Share News

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

ABN , Publish Date - Nov 13 , 2025 | 01:35 AM

నగరంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం విశాఖ చేరుకున్నారు.

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

గోపాలపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):

నగరంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం విశాఖ చేరుకున్నారు. రాత్రి ఏడు గంటలకు ప్రత్యేక విమానంలో కడప నుంచి నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ ఎం.శ్రీభరత్‌, ప్రభుత్వ విప్‌లు పి.గణబాబు, వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, బండారు సత్యనారాయణమూర్తి వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్‌, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్‌, మేయర్‌ పీలా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌, సీపీ శంఖబ్రత బాగ్చి, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, పలు కార్పొరేషన్‌ల చైర్మన్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో నగరానికి బయలుదేరి వెళ్లారు.


2200 మందితో బందోబస్తు

నిఘా కోసం 15 డ్రోన్లు, 155 సీసీ కెమెరాలు

సభా ప్రాంగణంతోపాటు స్టార్‌ హోటళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు

సదస్సు జరిగే ప్రాంగణంలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌

అస్త్రం యాప్‌తో ట్రాఫిక్‌ పర్యవేక్షణ

నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి

విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):

పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సుకు 2,200 మందితో బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి తెలిపారు. సదస్సు జరిగే ఏయూ ఇంజనీరింగ్‌ మైదానాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నగరంతోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి అధికారులు, సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. ఢిల్లీ ఘటన నేపథ్యంలో సదస్సు జరిగే ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఒక త్రెడ్‌ డ్రోన్‌, 15 డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటుచేశామన్నారు. ఇవికాకుండా 155 సీసీ కెమెరాలను ప్రాంగణంలోని కీలక ప్రాంతాల్లో అమర్చామన్నారు. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు సదస్సు జరిగే ప్రాంగణంలోనే ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేశామన్నారు. ప్రధాన వేదికతోపాటు, హెలీపాడ్‌, వీఐపీలు సమావేశమయ్యే హాళ్లు, గదులు, మంత్రుల సమావేశాలు జరిగే ప్రాంతాలు, భోజనశాలలను ఇప్పటికే బాంబుస్క్వాడ్‌లు, డాగ్‌స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టామన్నారు. వీటితోపాటు ప్రముఖులు, సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు బస చేసే హోటళ్లలో కూడా భద్రతాపరమైన తనిఖీలు నిర్వహించామన్నారు. సిబ్బందికి 200 బాడీవార్న్‌ కెమెరాలు అందజేశామన్నారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్‌ పర్యవేక్షణకు ‘అస్త్రం’ యాప్‌ను వినియోగించుకుంటామన్నారు.ఆయా రూట్లలో ట్రాఫిక్‌జామ్‌ కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 01:35 AM