అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ పథకాలు
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:26 PM
జిల్లాలో అర్హులైన గిరిజనులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.

జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్
పీఎం డీఏజుగాపై అవగాహన సదస్సు ప్రారంభం
ఈనెల 30 నిర్వహించాలని నిర్ణయం
పాడేరు, జూన్ 15 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో అర్హులైన గిరిజనులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి దర్తి అభజన జాతీయ అత్కర్ష అభియాన్ (పీఎం డీఏ జుగా)పై మండలంలో చింతలవీధిలో అవగాహన సదస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అత్యధికంగా గిరిజనులు ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను మారుమూల పల్లెల్లో ఉన్నవారికి అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో మారుమూలన ఉన్న 518 గ్రామాలు పీఎం జుగా పథకానికి ఎంపికయ్యారు. ఆయా పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాలను పొందేలా ఆదివారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు పాడేరు డివిజన్‌లో 260 గ్రామాల్లో, రంపచోడవరం డివిజన్‌లో 211, చింతూరు డివిజన్‌లో 57 గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. అలాగే గిరిజనులు ఆయా పథకాలను పొందేందుకు ముందుకు రావాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ కోరారు. కార్యక్రమానికి ముందు భగవాన్ బిర్సాముండ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన వెలుగు, ఐసీడీఎస్ స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, హౌసింగ్ పీడీ బి.బాబు, ఎంపీడీవో తేజ్‌రతన్, పీఎంయూ ప్రతినిధి రాజేశ్, ట్రైకార్ డైరెక్టర్ కూడ కృష్ణారావు, కాఫీ బోర్డు డైరెక్టర్ కురసా ఉమామహేశ్వరరావు, సర్పంచ్ వంతాల సీతమ్మ, గిరిజనులు పాల్గొన్నారు.