Share News

గ్రావెల్‌ మాఫియా

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:22 AM

సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములు, కొండపోరంబోకు స్థలాల్లో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గ్రావెల్‌ మాఫియా
వంగలి, బంగారమ్మపాలెం గ్రామాల మధ్య నల్లకొండ ఫారెస్టుకు అనుకొని ఉన్న బంజురు భూముల్లో గ్రావెల్‌ తవ్విన దృశ్యం

సబ్బవరం మండలంలో యథేచ్ఛగా తవ్వకాలు

స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం

అక్రమార్కులకు స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు

సబ్బవరం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములు, కొండపోరంబోకు స్థలాల్లో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంత మంది కూటమి ప్రజాప్రతినిధుల పేరు చెప్పి గ్రావెల్‌ తవ్వుకుపోతున్నారని చెబుతున్నారు. ఒకవేళ అధికారులు అడపాదడపా దాడులు చేసి, వాహనాలకు నామమాత్రంగా జరిమానాలు విధిస్తుండడంతో గ్రావెల్‌ అక్రమ తవ్వకందారులకు భయం లేకుండా పోతున్నదన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

మండలంలోని వంగలి, బంగారమ్మపాలెం గ్రామాల మధ్య నల్లకొండ ఫారెస్టుకు అనుకొని ఉన్న కొండను గత కొన్ని రోజులుగా అక్రమార్కులు భారీ యంత్రాలతో తవ్వి, డంపర్లతో గ్రావెల్‌ను తరలించుకుపోతున్నారు. దొంగలమర్రి సీతారాంపురం(డీఎంఎస్‌ పురం) భూముల్లో దేవీపురం కొండ వెనుక భాగంలో కూడా గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇంకా గాలిభీమవరం, నంగినారపాడు, అసకపల్లి (వజ్రాల కొండ) ఎన్టీఆర్‌(జగనన్న) కాలనీలకు అనుకొని ఉన్న కొండలను తొలిచేస్తున్నారు. కొన్నిచోట్ల సుమారు 20 అడుగుల లోతు మేర గ్రావెల్‌ తవ్వుతున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో వున్న కొండవాలు ప్రదేశాల్లో తవ్విన గ్రావెల్‌ను దువ్వాడ, కూర్మన్నపాలెం, గాజువాక పరిసర ప్రాంతాలకు రవాణా చేసి అమ్ముకుంటున్నారు. అక్రమార్కులకు స్థానికంగా వుండే కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రైటప్‌ః28ఎంపికె2.. పాటిపల్లిలో గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్న కొండ ప్రాంతం ఇదే

మునగపాక మండలంలో..

మునగపాక, డిసెంబరు 28 (ఆంధ్రజోతి): మండలంలో పాటిపల్లి గ్రామం పరిధిలోని ఏపీ మోడల్‌ స్కూల్‌కు సమీపంలో కొండలను గ్రావెల్‌ అక్రమార్కులు ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ నాణ్యమైన గ్రావెల్‌ వుండడంతో రాత్రిపూట యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ చుట్టుపక్కల ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. కాకరాపల్లి గ్రామం నుంచి మోడల్‌ స్కూల్‌ మీదుగా రాజుపేట రోడ్డు వైపు సాయంత్రం ఐదు గంటల తరువాత జనసంచారం వుండదు. దీంతో గ్రావెల్‌ అక్రమార్కులకు బాగా కలిసొచ్చింది. ఇంకా తోటాడ, కాకరాపల్లి, చిన్నోడుపాలెం, మల్లవరం, నరేంద్రపురం తదితర గ్రామాల్లో కూడా కొండవాలు ప్రదేశాల్లో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారులు ఇటువైపు కన్నెత్తి అయినా చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Dec 29 , 2025 | 12:22 AM