‘గోవాడ’ రైతు ఘోష
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:22 AM
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చెరకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుత సీజన్‌లో క్రషింగ్ చేయడంలేదని యాజమాన్యం ప్రకటించడంతోపాటు ఫ్యాక్టరీ పరిధిలోని చెరకును శ్రీకాకుళం జిల్లా సంకిలిలోని జీఎంఆర్ షుగర్ ఫ్యాక్టరీకి అప్పగిస్తూ, ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ గత సీజన్‌లో సరఫరా చేసిన చెరకుకు సంబంధించి బకాయిల చెల్లింపుపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గోవాడ ఫ్యాక్టరీ భవిష్యత్తుపై భరోసా ఇవ్వకపోగా, గత సీజన్‌లో ఫ్యాక్టరీకి తోలిన చెరకుకు ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడం దారణమని రైతులు వాపోతున్నారు.
రూ.29 కోట్ల మేర చెరకు బకాయిలు
కార్మికులకు మరో రూ.10 కోట్లు...
చెల్లింపులపై నోరుమెదపని ఫ్యాక్టరీ యాజమాన్యం
ప్రభుత్వం నుంచి కొరవడిన స్పందన
ఈ ఏడాది చెరకు క్రషింగ్‌కు మంగళం
సంకిలిలో ప్రైవేటు ఫ్యాక్టరీకి సరఫరాకు ఆదేశాలు
ధర, చెల్లింపులు, రవాణా ఖర్చులపై స్పష్టత ఇవ్వని అధికారులు
దిక్కుతోచని చెరకు రైతులు, కార్మికులు
చోడవరం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చెరకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుత సీజన్‌లో క్రషింగ్ చేయడంలేదని యాజమాన్యం ప్రకటించడంతోపాటు ఫ్యాక్టరీ పరిధిలోని చెరకును శ్రీకాకుళం జిల్లా సంకిలిలోని జీఎంఆర్ షుగర్ ఫ్యాక్టరీకి అప్పగిస్తూ, ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ గత సీజన్‌లో సరఫరా చేసిన చెరకుకు సంబంధించి బకాయిల చెల్లింపుపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గోవాడ ఫ్యాక్టరీ భవిష్యత్తుపై భరోసా ఇవ్వకపోగా, గత సీజన్‌లో ఫ్యాక్టరీకి తోలిన చెరకుకు ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడం దారణమని రైతులు వాపోతున్నారు.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో 2023-24, 2024-25 క్రషింగ్ సీజన్‌లకు సంబంధించి సభ్య రైతులకు చెరకు బకాయిలు రూ.28 కోట్లు, రవాణా ఛార్జీలు రూ.కోటి కలిపి సుమారు రూ.29 కోట్లు చెల్లించాల్సి వుంది. ఇక కార్మికులకు ఆరు నెలల వేతన బకాయిలు, పదవీ విరమణ చేసిన సిబ్బందికి చెల్లించాల్సిన వివిధ రకాల ప్రయోజనాలు కలిపి సుమారు రూ.10 కోట్లు వుంటాయి. ప్రస్తుతం ఫ్యాక్టరీలో వున్న పంచదార, మొలాసిస్ నిల్వల విలువ రూ.6 కోట్లకు మించి వుండదు. చెరకు రైతులకు, ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిల చెల్లించాలంటే మరో రూ.35 కోట్లు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆప్కాబ్‌తోపాటు ఏ బ్యాంకు కూడా షుగర్ ఫ్యాక్టరీకి రుణం ఇచ్చే పరిస్థితి లేదు. ఇక భారమంతా ప్రభుత్వంపైనే వుంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు.
చెరకు తరలింపుపై స్పష్టత ఇవ్వని షుగర్స్ యాజమాన్యం
గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ జరగదని స్పష్టం చేయడంతోపాటు ఇక్కడి చెరకును శ్రీకాకుళం జిల్లా సంకిలిలోని జీఎంఆర్ షుగర్ ఫ్యాక్టరీకి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. దీనిఇపై ‘గోవాడ’ యాజమాన్యం నుంచి ఇంతవరకు సమాచారం లేదని రైతులు అంటున్నారు. గోవాడ ఫ్యాక్టరీ పరిధిలో సుమారు 70 వేల టన్నుల చెరకు దిగుబడి వస్తుందని అంచనా. సంకిలి ఫ్యాక్లరీ ఎంత ధర చెల్లిస్తుంది? చెరకు సరఫరా చేసిన తరువాత ఎన్ని రోజుల్లో డబ్బులు చెల్లిస్తారు? చెరకు రవాణా ఛార్జీలు ఎవరు భరించాలి? వంటి వాటిపై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది.
రైతులు, కార్మికుల బకాయిలు తీర్చండి
దండుపాటి తాతారావు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి నేత
చెరకు రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కష్టకాలంలో రైతులను ఆదుకోవాలి. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి ఆర్థిక సాయం అందించి క్రషింగ్ జరిగేలా చూడాలి. గోవాడ షుగర్స్‌ను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.