Share News

గూగుల్‌ రాక షురూ

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:05 AM

విశాఖపట్నం చరిత్రలో ‘2025 అక్టోబరు 14’ మైలురాయిగా నిలిచిపోనుంది.

గూగుల్‌ రాక షురూ

  • విశాఖ సిగలో కలికితురాయి

  • ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం

  • ఉమ్మడి జిల్లాలో 480 ఎకరాలు కేటాయింపు

  • పెట్టుబడులు రూ.87,520 కోట్లు

  • ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.88 లక్షల ఉద్యోగాలు

  • గూగుల్‌తో చేతులు కలిపిన అదానీ కనెక్స్‌

  • అంబరాన్ని అంటిన సంబరాలు

  • డేటా హబ్‌గా మారనున్న నగరం

విశాఖపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం చరిత్రలో ‘2025 అక్టోబరు 14’ మైలురాయిగా నిలిచిపోనుంది. భారతదేశ చరిత్రలో కూడా ఇదో పెద్ద విశేషం. ఇప్పటివరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఈ స్థాయిలో ఏ రాష్ట్రానికీ రాలేదు. గూగుల్‌ సంస్థ విశాఖపట్నంలో రూ.87,520 కోట్లతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా రాబోయే రోజుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.88 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్‌ రాకతో హైదరాబాద్‌ ఐటీలో ఎలా అభివృద్ధి సాధించిందో గూగుల్‌ డేటా సెంటర్‌తో విశాఖ అలా వెలుగులీనుతుంది.

గూగుల్‌ డేటా సెంటర్‌ వల్ల 12 దేశాలతో విశాఖ నగరానికి సంబంధాలు కలుస్తాయి. ఏఐ, డేటా అనలిటిక్స్‌లో నిపుణులు తయారవుతారు. అనుబంధ సంస్థలు ఏర్పాటవుతాయి. ఐటీ ఎకో సిస్టమ్‌ పెరుగుతుంది. ఇది విశాఖను అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతుంది. నగరం డేటా హబ్‌గా మారుతుంది.

480 ఎకరాలు కేటాయింపు

గూగుల్‌ డేటా సెంటర్‌కు ముందు ఆనందపురం మండలం తర్లువాడలో 200 ఎకరాలు ఇవ్వాలని అనుకున్నారు. కానీ వారి ప్రణాళికలు భారీగా ఉండడంతో అందుకు తగిన భూములు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తర్లువాడలో 200 ఎకరాలతో పాటు అడవివరంలో సింహాచలం దేవస్థానానికి చెందిన 120 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో మరో 160 ఎకరాలు ఇస్తామని ఒప్పందం చేసింది. ఇవి కాకుండా సింగపూర్‌ నుంచి సముద్ర అంతర్భాగం నుంచి తీసుకువచ్చే సబ్‌మెరైన్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌ కోసం తీర ప్రాంతంలో మరో 15 ఎకరాలు కేటాయించడానికి హామీ ఇచ్చింది. డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్‌ను అందించడానికి అదానీ సంస్థ గూగుల్‌తో చేతులు కలిపింది. అదానీ యాజమాన్యం మధురవాడలో తీసుకున్న 130 ఎకరాల్లో డేటా సెంటర్‌ చేయాల్సి ఉంది. దాని కోసం అదానీ కనెక్స్‌తో జాయింట్‌ వెంచర్‌ చేసింది. ఇప్పుడు ఆ సంస్థ విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, క్లీన్‌ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజీకి అవసరమైన సహకారం గూగుల్‌కు అందించనుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన నీటిని ఇరవై ఏళ్ల పాటు అందించడానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. పదేళ్లపాటు నీటి చార్జీలకు 25 శాతం రాయితీ ప్రకటించింది. విద్యుత్‌ సమకూర్చుకోవడానికి గూగుల్‌ పెట్టే వ్యయం ప్రభుత్వమే భరిస్తుంది. ఈ మొత్తం గరిష్ఠంగా రూ.500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రస్తుతం మార్కెట్‌లో యూనిట్‌ రెండు రూపాయలకే దొరుకుతుండగా, అందులో యూనిట్‌కు రూపాయి రాయితీ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇలా 15 ఏళ్లు విద్యుత్‌ రాయితీ ఇస్తారు. ఇలా అనేక రాయితీలు ప్రభుత్వం ఇచ్చింది. గూగుల్‌ పెట్టుబడి రూ.87,520 కోట్లు అయితే అందులో నాలుగో వంతు అంటే సుమారుగా రూ.22 వేల కోట్లు రాయితీలుగా ఇవ్వడానికి ఒప్పందం జరిగింది.

మిన్నంటిన సంబరాలు

గూగుల్‌ వంటి పెద్ద సంస్థతో ఒప్పందం జరగడంతో నగరంలో సంబరాలు మిన్నంటాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు టపాసులు కాల్చి సంతోషం పంచుకున్నారు. ఎంవీపీ కాలనీలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన క్యాంపు కార్యాలయంలో, జిల్లా పార్టీ కార్యాలయంలో గండి బాబ్జీ, సత్యం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, ఉత్తర నియోజకవర్గం నాయకులు శ్యామలా దీపిక, అగర్వాల్‌ తదితరులు కేకులు కట్‌చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.


గూగుల్‌తో ఊహించని అభివృద్ధి

నగరం రూపురేఖలు మారిపోతాయి

యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు

కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌

విశాఖపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):

గూగుల్‌ డేటా సెంటర్‌ రాకతో విశాఖపట్నం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందని, నగరం రూపురేఖలు మారిపోతాయని కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ డేటా సెంటర్‌ ఆసియాలోనే అతి పెద్దదని, సుమారు రూ.85 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామని, విశాఖ నుంచి భోగాపురం కొత్త విమానాశ్రయానికి 50 నిమిషాల్లో చేరుకోవచ్చునన్నారు. ఇందులో భాగంగా 15 మాస్టర్‌ ప్లాన్‌ రహదారులు వేస్తున్నామన్నారు. వాటిలో ఏడింటికి టెండర్లు కూడా పిలిచామన్నారు. 2026 మే నాటికి రహదారుల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. పోలవరం ఎడమ కాలువ నుంచి అవసరమైన నీటిని తెచ్చేందుకు ప్రణాళికలు ఉన్నాయన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 01:05 AM