గోవాడ చెరకు రైతుల ఆందోళన బాట
ABN , Publish Date - Sep 21 , 2025 | 10:59 PM
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ సీజన్ కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారడంతో గత రెండు సీజన్లకు సంబంధించి రావలసిన బకాయిల కోసం గ్రామ స్థాయిలో చెరకు రైతులు ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు.
బకాయిలు చెల్లించాలని, మహాజన సభ నిర్వహించాలని డిమాండ్
నేడు అన్ని సచివాలయాలకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయం
చోడవరం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ సీజన్ కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారడంతో గత రెండు సీజన్లకు సంబంధించి రావలసిన బకాయిల కోసం గ్రామ స్థాయిలో చెరకు రైతులు ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నెల 22న అన్ని సచివాలయాలకు గోవాడ చెరకు రైతుల బకాయిలు చెల్లించాలని, మహాజన సభ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రాలు అందజేయాలని రైతు సంఘాలతో కూడిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి సభ్యులు పిలుపునిచ్చారు.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఈ ఏడాది క్రషింగ్ ప్రారంభించాలని రైతులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఏ విధమైన సానుకూల స్పందన రాకపోవడంతో ఫ్యాక్టరీ క్రషింగ్‌పై సందేహాలు తలెత్తాయి. ఇదే సమయంలో గోవాడ పరిధిలో రైతులు పండించిన చెరకును కూడా పొరుగు జిల్లా ఫ్యాక్టరీకి తరలించాలన్న నిర్ణయానికి ఉన్నతాధికారులు రావడంతో ఈ ఏడాది గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ఉండబోదన్నది దాదాపుగా తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే గోవాడ ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరకుకు సంబంధించి రైతులకు చెల్లించవలసిన బకాయిలు సంగతేమిటన్న వాదన రైతాంగం నుంచి వినిపిస్తున్నది. ప్రస్తుతం వ ్యవసాయ సీజన్ కావడం, పంట పెట్టుబడులకు డబ్బులు అవసరం అవుతుండడంతో బకాయిలు చెల్లించాలని రైతులు పట్టుబడుతున్నారు. ఫ్యాక్టరీలో 2023-24, 2024-25 సీజన్‌లకు సంబంధించిన రూ.28 కోట్లు రైతులకు చెల్లించవలసి ఉంది. ఇవికాక రెండు సీజన్ల రవాణా చార్జీలు మరో కోటి రూపాయలు ఉన్నాయి. మొత్తం రూ.29 కోట్లు రైతులకు చెల్లించవలసి ఉంది. అంతేకాకుండా కార్మికులకు వేతనాలు, రిటైరైన కార్మికులకు పదవీ విరమణ ప్రయోజనాలు కలిపి మరో రూ.7 కోట్లు వరకు చెల్లించవలసి ఉంది. రైతాంగం ఈ బకాయిల చెల్లింపులకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ వద్ద ఉన్న పంచదార, మొలాసిస్ విక్రయించినా రూ.10 కోట్లకు మించి వచ్చే అవకాశం లేకపోవడంతో, ఫ్యాక్టరీ అధికారులు రైతుల చెల్లింపుల కోసం ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చెరకు రైతులు, కార్మికుల బకాయిలకు సంబంధించి రూ.40 కోట్లతో పాటు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నడిపించేందుకు మరో రూ.30 కోట్లు అవసరమని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ నివేదిక ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న ఈ ఫైలుకు సీఎం నుంచి ఆమోదం లభిస్తే, చెరకు రైతుల బకాయిలతో పాటు గోవాడ ఫ్యాక్టరీ నిర్వహణపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మహాజన సభ వాయిదా?
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ భవితవ్యంతో పాటు రైతులు, కార్మికుల సమస్యలు, బకాయిలపై చర్చించేందుకు మహాజన సభలో అవకాశం ఉంది. ఏటా సెప్టెంబరు నెల 30వ తేదీలోగా గోవాడ ఫ్యాక్టరీ మహాసభ నిర్వహించవలసి ఉంది. ఫ్యాక్టరీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని ఫ్యాక్టరీ స్థితిగతులపై చర్చించేందుకు వీలుంటుంది. కానీ గోవాడ చెరకు రైతుల బకాయిలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వపరంగా నిధులు వస్తాయనే సూచనలు లేకపోవడంతో ఈ ఏడాది గోవాడ మహాజన సభ కూడా లేనట్టుగానే కనిపిస్తోంది. ప్రభుత్వపరంగా రైతుల బకాయిలకు సంబంధించి స్పష్టమైన హామీ రాని పక్షంలో మహాజన సభ నిర్వహణ దాదాపుగా లేనట్టేనని ఫ్యాక్టరీ వర్గాల సమాచారం. గతంలో కొవిడ్ సమయంలో ఆంక్షల కారణంగా 2020లో మహాజన సభ వాయిదా పడింది. ఈసారి ఏ కారణం చూపి మహాజన సభ వాయిదా వేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఫ్యాక్టరీ మహాజన సభ నిర్వహిస్తే ఫ్యాక్టరీ భవితవ్యంపైనా, చెరకు రైతుల బకాయిలకు ఓ పరిష్కారమార్గం దొరికే అవకాశం ఉన్నప్పటికీ, మహాజన సభ నిర్వహణపైనా సందిగ్ధం నెలకొనడంతో మహాజన సభ నిర్వహించాలని రైతాంగం నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవాడ షుగర్స్ మహాజన సభపై జిల్లా కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో గోవాడ షుగర్స్ మహాజన సభ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతులు సచివాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. మొత్తం మీద ఫ్యాక్టరీని కాపాడాలని, కొనసాగించాలని రైతులు, కార్మికుల నుంచి డిమాండ్లు పెరుగుతుండడంతో గోవాడ భవితవ్యం ఏ విధంగా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో సైతం చర్చ సాగుతోంది.