ఎంవీవీ/ఎంకే పార్క్‌లో ప్రభుత్వ భూమి
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:14 AM
కూర్మన్నపాలెంలో ఎంవీవీ/ఎంకే బిల్డర్స్ నిర్మించిన బహుళ అంతస్థుల సముదాయం (ఎంవీవీ,ఎంకే పార్క్)లో 25.5 సెంట్ల ప్రభుత్వ భూమి ఉన్నట్టు రెవెన్యూ శాఖ తేల్చింది.
25.5 సెంట్లు ఉన్నట్టు రెవెన్యూ నిర్ధారణ
నిర్మాణదారులకు నోటీస్
విశాఖపట్నం/గాజువాక, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
కూర్మన్నపాలెంలో ఎంవీవీ/ఎంకే బిల్డర్స్ నిర్మించిన బహుళ అంతస్థుల సముదాయం (ఎంవీవీ,ఎంకే పార్క్)లో 25.5 సెంట్ల ప్రభుత్వ భూమి ఉన్నట్టు రెవెన్యూ శాఖ తేల్చింది. ఆ 25.5 సెంట్లలో గల నిర్మాణాలను తొలగించాలని ఎంవీవీ/ఎంకే హౌసింగ్ పార్టనర్‌షిప్ సంస్థకు గత నెల 28వ తేదీన గాజువాక తహశీల్దారు నోటీసులు జారీచేశారు. సర్వే నంబర్ 55/3లో గల 2.68 ఎకరాల్లో రహదారి ఉండగా, అందులో 25.5 సెంట్లు ఎంవీవీ, ఎంకే బిల్డర్స్ ఆక్రమించారని తాజా నోటీసులో పేర్కొన్నారు. రహదారిలో 25.5 సెంట్లు ఆక్రమించుకుని ప్రహరీ గోడ, ఇంకా పార్కు, స్విమ్మింగ్‌పూల్ నిర్మించారు. నోటీస్ గడువు ముగిసిన తరువాత అపార్టుమెంట్ ప్రహరీ గోడ కూల్చి 25.5 సెంట్లు స్వాధీనం చేసుకుంటామని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ భారీ హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టారు. అధికారంలో ఉండడంతో అనేక ఉల్లంఘనలకు పాల్పడినా అధికారులు పట్టించుకోలేదు. తాజాగా రెవెన్యూ అధికారులు నోటీస్‌లు జారీచేసినందున, జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు అపార్టుమెంట్ అనుమతులు రద్దుకు షోకాజ్ ఇచ్చేందుకు అవకాశం ఉంది. కానీ రాష్ట్ర టౌన్‌ప్లానింగ్ ఉన్నతాధికారుల ఒత్తిడితో తమకేమి పట్టనట్టుగా జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తెలియక కొన్నాం..
కూర్మన్నపాలెంలో ఎంవీవీ/ఎంకే అపార్టుమెంటులో ఫ్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులను కలిసి గోడు చెప్పుకున్నారు. ఆ స్థలంలో ప్రభుత్వ భూమి ఉందని తమకు తెలియదని, తామంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారమని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నామని అధికారులకు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.