Share News

చేనేతలకు ప్రభుత్వం అండ

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:46 AM

చేనేత రంగాన్ని, దీనిపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు, రాయితీలు అమలు చేస్తున్నాయని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, భారతదేశ చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వుందని అన్నారు.

చేనేతలకు ప్రభుత్వం అండ
చేనేత కార్మికుడిని సన్మానిస్తున్న ఎమ్మెల్యే సుందరపు, ఏపీఆర్‌డీసీ చైర్మన్‌ ప్రగడ, మాజీ ఎంపీ చలపతిరావు. పక్కన కలెక్టర్‌ విజయకృష్ణన్‌

కార్మికులను ఆదుకోవడానికి పలు పథకాలు, రాయితీలు

చేనేత ఉత్పత్తుల గ్లోబల్‌ మార్కెటింగ్‌కు కృషి

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అచ్యుతాపురం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): చేనేత రంగాన్ని, దీనిపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు, రాయితీలు అమలు చేస్తున్నాయని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, భారతదేశ చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందిస్తుందని చెప్పారు. జిల్లాలో 2,593 చేనేత కార్మికులకు ప్రతినెలా పెన్షన్లు అందిస్తున్నాయని తెలిపారు. నేషనల్‌ హ్యాండ్‌లూమ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద పాయకరావుపేట క్లస్టర్‌లో మగ్గాలు, జాక్వార్డ్‌ లిఫ్టింగ్‌ పరికరాలు, సోలార్‌ లైటింగ్ల్‌, వర్క్‌షెడ్‌ల కోసం 87 మంది చేనేత కార్మికులకు మొదటి విడత రూ.48.78 లక్షలు అందజేసినట్టు ఆమె తెలిపారు. చేనేత ఉత్పత్తులకు గ్లోబల్‌ మార్కెటింగ్‌ కల్పించేందుకు చొరవ తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ మాట్లాడుతూ, చేనేత వస్త్రాలకు పలుదేశాల్లో ఆదరణ పెరుగుతున్నదని, కార్మికులు వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను సత్కరించారు. చేనేత సంఘం నాయకుడు పప్పు రాజారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఆర్‌డీసీ చైర్మన్‌ ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజాన సన్యాసి నాయుడు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 12:46 AM