గిరిజన రిజర్వేషన్లపై సర్కారు సానుకూలత!
ABN , Publish Date - Jul 19 , 2025 | 10:53 PM
రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు గిరిజనులకు దక్కేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీవో 3కి ప్రత్యామ్నాయంగా కొత్త జీవో జారీ కోసం ఏజెన్సీలో వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. ఇప్పటికే గిరిజన ఉపాధ్యాయ, ప్రజా, విద్యార్థి సంఘాల అభిప్రాయాలను సేకరిస్తోంది. అంతేకాకుండా న్యాయ, పరిపాలన పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది.
జీవో 3 ప్రత్యామ్నాయంపై యంత్రాంగం కసరత్తు
ఐటీడీఏల వారీగా వర్క్‌షాప్‌ల నిర్వహణ
నాడు జీవో 3 రద్దుపై కనీసం స్పందించని వైసీపీ ప్రభుత్వం
గిరిపుత్రులకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
గిరిజన ప్రాంతంలో ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. జీవో 3కి ప్రత్యామ్నాయంగా మరో జీవోని జారీకి కసరత్తు ప్రారంభించింది. గతంలో జీవో 3తో గిరిజన ప్రాంతంలోని టీచర్ పోస్టులన్నీ గిరిజనులతో భర్తీ చేసే అవకాశం ఉండేది. కానీ అనివార్య కారణాలతో 2020 ఏప్రిల్‌లో జీవో 3ని సుప్రీంకోర్డు రద్దు చేసింది. దీంతో తాము అన్యాయానికి గురయ్యామని గిరిజనులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం జీవో 3 రద్దుపై గిరిజనులకు న్యాయం చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గిరిజనులకు జీవో 3 రద్దుతో జరిగిన నష్టాన్ని తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ మేరకు అవసరమైన న్యాయ, పరిపాలనా అంశాలను పరిగణనలోకి తీసుకుని జీవో 3కి ప్రత్యామ్నాయ జీవోను తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపట్టింది. గిరిజనుల రిజర్వేషన్లపై ఐఏఎస్ అధికారైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఐటీడీఏల వారీగా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నది. గిరిజన ప్రజా, విద్యార్థి సంఘాలు, తదితరుల నుంచి రిజర్వేషన్లపై అభిప్రాయాలను సేకరిస్తున్నది. ఇప్పటికే పార్వతీపురం, రంపచోడవరం ఐటీడీఏల్లో వర్క్‌షాప్‌లు జరగ్గా, ఈనెల 22న పాడేరు ఐటీడీఏలో వర్క్‌షాప్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గిరిజన రిజర్వేషన్ల కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం
గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గిరిజనుల సమస్యలపై ఎవరైనా ఆందోళనలకు దిగితే పోలీసులను రంగంలోకి దింపి వారి గొంతు నొక్కేసేవారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా గిరిజనులకు మేలు చేసేందుకే అడుగులు వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. జీవో 3ని పునరుద్ధరించాలనే డిమాండ్‌పై ఈ ఏడాది మే 2, 3 తేదీల్లో గిరిజనులు బంద్ చేపడితే.. వారిపై ఎటువంటి ఒత్తిడి, అక్రమ కేసులు నమోదు చేయకుండా సానుకూలంగా ప్రభుత్వం స్పందించింది. అందులో భాగంగా మే 3న జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్ కలెక్టరేట్‌లో గిరిజన సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాలును తెలుసుకున్నారు. అలాగే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సైతం అనుకూలంగా స్పందించి మేనెల 5న వివిధ గిరిజన సంఘాల నేతలో సాలూరులో భేటీ అయ్యారు. రిజర్వేషన్లపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని వారికి భరోసా ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు గిరిజనులకే ఇచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు పడుతుందని మే 12న స్వయంగా ప్రకటించారు. దీంతో గత వైసీపీ పాలనలో గిరిజన సమస్యలపై నెలకొన్న వైఖరిని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో వైఖరిని మన్యం వాసులు బేరీజు వేసుకుంటున్నారు.
జీవో 3పై వైసీపీది రెండు నాల్కల ధోరణి
టీచర్ పోస్టుల భర్తీలో గిరిజనులకు శత శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 3 సమస్యలపై వైసీపీ రెండు నాల్కల ధోరణి అవలంబించడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పడు 2020లోనే జీవో 3ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే, అప్పట్లో దానిపై స్పందించడం లేదా అదే ప్రయోజనాలు కలిగేలా మరో జీవోను రూపొందించి గిరిజనులకు న్యాయం చేయాల్సిన వైసీపీ ప్రభుత్వం మిన్నకుంది. కాని ప్రస్తుత కూటమి ప్రభుత్వం జీవో 3కి ప్రత్యామ్నాయంగా మరో జీవోను తీసుకువచ్చేందుకు పక్కాగా చర్యలు చేపడుతున్నప్పటికీ.. కూటమి ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తుందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుండడం విడ్డూరంగా ఉందని పలు గిరిజన సంఘాల నేతలు అంటున్నారు.