Share News

ఆక్రమణల చెరలో ప్రభుత్వ భూములు

ABN , Publish Date - Sep 21 , 2025 | 12:25 AM

జిల్లాలోని కొన్ని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. లంకెలపాలెం, సిరసపల్లి, మారేడుపూడి, సాలాపువానిపాలెం, కొత్తూరు, కొప్పాక, కాలేజ్‌ జంక్షన్‌ పరిసరాల్లో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చెరలో ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో దర్జాగా పాగా వేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.

ఆక్రమణల చెరలో ప్రభుత్వ భూములు
అనకాపల్లి మండలంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రంథాలయ భవనం ఎదుట ఆక్రమణకు గురైన స్థలం

- నకిలీ ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్లు

- దర్జాగా నిర్మాణాలు

- పట్టించుకోని అధికారులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని కొన్ని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. లంకెలపాలెం, సిరసపల్లి, మారేడుపూడి, సాలాపువానిపాలెం, కొత్తూరు, కొప్పాక, కాలేజ్‌ జంక్షన్‌ పరిసరాల్లో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చెరలో ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో దర్జాగా పాగా వేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.

అనకాపల్లి పట్టణంలోని కాలేజీ జంక్షన్‌కు సమీపంలో జాతీయ రహదారిని ఆనుకొని సర్వే నంబర్లు 674-10, 674-11లలో సుమారు 33 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇందులో 5 సెంట్ల భూమిని డిజిటల్‌ గ్రంథాలయ భవన నిర్మాణానికి కేటాయించారు. ఇప్పటికే ఆ స్థలంలో డిజిటల్‌ గ్రంథాలయ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇదే సర్వే నంబరులోని 10 సెంట్ల స్థలాన్ని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయానికి కూటమి ప్రభుత్వం కేటాయించింది. ఇటీవల ఈ భూమిలో భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ శంకుస్థాపన కూడా చేశారు. 674-10 సర్వేలో మిగిలిన 18 సెంట్ల భూమిని కొందరు కబ్జా చేశారు. అంతటితో ఆగకుండా సదరు వ్యక్తులు ఆక్రమించిన ప్రభుత్వ భూమికి సమీపంలోని 674-8, 674-9 జిరాయితీ భూముల సర్వే నంబర్లతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకోగలిగారు. రెవెన్యూ, జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆక్రమణదారులు 674-10లోని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ ఉద్యోగుల సంఘ భవనానికి కేటాయించిన స్థలాన్ని కొందరు సొంతం చేసుకొనే ప్రయత్నం చేశారు. దీనిపై స్పందించిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే అనకాపల్లి శివారులో జాతీయ రహదారికి చెందిన సర్వే నంబరు 1652/599లోని డబుల్‌ ట్రంపెట్‌ ఫ్లైఓవర్‌ సమీపంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. సబ్బవరం మీదుగా ఆనందపురం వెళ్లే ఫ్లైఓవర్‌కు సమీపంలో ఒక టిండర్‌ డిపో నిర్వాహకుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించి వేయింగ్‌ మెషీన్‌ను, ఫ్లైవుట్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై గతంలో ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా సదరు టింబర్‌ డిపో యజమానికి నోటీసులు జారీ చేసి వదిలేశారు. ప్రస్తుతం ఫ్లైఓవర్‌కు ఆనుకొని భారీ షెడ్డు, గోడ నిర్మించి టింబర్‌ డిపోను నిర్వహిస్తుండడం గమనార్హం. అంతే కాకుండా పరవాడ మండలం లంకెలపాలెం, సాలాపువానిపాలెం, మారేడుపూడి, కొత్తూరు, సిరసపల్లి, జాతీయ రహదారిని ఆనుకొని వున్న కశింకోట, ఎలమంచిలి, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల పరిధిలో విలువైన భూములు ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ, జాతీయ రహదారుల విభాగం అధికారులు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను గుర్తించి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Sep 21 , 2025 | 12:25 AM