ప్రభుత్వ బడులు వెలవెల!
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:46 AM
రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాది దాటినా.. విద్యా శాఖలో కొంతమంది అధికారుల తీరు మారలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ మండల విద్యా శాఖ అధికారులు పెద్దగా శ్రద్ధ చూపలేదు. దీంతో గతంలో మాదిరిగానే పలు ప్రాథమిక పాఠశాలల్లో ఒకరు, ఇద్దరు విద్యార్థులు మాత్రమే వున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఒక పాఠశాలల్లో ఈ ఏడాది ఒక్క విద్యార్థి కూడా లేనప్పటికీ ఇటీవల జరిగిన బదిలీల్లో ఈ పాఠశాలకు ఒక ఎస్‌జీటీని బదిలీ చేశారు.
ప్రభుత్వం మారి ఏడాదైనా.. విద్యా శాఖను వీడని పాత వాసన
ప్రాథమిక పాఠశాలల్లో అరకొరగా విద్యార్థులు
కొత్త ప్రవేశాలకు శ్రద్ధ చూపని విద్యా శాఖ అధికారులు
ఒకరిద్దరు విద్యార్థులతోనే నడుస్తున్న స్కూళ్లు
మాకవరపాలెం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాది దాటినా.. విద్యా శాఖలో కొంతమంది అధికారుల తీరు మారలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ మండల విద్యా శాఖ అధికారులు పెద్దగా శ్రద్ధ చూపలేదు. దీంతో గతంలో మాదిరిగానే పలు ప్రాథమిక పాఠశాలల్లో ఒకరు, ఇద్దరు విద్యార్థులు మాత్రమే వున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఒక పాఠశాలల్లో ఈ ఏడాది ఒక్క విద్యార్థి కూడా లేనప్పటికీ ఇటీవల జరిగిన బదిలీల్లో ఈ పాఠశాలకు ఒక ఎస్‌జీటీని బదిలీ చేశారు.
మండలంలోని వెంకయ్యపాలెం పాఠశాలలో గత ఐదు సంవత్సరాలుగా ఇద్దరు విద్యార్థులు, వీరికి పాఠాలు బోధించడానికి ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో అధికారులు స్పందించి ఒక ఉపాధ్యాయుడుని బదిలీ చేశారు. ఈ ఏడాది కూడా ఇక్కడ ఇద్దరు విద్యార్థులే వున్నారు. కొత్తగా ఒక్క విద్యార్థిని కూడా చేర్పించలేకపోయారు. సుభద్రయ్యపాలెం పాఠశాలలో గత విద్యా సంవత్సరం వరకు ఇద్దరు విద్యార్థులు వుండేవారు. వీరు ఐదో తరగతి పూర్తి చేసుకుని, ఉన్నత పాఠశాలలో ఆరో తరగతిలో చేరారు. ఈ ఏడాది కొత్తగా ఎవరూ చేరలేదు. దీంతో ఒక్క విద్యార్థి కూడా లేరు. అయినప్పటికీ బదిలీల్లో భాగంగా ఈ పాఠశాలకు ఒక టీచర్‌ను నియమించారు. మల్లవరం ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది ముగ్గురు విద్యార్థులు వుండగా, ఈ ఏడాది ఇద్దరు మాత్రమే వున్నారు. బూరుగుపాలెం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, బుచ్చన్నపాలెం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, జడ్.గంగవరం పాఠశాలలో నలుగురు విద్యార్థులు, దుంగలవానిపాలెం పాఠశాలలో నలుగురు విద్యార్థులు, చంద్రయ్యపాలెం పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు, జి.గంగవరం పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు, ఎన్‌జీఆర్ పేట అగ్రహారం పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు, తామరం-1 పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులు, తామరం-2 పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులు వున్నారు. ఈ పాఠశాలల్లో ఒక్కొక్కరు చొప్పున ఉపాధ్యాయులు వున్నారు. మరికొన్ని పాఠశాల్లో పది కన్నా తక్కువ మంది విద్యార్థులు వున్నారు. వైసీపీ అధికారంలో వున్నప్పుడు కూడా ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇంచుమించుగా ఇదే విధంగా వుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రభుత్వ విద్యా విధానంపై ప్రత్యేక దృష్టి సారించారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికీ సాయం అందిస్తామని ప్రకటించారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడంపై మండల విద్యా శాఖ అధికారులు తగిన శ్రద్ధ చూపలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.