే ఎస్టేట్‌ అధికారి పోస్టులో భూ వ్యవహారాలు, వివాదాల పరిష్కారంలో అనుభవం కలిగిన సీనియర్‌ తహశీల్దార్‌ స్థాయి అధికారిని నియమిస్తుంటారు.

ఎస్టేట్‌ అధికారి ఉండగానే మరొకరు!

కానీ ఏం జరిగిందో తెలియదుగానీ తహశీల్దార్‌ స్థాయి అధికారిణి ఎస్టేట్‌ అధికారిగా ఉన్నప్పటికీ అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న ఒక అధికారిని తీసుకొచ్చి రెండో ఎస్టేట్‌ అధికారిగా నియమించారు. ఒకవేళ పనిఒత్తిడో, మరో కారణం చేతనో రెండో ఎస్టేట్‌ అధికారి అవసరమని భావించినా, భూవ్యవహారాలపై అవగాహన ఉన్న రెవెన్యూ శాఖ నుంచి మాత్రమే నియమించుకోవాలి.కానీ అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. కొద్దినెలల కిందట డిప్యూటేషన్‌పై వచ్చినప్పటికీ ఈ విషయం బయటకు పొక్కలేదు. ఎస్టేట్‌ అధికారిగా ఉన్న రెవెన్యూ అధికారిణికి అధికారులు సైతం ప్రాధన్యం ఇవ్వకుండా అగ్నిమాపక శాఖ నుంచి వచ్చిన అధికారికే ప్రాధాన్యం ఇసున్నారు. తాజాగా కొంతమంది టౌన్‌ సర్వేయర్లతో సదరు అధికారి దురుసుగా వ్యవహరిస్తుండడంతో అగ్నిమాపక శాఖ అధికారి ఎస్టేట్‌ అధికారిగా నియమితులయ్యారనే విషయం బయటకు వచ్చింది. ఈ విషయం గురించి జీవీఎంసీ అధికారులతోపాటు కార్పొరేటర్లు సైతం ఉన్నతాధికారి వద్ద ప్రస్తావించగా, రాజకీయ పలుకుబడితో వచ్చారని సమాధానం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అగ్నిమాపకశాఖ అధికారి జీవీఎంసీకి చెందిన విలువైన భూములు అన్యాక్రాంతం అయితే ఎలా గుర్తిస్తారు, వాటిని అడ్డుకునేందుకు ఎలాంటి నివేదిక తయారుచేయాలి? ఎవరికి అందజేయాలనేది ఎలా తెలుస్తుందని విస్మయం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - Nov 19 , 2025 | 12:53 AM