నగరానికి గవర్నర్ నజీర్
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:30 AM
పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు.
విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):
పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిరప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, మేయర్ పీలా శ్రీనివాసరావు, తదితరులు స్వాగతం పలికారు. గవర్నర్ రాత్రి రాడిసిన్ బ్లూహోటల్‌లో బసచేస్తారు. శుక్రవారం జరగనున్న భాగస్వామ్య సదస్సులో పాల్గొని, తిరిగి సాయంత్రం విజయవాడ వెళతారు.
నేడు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ రాక
విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):
ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం నగరానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ఉదయం 8.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి వస్తారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం 8.55 గంటలకు 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం నుంచి ఉదయం 11.15 గంటలకు బయలుదేరి ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుని విమానంలో ఢిల్లీ వెళతారు.
21న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం
90 అంశాలతో సిద్ధమైన అజెండా
విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ సర్వసభ్య సమావేశం ఈనెల 21న నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు. కౌన్సిల్ సమావేశంలో చర్చించేందుకు 90 అంశాలతో అజెండాను తయారుచేసి, సభ్యులకు పంపిణీ చేశారు. గత సమావేశం ఆగస్టు 22న జరిగిన విషయం తెలిసిందే. మూడు నెలల్లోగా తప్పనిసరిగా కౌన్సిల్ సమావేశం నిర్వహించాలనే నిబంధనతో ఈనెల 21న ఏర్పాటుచేశారు. పెందుర్తి సమీపంలోని వెంకటాద్రి కొండపై దేవదాయశాఖ పరిధిలో ఉన్న ఆలయం ప్రహరీ నిర్మాణానికి రూ.రెండు కోట్లు వెచ్చించేందుకు కౌన్సిల్ ఆమోదానికి ప్రతిపాదించడంపై కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయానికి జీవీఎంసీ నిధులు వెచ్చించాల్సిన అవసరమేమిటని ప్రశ్నిస్తున్నారు.
నేటి నుంచి ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్లు
ద్వారకా బస్‌స్టేషన్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):
ఆర్టీసీ బస్సుల్లో శుక్రవారం నుంచి ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్లు జారీ కానున్నాయి. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను టికెట్ ఇష్యూయింగ్ మెషీన్స్ (టిమ్స్)లో అప్‌లోడ్ చేశారు. కేవలం రూ.100 టికెట్‌ను తీసుకొని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో 24 గంటలపాటు ప్రయాణించవచ్చు. ఆ బస్సుల్లో మాత్రమే ఈ టికెట్లు జారీచేస్తారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు కోరారు.