గోవాడ షుగర్స్‌పై సర్కార్ నిర్లక్ష్యం
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:01 AM
గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నదని చెరకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రావు సూర్యనారాయణ ఆరోపించారు. చెరకు రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించాలని, ఫ్యాక్టరీని ప్రభుత్వమే ఆధునీకరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతు సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ వద్ద ధర్నా నిర్వహించారు.

ఫ్యాక్టరీని పట్టించుకోకపోవడం ప్రజాప్రతినిధులకు తగదు
చెరకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రావు సూర్యనారాయణ
ఫ్యాక్టరీ వద్ద రైతు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా
రైతులు, కార్మికులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్
24న చెరకు రైతులకు చెల్లింపులు: ఎండీ వెల్లడి
చోడవరం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నదని చెరకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రావు సూర్యనారాయణ ఆరోపించారు. చెరకు రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించాలని, ఫ్యాక్టరీని ప్రభుత్వమే ఆధునీకరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతు సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షుగర్ ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, ప్రభుత్వంగానీ, ప్రజాప్రతినిధులుగానీ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రైతు సంఘం నాయకులు డి.వెంకన్న, రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ, ఎన్నికల ముందు గోవాడ షుగర్స్‌ను గాడిలో పెడతామని ప్రకటించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీవైపు కన్నెత్తయినా చూడకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. క్రషింగ్ జాప్యం కారణంగా పొలాల్లో, కాటాల వద్ద చెరకు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పొలాల్లో వున్న చెరకు మొత్తం క్రషింగ్ చేసే వరకు సీజన్‌ను ముగించవద్దని, పాత బకాయిలతోపాటు ప్రస్తుత సీజన్‌లో చెరకు సరఫరా చేస్తున్న రైతులకు వెంటనే చెల్లింపులు జరపాలని, కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపటి తరువాత ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. నెలాఖరులోగా రైతులకు పాత బకాయిలు ఇవ్వడంతోపాటు, పొలాల్లో వున్న చెరకునంతటినీ క్రషింగ్ చేయాలని రైతు సంఘం నాయకుడు కోన మోహనరావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ బి.అప్పలరాజు, సిబ్బందితో ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. ఆందోళనకారులను అక్కడ నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
24న చెరకు రైతులకు చెల్లింపులు: ఎండీ
ఆందోళన అనంతరం రైతు సంఘాల నేతలు గోవాడ షుగర్స్ ఎండీ సన్యాసినాయుడును కలిసి వినతిపత్రం ఇచ్చారు. చెరకు బకాయిలు, ఫ్యాక్టరీ ఆధునికీకరణపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎండీ స్పందిస్తూ.. చెరకు బకాయిలను వారంలోగా చెల్లించడానికి చర్యలు చేపట్టామన్నారు. పంచదార, మొలాసిస్‌ను విక్రయించి రైతులకు పాత బకాయిలు చెల్లిస్తామన్నారు. ప్రస్తుత సీజన్‌లో చెరకు మద్దతు ధర టన్నుకు రూ.3151కాగా రూ.3 వేల చొప్పున సోమవారం రైతుల ఖాతాలకు జమచేస్తామన్నారు. ఫ్యాక్టరీకి రూ.28.5 కోట్లు విడుదల చేయాలని షుగర్ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో చెరకు రైతు సంఘం జిల్లా నాయకుడు కర్రి అప్పారావు, సీఐటీయూ నాయకులు గూనూరు వరలక్ష్మి, వి.వి.శ్రీనివాసరావు, గండి నాయనిబాబు, ఎస్.వీ.నాయుడు, నాగిరెడ్డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.