Share News

నగరానికి చేరుకున్న గవర్నర్‌

ABN , Publish Date - Jun 20 , 2025 | 01:01 AM

రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు.

నగరానికి చేరుకున్న గవర్నర్‌

విశాఖపట్నం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఆయనకు ఎయిర్‌పోర్టులో మేయర్‌ పీలా శ్రీనివాసరావు, కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌, ఇతర అధికారులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి గవర్నర్‌ నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుని బస చేశారు. శుక్రవారం సాయంత్రం హోటల్‌ నుంచి ఐఎన్‌ఎస్‌ డేగా (నేవీ ఎయిర్‌ స్టేషన్‌)కు వెళ్లి ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతారు. ఆ తరువాత తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. 21వ తేదీ ఉదయం ఆర్కే బీచ్‌కు చేరుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, ఇతర ప్రముఖులతో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ఉదయం 11.30 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు వెళ్లి 11.50 గంటలకు ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. తిరిగి హోటల్‌కు చేరుకుని ఆ మరుసటిరోజు అంటే ఆదివారం ఉదయం 7.55 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని 8.25 గంటలకు విమానంలో విజయవాడ వెళతారు.


నేడు, రేపు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు సెలవు

విశాఖపట్నం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్ర, శనివారాలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు సెలవు ప్రకటించారు. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కేంద్రీయ విద్యాలయాలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నట్టు డీఈవో ప్రేమ్‌కుమార్‌, ఇంటర్‌బోర్డు ఆర్‌ఐవో మురళీధర్‌ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘించి పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

5 లక్షల మంది సమీకరణ 9,995 వాహనాలు,75 పార్కింగ్‌ కేంద్రాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

బీచ్‌ రోడ్డుతో పాటు నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో శనివారం నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర’కు ఐదు లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 9,995 వాహనాలు సమకూర్చారు. ఆర్‌టీసీ బస్సులతో పాటు విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ బస్సులను తీసుకున్నారు. వీటిని నియోజకవర్గాలు, గ్రామాలు, వార్డుల వారీగా కేటాయించారు. ఇవన్నీ శుక్రవారం రాత్రి నిర్దేశిత ప్రాంతాలకు చేరిపోతాయి. అక్కడి నుంచి ఉదయం మూడు గంటల నుంచే ప్రారంభమై 5.30 గంటలలోపు బీచ్‌రోడ్డులో నిర్దేశించిన పార్కింగ్‌ కేంద్రాలకు చేరుతాయి. వీటి కోసం 75 పార్కింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీటిలో 2,500 ఆటోలు, 200 మాక్సీ క్యాబ్‌లు ఉండగా మిగిలినవన్నీ బస్సులు. బీచ్‌రోడ్డులో 3.5 లక్షల మంది కోసం ఏర్పాట్లు చేయగా, గురువారం ఉదయానికి 1.9 లక్షల మంది పేర్లు రిజిస్టర్‌ చేసుకున్నారు.

బీచ్‌రోడ్డులో మొత్తం 326 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటుచేశారు. వాటికి అనుబంధంగా 4,280 టాయిలెట్లు పెట్టారు. మొత్తం 5 లక్షల మంది టీ షర్టులు ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 3.32 లక్షలు వచ్చాయి. అలాగే ఆసనాలు వేసేవారికి 5,06,053 మ్యాట్లు సిద్ధం చేశారు. కార్యక్రమం పూర్తయిన తరువాత ఎవరి మ్యాట్‌ వారు ఇంటికి తీసుకువెళ్లిపోవచ్చు. కార్యక్రమం తిలకించడానికి 335 ఎల్‌ఈడీ స్ర్కీన్లు పెట్టారు. అలాగే సమాచారం కోసం 326 వైఫై సెంటర్లు నెలకొల్పారు. 3.5 లక్షల మందితో యోగాసనాలు వేయించానికి 5,451 మంది మాస్టర్‌ ట్రైనర్లు, 1,44,310 మందికి శిక్షణ ఇచ్చారు. వీరంతా కలిసి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు.


నేడు, రేపు చేపల వేటపై ఆంక్షలు

విశాఖపట్నం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి భీమిలి వరకూ శుక్ర, శనివారాల్లో చేపల వేట నిలుపు చేయాలని మత్స్యకారులను మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మణరావు కోరారు. రామకృష్ణా బీచ్‌ నుంచి భీమిలి వరకూ శనివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు తదతర ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. మత్స్యకారులు దీనికి సహకరించాలని కోరారు.

Updated Date - Jun 20 , 2025 | 01:02 AM