Share News

బలహీనంగా గోవాడ వంతెన

ABN , Publish Date - Nov 08 , 2025 | 12:25 AM

మూడు జిల్లాల ప్రజలు నిత్యం ప్రయాణించే బీఎన్‌ రోడ్డులో శారదా నదిపై గోవాడ వద్ద వున్న వంతెన ప్రమాదకర స్థితిలో వుంది. వంతెన దిగువ భాగం చాలా వరకు కోతకు గురైంది. వంతెన పైభాగంలో పిల్లర్ల మధ్య ఖాళీలు ఏర్పడి క్రమేపీ విస్తరిస్తున్నాయి.

బలహీనంగా గోవాడ వంతెన
బలహీనంగా మారిన గోవాడ వంతెన పిల్లర్లు

వరద ఉధృతికి పిల్లర్ల వద్ద కోత

వంతెనపై జాయింట్ల వద్ద పెరుగుతున్న ఖాళీ

పేరుకుపోయిన మట్టి, పెరిగిన పిచ్చిమొక్కలు

భారీ వాహనాలు వెళుతున్నప్పుడు ప్రకంపనలు

ఆరున్నర దశాబ్దాలు కావడంతో శిథిలస్థితికి చేరిన వారధి

ముప్పు వాటిల్లితే రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం

త్వరగా కొత్త వంతెన నిర్మించాలని ప్రజల వినితి

చోడవరం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మూడు జిల్లాల ప్రజలు నిత్యం ప్రయాణించే బీఎన్‌ రోడ్డులో శారదా నదిపై గోవాడ వద్ద వున్న వంతెన ప్రమాదకర స్థితిలో వుంది. వంతెన దిగువ భాగం చాలా వరకు కోతకు గురైంది. వంతెన పైభాగంలో పిల్లర్ల మధ్య ఖాళీలు ఏర్పడి క్రమేపీ విస్తరిస్తున్నాయి. వంతెన పైభాగంలో నిర్వహణ లేకపోవడంతో ఇరువైపులా మట్టి పేరుకుపోయి, పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగిపోయాయి. మొక్కల వేర్లు వంతెన గోడల్లోకి చొచ్చుకుపోయి కట్టడం బలహీనంగా మారడానికి కారణమవుతున్నాయి. ఇక వంతెన పైభాగంలో జాయింట్ల మధ్య ఏర్పడిన ఖాళీల కారణంగా కన్నాలు పెద్దవి అవుతున్నాయి. దీంతో వంతెన మీదుగా వాహనాలు వెళుతున్నప్పుడు ఈ జాయింట్ల వద్ద పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. భారీ వాహనాలు వెళ్లినప్పుడు భూమి కంపించినట్టుగా ప్రకంపనలు వస్తున్నాయి. వంతెన బలహీనంగా మారడంతో ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని ఈ మార్గంలో నిత్యంరాకపోకలు సాగించే వారు ఆందోళన చెందుతున్నారు.

శారదా నదిపై గోవాడ వద్ద 1960వ సంవత్సరంలో నిర్మించిన ఈ వంతెన దాదాపు శిఽథిలావస్థకు చేరింది. ఏజెన్సీలోని పాడేరు, హకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాల ప్రజలు మైదాన ప్రాంతంలోని విశాఖపట్నం, అనకాపల్లికి... ఇటు మైదాన ప్రాంత ప్రజలు పాడేరు వైపు వెళ్లడానికి గోవాడ వంతెన మీదుగా ప్రయాణించాలి. ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్ని వంతెనల స్థితిగతులపై సర్వే చేయించింది. బలహీనంగా ఉన్న వంతెనల జాబితాలో గోవాడ వంతెన కూడా వుంది. ఈ వంతెనకు అత్యవసరంగా మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు. చోడవరం నుంచి నర్సీపట్నం, మాడుగుల వెళ్లే మార్గాల్లో ఎక్కడైనా వంతెనలు కూలిపోతే వాహనాలు వెళ్లేందుకు ప్రత్నామ్యాయ మార్గాలు ఉన్నాయి. కానీ గోవాడ వంతెనకు ఏదైనా అయితే మరో మార్గం లేదు. గతంలో బొడ్డేరు నదిపై కూలిపోయిన చిన్నపాటి వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించడానికి ఐదేళ్లు పట్టింది.

చోడవరం నియోజకవర్గం పరిధిలోని బీఎన్‌ రోడ్డులో ఇప్పటికే వడ్డాది వద్ద పెద్దేరు నదిపై ఉన్న వంతెన, విజయరామరాజుపేట వద్ద తాచేరు గెడ్డపై వున్న వంతెన కూలిపోయిన విషయం తెలిసింది. ఈ రెండుచోట్ల ఇంతవరకు శాశ్వత వంతెనల నిర్మాణం చేపట్టలేదు వడ్డాది వద్ద కాజ్‌వేపై సీసీ రోడ్డు వేశారు. కానీ నదిలో వరద ఉధృతి పెరిగితే కాజ్‌వేకు ఇరువైపులా సిమెంట్‌ కాంక్రీట్‌ ధ్వంసమై, వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతున్నది. దీంతో లారీలు, బస్సుల రాకపోకలు నిలిచిపోతున్నాయి. కార్లు, జీపులు, ఆటోలు వంటి తేలికపాటి వాహనాలను పాత వంతెన మీదుగా అనుమతిస్తున్నారు. ఇక విజయరామరాజుపేట వద్ద కాజ్‌వేను పూర్తిగా గ్రావెల్‌తో నిర్మించారు. తాచేరు గెడ్డలో వరద ప్రవాహం పెరిగితే కాజ్‌వే కొట్టుకుపోతున్నది. గత రెండేళ్లలో ఈ కాజ్‌వేకు మూడుసార్లు గండి పడింది. దీంతో వాహనాలు చుట్టూ తిరిగి, ఇరుకు రోడ్లలో వెళ్లాల్సి వస్తున్నది. ఈ తరుణంలో గోవాడ వంతెనకు ముప్పు వాటిల్లితే మైదాన ప్రాంతం నుంచి పాడేరు ఏజెన్సీకి రవాణా సదుపాయం స్తంభిస్తుంది. వంతెన కూలిపోయే వరకు వేచిచూడకుండా.. వెంటనే కొత్త వంతెన నిర్మించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Nov 08 , 2025 | 12:25 AM