ప్రభుత్వ భూమికి ఎసరు!
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:29 AM
కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి రక్షణ కోసం జిల్లా యంత్రాంగం అనేక సంవత్సరాలుగా పాటుపడుతుంటే, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఒకరు ప్రైవేటు వ్యక్తికి అనుకూలంగా ఇటీవల నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
22ఏ జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర స్థాయి అధికారి ఉత్తర్వులు
ఆ భూమి మూడు దశాబ్దాల కిందట వుడాకు అప్పగించిన ప్రభుత్వం
తమదిగా క్లెయిమ్ చేసుకుంటున్న ప్రైవేటు వ్యక్తులు
కోర్టులో కేసులు ఉంటున్నా...ఏకపక్షంగా ఆదేశాలు
ఉన్నతాధికారి ఉత్తర్వులపై న్యాయ సలహా కోరిన జిల్లా యంత్రాంగం
(విశాఖపట్నం/కొమ్మాది-ఆంధ్రజ్యోతి)
కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి రక్షణ కోసం జిల్లా యంత్రాంగం అనేక సంవత్సరాలుగా పాటుపడుతుంటే, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఒకరు ప్రైవేటు వ్యక్తికి అనుకూలంగా ఇటీవల నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. రూరల్ మండలం మధురవాడ గ్రామ సర్వే నంబరు (పీఎం పాలెం స్టేడియం ఎదురుగా ఎంవీవీ సిటీ రోడ్డులో) 367/4లో 2.85 ఎకరాల భూమిని నిషేధిత జాబితా 22 (ఎ) నుంచి తొలగించాలని ప్రైవేటు వ్యక్తికి అనుకూలంగా పూర్వపు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఈ ఏడాది ఫిబ్రవరి ఆరో తేదీన ఉత్తర్వులు ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లా యంత్రాంగం న్యాయ పోరాటానికి నిర్ణయించింది.
మధురవాడ రెవెన్యూ సర్వే నంబర్ 367లో 9.27 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని 1971లో మూడు సబ్ డివిజన్‌లుగా విభజించారు. దీని ప్రకారం 367/1లో 3.25 ఎకరాలు ఓరుగంటి సూర్యనారాయణకు, 367/2లో 3.92 ఎకరాలు సూరావజ్జుల నాగభూషణానికి కేటాయించి, మిగిలినది గయాలుగా గుర్తించారు. దీనికి సరిహద్దులగా సర్వే నంబర్లు 368, 369, 366, 361గా రికార్డులలో పొందుపరిచారు. ఓరుగంటి సూర్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు తమకు కేటాయించిన భూమిని 43 ప్లాట్లుగా విభజించి విక్రయించారు. వాటిలో 13 ప్లాట్లకు సంబంధించి లావాదేవీల డాక్యుమెంట్లు మాత్రం లభించాయి. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా వినియోగించారనే అభియోగంపై సూర్యనారాయణకు భూ కేటాయింపును 1988లో ప్రభుత్వం రద్దు చేసింది. ఆ భూమిని తరువాత అప్పటి వుడా (ప్రస్తుతం వీఎంఆర్‌డీఎ)కు అప్పగించింది. ప్రస్తుతం ఈ భూమిపై న్యాయస్థానాల్లో పలు కేసులు విచారణలో ఉన్నాయి.
కానీ, సర్వే నంబర్ 367/1లో గల 2.85 ఎకరాలను 367/4గా చూపుతూ టి.అప్పన్న పేరిట 1976లో సెటిల్‌మెంట్ పట్టా ఇచ్చి, రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేసి 10 (1), అడంగల్ జారీచేసినట్టు కొందరు ఒక రికార్డు సృష్టించారు. అనంతరం అప్పన్న నుంచి భూమి కొనుగోలు చేసినట్టు రికార్డులు ట్యాంపర్ చేశారు. దీని ప్రకారం భూమి కొనుగోలు చేసిన వ్యక్తులు 2016లో సర్వే నంబరు 367/1లో గల భూమిలో అపార్టుమెంట్ల నిర్మాణం చేపట్టారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో 2017లో అప్పటి కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జిల్లాలో 1976లో భీమిలి, చోడవరం తాలూకాలకు చెందిన ముగ్గురికి మాత్రమే సెటిల్‌మెంట్ పట్టాలు జారీచేశారని, ఆ ముగ్గురిలో అప్పన్న పేరు లేదని సెటిల్‌మెంట్ విభాగం అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. వాస్తవంగా రెవెన్యూ రికార్డులలో 367/1, 367/2, 367/3 పేరిట మూడు సబ్ డివిజన్లు మాత్రమే ఉండగా, కొందరు కబ్జాదారులు 367/4ను సృష్టించారని అధికారులు గుర్తించారు. తప్పుడు డాక్యుమెంట్లతో 2016లో జీవీఎంసీ నుంచి ప్లాన్ అనుమతి తీసుకుని భవనం నిర్మించారు. అయితే ఆ నిర్మాణాలపై ఓరుగంటి సూర్యనారాయణ వారసులు అభ్యంతరం వ్యక్తంచేయడంతోపాటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 2016లో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించి తొలుత అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టారు. దానిపై అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ విచారణకు ఆదేశించారు. ఈలోగా 367/4లో భూమి కొనుగోలు చేశామని చెబుతున్న వ్యక్తులు కోర్టుతోపాటు రెవెన్యూ ఉన్నతాధికారుల కోర్టును ఆశ్రయించారు.
ఇదిలావుండగా రెవెన్యూ కోర్టులో ఉన్న కేసును విచారించిన రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, భూమి కొనుగోలు చేసిన వ్యక్తికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రెవెన్యూ 01-ఎల్‌ఎఎన్‌ఎ/42/2025/ల్యాండ్స్-1 పేరిట ఈ ఏడాది ఫిబ్రవరి ఆరో తేదీన మెమో జారీచేశారు. 1976లో టి.అప్పన్న అనే వ్యక్తికి అప్పటి సెటిల్‌మెంట్ అధికారి పట్టా మంజూరుచేసి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారని పేర్కొన్నారు. 10(1)లో పట్టా నంబరు 711గా మార్పు చేశారని, ఎఫ్‌ఎంబీలో నమోదు చేశారని వివరించారు. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితా 22 (ఎ) నుంచి సర్వే నంబరు 367/4లో 2.85 ఎకరాలను తొలగించేలా జిల్లా రిజిస్ట్రార్‌కు మార్గదర్శకాలు జారీచేయాలని మెమోలో పేర్కొన్నారు. తమ ఆదేశాలు 15 రోజుల్లో ఆదేశాలు అమలు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి వచ్చిన మెమోపై జిల్లా కలెక్టర్...సంబంధిత అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని సెటిల్‌మెంట్ రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వానికి చెందిన భూమిగా సంబంధిత అధికారులు నిర్ధారించడంతో న్యాయ సలహా తీసుకునేందుకు సంబంధిత శాఖకు మూడు నెలల క్రితమే లేఖ రాశారు. న్యాయసలహా వచ్చిన తరువాత కోర్టులో కేసు దాఖలు చేయాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు.