Share News

అక్రమార్కులకు మహా దన్ను!

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:49 AM

అక్రమ నిర్మాణదారుల పట్ల జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో కొందరు అధికారులు అమితమైన ప్రేమ కనబరుస్తున్నారు.

అక్రమార్కులకు మహా దన్ను!

  • నాలా పన్ను చెల్లించకపోయినా భవనాలకు ప్లాన్‌ల జారీ

  • కొందరికి ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్లు కూడా ఇచ్చేసిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు

  • కూర్మన్నపాలెంలోని ఎంవీవీ, ఎంకే అపార్టుమెంట్‌ యాజమాన్యం

  • రూ.7.9 కోట్లు నాలా బకాయి ఉన్నా ప్లాన్‌, ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ జారీ

  • వారం రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీసీపీని ఆదేశించిన మేయర్‌

  • ఇలా నగరంలో సుమారు రూ.700 కోట్లు వరకూ నాలా బకాయిలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అక్రమ నిర్మాణదారుల పట్ల జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో కొందరు అధికారులు అమితమైన ప్రేమ కనబరుస్తున్నారు. తమను ప్రసన్నం చేసుకున్న బడా బిల్డర్లకు నిబంధనలతో పనిలేదన్నట్టుగా మేలు చేస్తున్నారు. కూర్మన్నపాలెంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఎంవీవీ, ఎంకే పార్కు (భారీ అపార్టుమెంటు)కు సంబంధించి రూ.7.9 కోట్లు నాలా బకాయి ఉన్నా ప్లాన్‌ జారీచేయడంతోపాటు, నిర్మాణం పూర్తికాగానే ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ (ఓసీ) కూడా ఇచ్చేశారు. ఇలాంటి నాలా బకాయిలు జీవీఎంసీ పరిధిలో రూ.700 కోట్లు వరకూ ఉన్నట్టు చెబుతున్నారు.

జీవీఎంసీ పరిధిలో ఎవరైనా భవన నిర్మాణాలు చేపట్టాలంటే టౌన్‌ప్లానింగ్‌ విభాగం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ముందుగా ఆన్‌లైన్‌లో ప్లాన్‌ కోసం జీవీఎంసీకి దరఖాస్తు చేస్తారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి అన్ని డాక్యుమెంట్‌లు సరిగా ఉన్నాయా?, ఏమైనా వివాదాలు ఉన్నాయా? అనేదానితోపాటు ఖాళీస్థలమైతే వీఎల్‌టీ, అదే పాత ఇల్లు కూలగొట్టి కొత్తగా నిర్మిస్తే ఇంటి పన్ను పూర్తిగా చెల్లించారా?, లేదా?...అనేది తనిఖీ చేస్తారు. అదే వ్యవసాయ యోగ్యమైన భూమిలో నిర్మాణానికి ప్లాన్‌ పెడితే మాత్రం భూ వినియోగ మార్పిడి (నాలా) ఫీజు రెవెన్యూ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. నాలా ఫీజు కట్టిన రశీదుతోపాటు వీఎల్‌టీ కింద జీవీఎంసీకి చెల్లించిన ఫీజు రశీదులను దరఖాస్తుతోపాటు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అలా అయితేనే ప్లాన్‌ దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని, నిర్మాణానికి అనుమతిస్తారు. అలాకాకుండా నాలా ఫీజు రశీదు లేకపోతే మాత్రం ప్లాన్‌ దరఖాస్తును వెనక్కి పంపించేయాలి. ఒకవేళ భవన నిర్మాణదారుడు తాను నాలా ఫీజు తర్వాత చెల్లించి రశీదుని అప్‌లోడ్‌ చేస్తానని హామీ పత్రం అందజేస్తే మాత్రం అదే షరతును నోట్‌ఫైల్‌లో రాసి ప్లాన్‌ను అనుమతిస్తారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ (ఓసీ) కోసం దరఖాస్తు చేసేలోపు నాలా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఓసీ జారీచేయరు. ఓసీ లేకపోతే ఇంటి పన్ను రెట్టింపు విధించడంతోపాటు జీవీఎంసీకి మార్టిగేజ్‌ చేసిన ఫ్లాట్‌లను రిలీజ్‌ చేయరు. అయితే కొంతమంది భవన నిర్మాణదారులు, బడా బిల్డర్లు జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోని అధికారులను ప్రసన్నం చేసుకుని నాలా ఫీజు చెల్లించకుండా మేనేజ్‌ చేసేస్తున్నారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత నాలా ఫీజు చెల్లింపు ప్రస్తావన లేకుండానే ఓసీని తెచ్చుకుంటున్నారు.

కూర్మన్నపాలెంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంవీవీ, ఎంకే పేరుతో 9.57 ఎకరాల్లో రెండు వేల ఫ్లాట్‌లు కలిగిన గేటెడ్‌ కమ్యూనిటీ నిర్మించారు. దీనికి 2019లో ప్లాన్‌ కోసం దరఖాస్తు చేయగా, నాలా ఫీజు కింద ఏడు ఎకరాలకు రూ.7.59 కోట్లు చెల్లించాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నోట్‌ షీట్‌లో రాశారు. తర్వాత నాలా ఫీజును చెల్లిస్తానని బిల్డర్‌ నుంచి హామీ పత్రం తీసుకుని ప్లాన్‌ రిలీజ్‌ చేశారు. 2024లో భవన నిర్మాణం పూర్తయ్యింది. అయితే నాలా ఫీజు కట్టకపోయినాసరే బిల్డర్‌ ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేయగానే అప్పటి టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వెంటనే జారీచేసేశారు. దీనిపై 87వ వార్డు కార్పొరేటర్‌ బొండా జగన్‌తోపాటు మరికొందరు ఫిర్యాదు చేయడంతో నాలా ఫీజు కింద రూ.7.59 కోట్లు చెల్లించాలని నోటీసు జారీచేశారు. అయినా ఇంతవరకు నోటీసుని పట్టించుకున్న దాఖల్లాలేవు. పైగా శ్మశాన స్థలాన్ని, ఏలేరు కాలువ బఫర్‌జోన్‌గా మార్కుచేసిన స్థలాన్ని కబ్జా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా గేటెడ్‌ కమ్యూనిటీ లోపల అంతర్గత రహదారి కోసం 2,187 గజాల స్థలం విడిచిపెట్టేసినందున పరిహారంగా నాలుగు రెట్లు సెట్‌ బ్యాక్‌ ఉల్లంఘనకు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అంగీకారం తెలిపారు. ఇదే విషయమై నాలుగు రోజుల క్రితం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులను కార్పొరేటర్లు నిలదీశారు. దీనికి మేయర్‌ పీలా శ్రీనివాసరావు స్పందిస్తూ ఎంవీవీ, ఎంకే పార్క్‌ గేటెడ్‌ కమ్యూనిటీ ఉల్లంఘనలపై సమాధానం ఇవ్వాలని సీసీపీ ప్రభాకరరావును ఆదేశించగా, నాలా ఫీజు కింద రూ.7.9 కోట్లు బకాయి ఉండగానే ఓసీ జారీచేసిన విషయం వాస్తవమేనని వెల్లడించారు. ఇందుకు కారకులెవరనే దానిపై సమగ్రవిచారణ జరిపి వారంరోజుల్లోగా తనకు నివేదిక అందజేయాలని సీసీపీని మేయర్‌ ఆదేశించారు.

Updated Date - Jun 11 , 2025 | 12:49 AM