గోవాడ మహాజన సభ నిర్వహించాల్సిందే..
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:05 AM
విలేకరులతో మాట్లాడుతున్న రైతుసంఘం, సీఐటీయూ నాయకులు కర్రి అప్పారావు, తదితరులు
- వాయిదా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
- క్రషింగ్ కొనసాగించకపోతే ఆందోళన
- రైతు సంఘం, సీఐటీయూ నేతల హెచ్చరిక
చోడవరం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మహాజన సభ వాయిదా నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఏపీ రైతు సంఘం, సీఐటీయూ నేతలు కర్రి అప్పారావు, వి.వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ గోవాడ ఫ్యాక్టరీ మహాజన సభ నిర్వహించి రైతులు, కార్మికుల సమస్యలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవలసిన ప్రభుత్వం, యాజమాన్యం.. ఫ్యాక్టరీ మహాజన సభ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. గోవాడ ఫ్యాక్టరీ భవిష్యత్తుపై, చెరకు రైతుల బకాయిలపై కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరించడం చూస్తే, ఏదో విధంగా ఫ్యాక్టరీని మూసివేయించాలన్న ఉద్దేశ్యంలో ఉన్నట్టు కనిపిస్తున్నదని విమర్శించారు. రైతులకు చెల్లించవలసి బకాయిలు రూ.29 కోట్లు చెల్లించి, వచ్చే సీజన్‌లో ఫ్యాక్టరీ క్రషింగ్ కొనసాగించేందుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. తక్షణం మహాజన సభ వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, సభ తేదీ ప్రకటించి రైతులు, అఖిలపక్షాల నేతలతో సమావేశం నిర్వహించి గోవాడ రైతులకు, కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే సీజన్‌కు ఫ్యాక్టరీని నడిపించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని రైతు సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు గండి నాయనిబాబు, ఎస్‌వీ నాయుడు, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.