ప్రజలకు చేరువగా పాలన
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:07 AM
సుపరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణకు పెద్దపీట వేసిందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారం నర్సీపట్నం పాత మునిసిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి (డీడీవో) కార్యాలయాన్ని ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
వికేంద్రీకరణతో సత్వరమే ప్రభుత్వ సేవలు
శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నంలో డీడీవో కార్యాలయం ప్రారంభం
నర్సీపట్నం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): సుపరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణకు పెద్దపీట వేసిందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారం నర్సీపట్నం పాత మునిసిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి (డీడీవో) కార్యాలయాన్ని ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీలకు సంబంధించి చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రానికి, జిల్లా పరిషత్తులకు వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. ఇప్పుడు డివిజన్ స్థాయి ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీడీ, డివిజన్ పంచాయతీ, డివిజన్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలను ఒకే ఆవరణలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ అవుతాయని తెలిపారు. దీని వల్ల సమయం, ఖర్చులు ఆదా అవుతాయని అన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం సమితులు వున్నప్పుడు ఉద్యోగులకు పదోన్నతులు లభించాయని, మళ్లీ ఇన్నాళ్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో డీడీవో కార్యాలయాలు ఏర్పాటై, ఉద్యోగులకు పదోన్నతులు లభించాయని చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇక్కడి నుంచి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా డీడీవో కార్యాలయాలకు సొంత భవనాలు ఒకే నమూనాతో నిర్మాణం చేపడితే బాగుటుందని సూచించారు. ఉపాధి హామీ పథకం నిధులతో పంట కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు చేపడితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి సూర్యచంద్ర, జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, ఆర్డీవో వీవీ రమణ, డీఎస్పీ శ్రీనివాసరావు, డీడీవో ఇ.నాగలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ గవిరెడ్డి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లిలో...
కొత్తూరు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలంలో కొత్తూరులో ఏర్పాటు చేసిన అనకాపల్లి డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్‌బాబు, బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్‌కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, డీడీవో మంజులావాణి, డ్వామా పీడీ పూర్ణిమాదేవి, డీపీవో ఇ.సందీప్, పీఆర్ డీఈ వేణుగోపాల్, ఎంపీడీవో ఆశాజ్యోతి, ఏపీడీ మణికుమార్, ఏపీవో సుప్రియ తదితరులు పాల్గొన్నారు.