గూగుల్ డేటా సెంటర్‌కు మోకాలడ్డు!
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:55 AM
గూగుల్ డేటా సెంటర్ కోసం ఆనందపురం మండలం తర్లువాడలో అధికార యంత్రాంగం చేపట్టిన భూసేకరణకు కొందరు బ్రోకర్లు మోకాలడ్డుతున్నారు.
తర్లువాడలో భూసేకరణకు దళారుల అడ్డంకులు
రైతులను రెచ్చగొట్టేందుకు యత్నాలు
తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం
లావాదేవీలపై విచారణకు నిర్ణయం?
విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):
గూగుల్ డేటా సెంటర్ కోసం ఆనందపురం మండలం తర్లువాడలో అధికార యంత్రాంగం చేపట్టిన భూసేకరణకు కొందరు బ్రోకర్లు మోకాలడ్డుతున్నారు. వైసీపీ హయాంలో అప్పటి పాలకుల దన్నుతో అక్కడ భూముల కొనుగోలుకు అడ్వాన్స్‌లు ఇచ్చిన బ్రోకర్లు ఇప్పుడు తెర వెనుక ఉండి కొందరు రైతులను రెచ్చగొడుతున్నారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ బ్రోకర్ల లావాదేవీలపై పూర్తిస్థాయిలో విచారణకు యోచిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు, కొందరు ఉన్నతాధికారులు నగర శివారు ప్రాంతంలోని పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో భారీగా డీపట్టా భూములు కొనుగోలు చేశారు. ఫ్రీహోల్డ్ అనుమతులు వచ్చిన భూములకు పూర్తిగా సొమ్ములు చెల్లించిన బ్రోకర్లు, అందుకు ప్రతిపాదించిన భూములకు అడ్వాన్స్‌లు ఇచ్చారు. ఇలా ఆనందపురం మండలం తర్లువాడలో డీపట్టా భూములు, రైతుల ఆక్రమణలో ఉన్న భూములకు సంబంధించి సుమారు 30 నుంచి 40 మందికి అడ్వాన్స్‌లు ఇచ్చారు. ఈలోగా ప్రభుత్వం మారడం, ఫ్రీహోల్డ్ వ్యవహారంపై ఆంక్షలు విధించడంతో బ్రోకర్లు జోరు తగ్గించారు. అయితే అడపాదడపా గ్రామాల్లో అడ్వాన్స్‌లు ఇచ్చిన రైతులను కలిసి మాట్లాడుతున్నారు.
కాగా తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించడంతో జిల్లా యంత్రాంగం అక్కడ భూముల తాజా స్థితిపై సర్వే చేసింది. రెవెన్యూ, ఉద్యానవన, వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి ఎంజాయ్‌మెంట్ సర్వే చేసి ప్రతి రైతు నుంచి సమాచారం సేకరించారు. గ్రామంలో ప్రభుత్వానికి చెందిన 308 ఎకరాలు, ప్రైవేటు భూమి మరో ఎనిమిది ఎకరాలు సేకరించేందుకు అన్ని రకాల సర్వేలు పూర్తిచేసి అనంతరం గ్రామ సభ పెట్టారు. ప్రతి రైతు పేరు చదివి అతనికి చెందిన భూ విస్తీర్ణం వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ భూమిలో సుమారు 120 మంది రైతులు ఉన్నట్టు గుర్తించారు. భూసేకరణ కోసం జీవో 571 ప్రకారం రైతులకు పరిహారం ఇవ్వనున్నారు. పట్టా రైతులకు బేసిక్ విలువపై రెండున్నర రెట్లు అందజేసే అవకాశం ఉంది. అయితే గత ప్రభుత్వంలో రైతులకు అడ్వాన్స్‌లు ఇచ్చిన బ్రోకర్లు ఇటీవల గ్రామానికి వచ్చి తమకు ఇస్తామన్న భూముల సంగతి ఏమిటని ప్రశ్నించడంతోపాటు వారిని రెచ్చగొట్టేందుకు యత్నించారని తెలిసింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే ఎక్కువ ఇస్తామని కొంతమంది రైతులను రెచ్చగొట్టడంతో వారంతా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూసేకరణ కోసం తమకు నోటీసులు ఇవ్వలేదని ఇతరత్రా అంశాలపై నిబంధనలు పాటించలేదని పేర్కొంటూ కోర్టుకు వెళ్లడంతో రెవెన్యూ యంత్రాంగం పూర్తి వివరాలు సమర్పించింది. దీంతో రిట్ పిటిషన్‌ను కోర్టు డిస్పోజ్ చేసింది. దీంతో కంగుతిన్న బ్రోకర్లు...మరికొంతమంది రైతులను రెచ్చగొట్టి కోర్టుకు వెళ్లేందుకు పురిగొల్పే ప్రయత్నం చేస్తున్నారని గ్రామంలో ప్రచారం సాగుతుంది. ఇదిలావుండగా పరిహారం విషయమై స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పలుమార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూల ప్రకటన వచ్చింది. రైతులకు అన్నివిధాలా న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న తరుణంలో భూసేకరణకు మోకాలడ్డడంపై పూర్తిస్థాయి విచారణ చేయనున్నట్టు తెలిసింది.