Share News

కాఫీ రైతులకు సర్కారు భరోసా

ABN , Publish Date - Sep 04 , 2025 | 11:42 PM

మన్యంలోని గిరిజన రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కాఫీ పంటకు బెర్రీ బోరర్‌ తెగులు ఆశించడంపై కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో తెగులును గుర్తించడంతో పాటు అది విస్తరించకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించింది. బెర్రీ బోరర్‌ కారణంగా పంటను నష్టపోయిన గిరిజన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.

కాఫీ రైతులకు సర్కారు భరోసా
అరకులోయ మండలం చినలబుడు పంచాయతీ పకనకుడి గ్రామంలో కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు సోకిన కాఫీ కాయలు

బెర్రీ బోరర్‌ తెగులు నివారణపై ప్రత్యేక దృష్టి

రైతులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశం

గ్రామ సభల ద్వారా బాధితులను గుర్తించి నష్టపరిహారం అందజేతకు చర్యలు

నేటి నుంచి ఏజెన్సీ వ్యాప్తంగా ఎంపీడీవోల ఆధ్వర్యంలో గ్రామ సభలు

కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా స్థాయి ప్రత్యేక కమిటీ నియామకం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలోని గిరిజన రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కాఫీ పంటకు బెర్రీ బోరర్‌ తెగులు ఆశించడంపై కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో తెగులును గుర్తించడంతో పాటు అది విస్తరించకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించింది. బెర్రీ బోరర్‌ కారణంగా పంటను నష్టపోయిన గిరిజన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఏజెన్సీ 11 మండలాల్లో సుమారుగా రెండున్నర లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించగా, వాటిపై సుమారుగా లక్ష పైబడి గిరిజన కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ క్రమంలో కాఫీ పంటను సంపూర్ణంగా రక్షించుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి సూచించింది.

కాఫీ రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు

వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టపరిహారం చెల్లించడం సహజం. కానీ అందుకు భిన్నంగా మన్యంలోని కాఫీ పంటకు సైతం నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ముఖ్యంగా ఏయే ప్రాంతాల్లోని కాఫీ తోటలకు బెర్రీ బోరర్‌ తెగులు సోకిందో శాస్త్రవేత్తలు, కాఫీ బోర్డు అధికారుల బృందంతో అధ్యాయనం చేయడంతో పాటు గుర్తించిన తోటల్లో తెగులు నివారణకు చర్యలు చేపట్టాలని సూచించింది. దీంతో ఏజెన్సీ వ్యాప్తంగా ఎక్కడెక్కడ కాఫీ తోటలు ఎలా ఉన్నాయనే దానిపై అధికారులు ప్రస్తుతం వాకాబు చేస్తున్నారు. అలాగే బెర్రీ బోరర్‌ కారణంగా కాఫీ పంటను నష్టపోయిన గిరిజన రైతులకు కిలోకు రూ.50 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించింది. అధిక మొత్తంలో పంటను నష్టపోయే రైతులకు ఆయా పంటను భూమిలో పూడ్చేందుకు ఎకరానికి రూ.5 వేలు చొప్పున అదనపు సాయం అందించనుంది. ఏజెన్సీలో కాఫీ పంటను నష్టపోయిన ప్రాంతాల్లో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభలను నిర్వహించి బాధిత రైతులను గుర్తించేందుకు శుక్రవారం నుంచి సభలను నిర్వహించాలని జిల్లా అధికారులు సూచించారు.

కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీ

మన్యంలో కాఫీ పంటను ఆశించిన బెర్రీ బోరర్‌ సమస్యపై కలెక్టర్‌ చైర్మన్‌గా ఒక జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా కాఫీ రైతులను ఆదుకోవడంతో పాటు, పంటను బెర్రీ బోరర్‌ నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ జిల్లా స్థాయి కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్‌, కన్వీనర్‌గా ఐటీడీఏ పీవో, సభ్యులుగా ఎస్‌పీ, సబ్‌కలెక్టర్‌, డీఎఫ్‌వో, కేంద్ర కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్‌, కాఫీ సీనియర్‌ లైజన్‌ అధికారి, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా ఉద్యానవనాధికారి, ఐటీడీఏ కాఫీ విభాగం ఏడీ, సేంద్రీయ వ్యవసాయం జిల్లా మేనేజర్‌, అటవీ అభివృద్ధి సంస్ధ డివిజనల్‌ మేనేజర్లు, ఏజెన్సీ పదకొండు మండలాల్లోని ఎంపీపీలు ఉంటారు. అలాగే ఈ కమిటీ కాలపరిమితి మూడేళ్లు ఉంటుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో కాఫీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను అధికారికంగా చేపడతారు.

Updated Date - Sep 04 , 2025 | 11:42 PM